30.12.13

తేనె ప్రయోజనాలు

తేనె ప్రయోజనాలు 

1) కంటికీ హృదయానికి మంచిది.

2) ఒక గ్లాసుడు గోరువెచ్చని నీటిలో ఒక చెంచాడు తేనె - ఒక చెక్క నిమ్మరసం కలిపి పరగడుపున ఈ మిశ్రమాన్ని రోజూ తాగుతూ ఉండాలి. దీనివలన మలబద్ధకం పోతుంది. ఇది నీరసం లేకుండా శరీరపు బరువుని తగ్గిస్తుంది.

3) గుండెజబ్బులు, గుండె దడ ఉన్నవారు ప్రతీరోజు నిమ్మరసంలో తేనెని కలుపుకొని రెండు మూడు మార్లు త్రాగటం వలన దడతగ్గి, గుండెకి అలసట లేకుండా ఉంటుంది.

4) గాయాలకి, పుళ్ళకి, కాలిన గాయాలకి తేనెని రాయటం వలన అవి తొందరగా మానిపోతాయి.

5) దగ్గు - గొంతునొప్పులతో బాధపడుతున్నప్పుడు తేనెని వాడటం వలన గొంతులో ఉన్న కఫం  తగ్గి, దగ్గు నుండి ఉపశమనం ఇస్తుంది.

6) తేనె కలిపిన  గోరువెచ్చటి నీటితో  ప్రతీరోజు పుక్కలించుకుంటూ ఉంటే చిగుళ్ళ వ్యాధులు పోతాయి.

7) ప్రతీరోజు తేనెని 2 స్పూన్స్ తీసుకుంటూ ఉంటే రక్తహీనత తగ్గుతుంది.

8) జీర్ణమండలానికి కూడా తేనె మంచిది. వాంతులు - వికారాలు తగ్గుతాయి.

9) ముదుసలి వారికి తేనె మాంచి టానిక్. తేనె తీసుకోవటం వలన వార్థక్యంలో అతిగా బాధించే కఫం తగ్గుతుంది.

10) చిక్కిపోయినవారు పాలు - తేనె - నెయ్యి కలిపి తీసుకుంటూ ఉంటే శరీరంలో మాంస ధాతువు మళ్ళీ తయారయ్యి ఆరోగ్యంగా తయారుఅవుతారు. (ఒక గ్లాసు పాలకి ఒక స్పూన్ తేనె - అర స్పూన్ పేరిన నెయ్యి వాడవచ్చును.)        


                

22.11.13

ఓట్స్ ఇడ్లీ

ఓట్స్ ఇడ్లీ 
కావలసిన పదార్థాలు 

ఓట్స్ --1 కప్పు
బొంబాయి రవ్వ (గోధుమనూక) -- 1/2 కప్పు
మినపపప్పు -- 1 స్పూన్
ఆవాలు -- 1/2 స్పూన్
పచ్చిమిర్చి తురుము -- 1 స్పూన్
పెరుగు -- ఒకటిన్నర కప్పు
నెయ్యి -- 1 స్పూన్
ఇంగువ -- చిటికెడు
ఉప్పు -- తగినంత

తయారీ విధానం 

ముందుగా స్టవ్ వెలిగించి, బాణలి పెట్టి, ఓట్స్ మరియు బొంబాయి రవ్వను విడివిడిగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఓట్స్ చల్లారినతరవాత, మిక్సీ లో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఒక వెడల్పాటి గిన్నెలో రవ్వ - ఓట్స్ పొడి.... పెరుగు, ఉప్పు, పచ్చిమిర్చి తురుము, ఇంగువ వేసి బాగా కలపాలి. ఇప్పుడు బాణలిలో  కొంచెం నూనె వేసి, మినపప్పు - ఆవాలు వేసి చిటపటలాడాక, ఓట్స్ మిశ్రమంలో కలపాలి. మిశ్రమం ఇడ్లిపిండి మాదిరిగా ఉండాలి..... అవసరమైతే కొంచెం నీటిని కలుపుకోవచ్చును. ఇప్పుడు ఇడ్లి రేకులను తీసుకొని, నూనె రాసి,  మిశ్రమాన్ని వేసి....... స్టవ్ వెలిగించి కుక్కర్ లో ఇడ్లి రేకులను 10 నిముషాలు ఉంచి .... ఉడికిన తరవాత దించి, రెండు నిమిషాల (చల్లారిన) తరవాత తీసి ప్లేట్ లో సర్వ్ చేసుకొని మనకు నచ్చిన చట్నీతో కలిపి తినటమే. అంతే ఆరోగ్యకరమైన ఓట్స్ ఇడ్లి రెడీ. చాల త్వరగా ఈ ఇడ్లీలను చేసుకోవచ్చును.  

   

మంచూరియ

 వెజ్ మంచూరియ
కావలసిన పదార్థాలు ---

క్యాబేజీ --  4 కప్పులు
అల్లం -- 50 గ్రా
వెల్లుల్లి -- 10 రెబ్బలు
పచ్చిమిర్చి -- 10
సోయాసాస్ -- 3 స్పూన్స్
ఉప్పు -- తగినంత
మైదాపిండి -- 1/2 కప్పు
టమాటాసాస్ -- 1 కప్పు
నూనె -- 1/4 కేజీ

తయారీ విధానం:--

ముందుగా స్టవ్ వెలిగించి బాణలి పెట్టి, అందులో కొద్దిగా నూనె వేసి ----  సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చిని ...... వేరువేరుగా వేయించి పక్కన ఉంచుకోవాలి, ఇప్పుడు బాణలిలో 2 స్పూన్స్ నూనె వేసి, క్యాబేజీని పచ్చివాసన పోయేంతవరకు వేయించాలి. ఆ క్యాబేజీలో వేయించి పక్కన పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చిని సగం వేసి, ఉప్పు మరియు 2 స్పూన్స్ సోయాసాస్ వేసి కలిపి, పక్కన ఉంచి, చల్లారిన తరవాత...... ఈ మిశ్రమంపై మైదాపిండిని చల్లుతూ ఉండలుగా చుట్టాలి. స్టవ్ వెలిగించి బాణలి పెట్టి, నూనె పోయాలి ........ నూనె కాగేలోపు, మిగిలిన మైదాపిండిని కొంచెం చిక్కగా (బూరెల తోపు పిండిలాగా) కలుపుకొని, తోపులో ముంచి, నూనెలో బంగారు రంగు వచ్చేవరకు వేయించి, ఒక ప్లేటులోకి తీసుకోవాలి,  టమాటాసాస్ & 1 స్పూన్ సోయాసాస్  - మిగిలిన అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చిని.... కొంచెం నీటిని కలిపి వేడిచేసి, అందులో ఉండలు అన్నిటికి వేసి,  సాస్ బాగా అంటేటట్లుగా కలుపుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన  మంచూరియా రెడీ. కొత్తిమీరని పైన అలంకరించుకొని వేడివేడిగా తినెయ్యటమే.  

     
                 

31.10.13

7 కప్పు స్వీట్

7 కప్పు స్వీట్ 

కావలసిన పదార్థాలు 
పచ్చికొబ్బరి తురుము -- 1 కప్పు
శెనగపిండి లేదా మైదాపిండి -- 1 కప్పు
పాలు -- 1 కప్పు
నెయ్యి -- 1 కప్పులు
పంచదార -- 3 కప్పులు
యాలకులపొడి -- 1/2 స్పూన్

తయారీవిధానం 
ముందుగా స్టవ్ వెలిగించి, ఒక మందపాటి గిన్నె పెట్టి, అందులో పైన తెలిపిన పదార్థాలు అన్నీ వేసి, అడుగు అంటుకోకుండా కలుపుతూ ఉండాలి. కలపకుండా ఉంటే మిశ్రమం అడుగు అంటే అవకాశం ఉంది. మిశ్రమం కొద్దిగా దగ్గరపడ్డాక,  ఒక చిన్న బౌల్ లోకి నీరు తీసుకొని, అందులో ఈ మిశ్రమాన్ని కొద్దిగా వేస్తే, ఉండ కట్టింది అంటే, కేకు తాయారు ఐనట్లే. ఇప్పుడు ఒక పళ్ళానికి నెయ్యి రాసుకొని, ఆ పళ్ళెంలో ఈ కేకు మిశ్రమాన్ని వేసి, సరిసమానంగా పరచుకొని, కొద్దిగా ఆరుతున్న సమయంలో, మనకు నచ్చిన ఆకృతిలో ముక్కలను కట్ చేసుకోవాలి. అంతే చాలా రుచికరమైన 7 కప్పు స్వీట్ రెడీ.  చాలా సులువుగా ఈ స్వీట్ ని తాయారుచేసుకోవచ్చును.

           

30.10.13

ఓట్స్ బర్ఫీ

ఓట్స్ బర్ఫీ 

కావలసిన పదార్థాలు 
ఓట్స్ -- 1 కప్పు
జీడిపప్పు -- 1/2 కప్పు
పంచదార -- 3/4 కప్పు
నెయ్యి -- 3 స్పూన్స్
యాలకులపొడి -- 1 స్పూన్
బాదం పప్పు లేకపోతె జీడిపప్పు -- 10 (చిన్నగా ముక్కలు చేసుకోవాలి)

తయారీ విధానం 
ఓట్స్ ను పొడి చేసి ఉంచుకోవాలి, జీడిపప్పును మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి, బాణలిపెట్టి, ఓట్స్ పొడిని, జీడిపప్పు పొడిని దోరగా, విడివిడిగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మందపాటి గిన్నెలో పంచదార వేసి, తగినన్ని నీళ్ళు పోసి, పలుచని తీగపాకం రానివ్వాలి. పాకం వచ్చిన తరవాత, అందులో ముందుగా వేయించి పక్కన పెట్టుకొన్న ఓట్స్ జీడిపప్పు పొడులను, యాలకుల పొడిని అన్నీ కలిపి పాకంలో వేసి బాగా కలపాలి. మిశ్రమం దగ్గర అయ్యాక ఒక ప్లేట్ కి నెయ్యి రాసి, ఆ ప్లేట్ లో ఈ మిశ్రమాన్ని వేసి, దానిపైన బాదాం(జీడిపప్పు)  ముక్కలను సర్ది,  కొంచెం చల్లారక మనకి నచ్చిన ఆకారం లో ముక్కలు కోసుకోవాలి. అంతే  తియ్యని ఓట్స్ బర్ఫీ రెడీ.

         

28.10.13

పల్లీ (వేరుశెనగ పప్పు) లడ్డు

పల్లీ (వేరుశెనగ పప్పు) లడ్డు 

కావలసిన పదార్థాలు 

వేరుశెనగపప్పు (పల్లీలు ) -- 1 కప్పు
బెల్లం తురుము -- అరకప్పు
కొబ్బరి ముక్కలు -- 1/4 కప్పు (సన్నగా తరిగి ఉంచుకోవాలి)
యాలకులపొడి -- 1/4 స్పూన్
నెయ్యి -- కొద్దిగా

తయారీ విధానం:--

ముందుగా స్టవ్ వెలిగించి, బాణలి పెట్టి, పల్లీలు వేయించి, పొట్టుతీసి, మిక్సీలో బాగా మెత్తగా పొడి చేసి  ఉంచుకోవాలి. ఇప్పుడు బాణలిలో కొద్దిగా నెయ్యి వేసి, కొబ్బరి ముక్కలని దోరగా వేయించి పక్కన ఉంచుకోవాలి. తరవాత ఒక మందపాటి గిన్నెలో బెల్లంతురుము వేసి, దానికి సరిపడ నీరు చేర్చి, పాకం వచ్చేవరకు, అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలి. పాకం వచ్చిందో లేదో చూడాలంటె, చల్లటి నీటిలో పాకాన్ని ఒక చుక్క వేస్తె, ఉండకట్టాలి, అలా ఉండకట్టింది అన్నాక, కొబ్బరితురుము, యాలకులపొడి, పల్లీలపొడి వేసి బాగా కలిపి, స్టవ్ మీదనుండి దించెయ్యాలి. కాస్త చల్లారిన తరవాత,  చేతికి వేడి పట్టేటట్టు ఉంటే ఉండలు చుట్టుకోవాలి. అంతే  కమ్మని, నోటిలో వేసుకుంటే కరిగిపోయే పల్లీల ఉండలు రెడీ.


కొబ్బరి పాయసం

కొబ్బరి పాయసం

కావలసిన పదార్థాలు:--

పాలు -- 1/2 లీటరు
కొబ్బరి తురుము -- 1 కప్పు
యాలకుల పొడి -- 1/2 స్పూన్
పంచదార -- 1/4 కేజీ
కిస్ మిస్ -- 2 స్పూన్స్
జీడిపప్పు -- 3స్పూన్స్
బాదంపప్పు -- 2 స్పూన్స్
నెయ్యి -- 2 స్పూన్స్
సగ్గుబియ్యం -- 1/4 కప్పు (10 నిముషాలు ముందు ఉడికించి పక్కన పెట్టుకోవాలి)

తయారీ విధానం:--

ముందుగా  స్టవ్ వెలిగించి ఒక మందపాటి గిన్నెలో నెయ్యి వేసి జీడిపప్పు, కిస్ మిస్ , బాదం పప్పు లను వేరువేరుగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో పాలుపోసి, బాగా మరిగిన తరవాత పంచదార వేసి.... అందులో కొబ్బరి తురుము, ముందుగా ఉడికించి పక్కనపెట్టుకున్న సగ్గుబియ్యం, అన్ని వేసి బాగా మరిగించి, దించేముందు యాలకులపొడిని వేసి, పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పాయసంలో వేయించి పక్కన ఉంచుకున్న .. జీడిపప్పు, కిస్ మిస్, బాదంపప్పు  వేసుకోవాలి. అంతే తియ్యని కమ్మని కొబ్బరి పాయసం రెడీ.




       

రైస్ వడ

రైస్ వడ 

కావలసిన పదార్థాలు:
ఉడికించిన అన్నం -- 2 కప్పులు (కొంచెం మెత్తగా ఉడికించిన అన్నం)
కొబ్బరి తురుము -- 1 కప్పు
పెరుగు -- 1 కప్పు
కారం పొడి -- 1 స్పూన్
అల్లం పచ్చిమిర్చి పేస్టు -- 2 స్పూన్స్
క్యాబేజీ తురుము -- 1/4 కప్పు
క్యాప్సికం తురుము -- 1/4 కప్పు
టమాటా ముక్కలు -- 1/4 కప్పు
మైదాపిండి -- 3 స్పూన్స్
కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, ఇంగువ, ఉప్పు --- తగినంత
నూనె -- 1/4 కేజీ

తయారీ విధానం:--

ముందుగా ఒక వెడల్పాటి డిష్ లో  పెరుగువేసి,  అన్నము ఇంకా మిగిలిన పదార్థాలు ఒక్కొక్కటిగా వేసి, బాగా మెత్తగా కలిపి (గారెల పిండి వలె ఉండాలి) పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి, బాణలి పెట్టి, నూనె వేసి, అన్నం మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని, వడల మాదిరిగా వేసి, ఎర్రగా రెండు వైపులా కాలిన తరవాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇష్టమైన వారు వారికి నచ్చిన చట్నీతో తినవచ్చును. అంతే కమ్మని రైస్ వడ రెడీ.

(చిన్న చిట్కా----- మనకి అన్నం ఎప్పుడైనా మిగిలినట్లు ఐతే, పిల్లల్ని తినమంటే తినరు కాబట్టి, ఇలాగ వడలు వేసి ఇవ్వవచ్చును. ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చిన చాలా త్వరగా ఈ వడలను చేసి సర్వ్ చేయవచ్చును.)

              

     

21.10.13

పొట్లకాయ తిమ్మనం

పొట్లకాయ తిమ్మనం

కావలసిన పదార్థాలు
బియ్యపు పిండి -- 3 స్పూన్స్
పొట్లకాయ ముక్కలు -- 1 కప్పు (ఉడికించినవి)
కొబ్బరి -- 4 స్పూన్స్
పాలు -- 1/2 లీటరు
పంచదార -- 1/4 కేజీ
జీడిపప్పు -- 50 గ్రా
కిస్ మిస్ -- 25 గ్రా
యాలకులపొడి -- 1 స్పూన్
నెయ్యి -- 2 స్పూన్స్

తయారీ విధానం:--

ముందుగా  బియ్యంపిండిని, కొబ్బరిని మిక్సీలో మెత్తగా రుబ్బి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మందపాటి గిన్నెలో పాలుపోసి మరిగించి, పంచదార వేసి పాలను బాగా మరిగించాలి. ఇప్పుడు రుబ్బి ఉంచుకున్న కొబ్బరి + బియ్యపుపిండి మిశ్రమాన్ని మరియు ఉడికించి ఉంచుకున్న పొట్లకాయ ముక్కలని వేసి సన్నటి సెగ మీద 10 నిముషాలు ఉడకనివ్వాలి. కొంచెం చిక్కబడే సమయానికి దించెయ్యాలి. ఇప్పుడు ఒక చిన్న బాణలిలో నెయ్యి వేసి... జీడిపప్పు + కిస్ మిస్ లను దోరగా వేయించి తిమ్మనంలో వేసుకుని, యాలకులపొడిని కూడా కలిపుకోవాలి. అంతే తియ్యటి తిమ్మనం రెడీ. ఈ తిమ్మనంలో అట్లను నంజుకొని తింటే చాలా బావుంటుంది.



అట్లతద్ది అట్లు

అట్లతద్ది అట్లు 

కావలసిన పదార్థాలు:--

మినప్పప్పు -- 1 కప్పు
బియ్యం -- 2 కప్పులు
ఉప్పు -- తగినంత
జీలకర్ర -- 1 స్పూన్
నూనె -- తగినంత

తయారీ విధానం:--
మినప్పప్పు & బియ్యం 4 గంటలు ముందుగా నానబెట్టి, రుబ్బుకుని, ఉప్పు & జీలకర్ర కలిపి 8 గంటలు నాననివ్వాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి, పెనం (pan) పెట్టుకొని, వేడి ఎక్కిన తరవాత నూనె రాసి, అట్టుని వేసుకొని, దోరగా కాలిన తరవాత తీసేయ్యటమే. పిండిని కొంచెం గట్టిగా రుబ్బుకుంటే, పెనం మీద వేసేటప్పుడు గట్టిగా రుద్ది అట్టుని వేస్తె అట్టు మృదువుగా వస్తుంది. అంతే ఎంతో రుచిగా ఉండే అట్లతద్ది అట్లు రెడీ....నోము నోచినవాళ్ళు ఇలాగ అట్లు వేసుకొని తింటారు. ముత్తైదువులకు వాయనం ఇవ్వటానికి చిన్న చిన్న అట్లని వేసి ఇస్తారు. ఈ అట్లని బెల్లం పాకంతో కానీ, తిమ్మనంతో కానీ తింటే బావుంటుంది. 


10.10.13

కూరగాయల అన్నం

కూరగాయల అన్నం (Mixed Vegetable Rice)

కావలసిన పదార్థాలు:--

క్యారెట్ ముక్కలు -- 1/4 కప్పు
క్యాప్సికం ముక్కలు -- 1/4 కప్పు
టమాట ముక్కలు -- 1/4 కప్పు
పచ్చిబఠాణీ -- 1/4 కప్పు
వంకాయముక్కలు -- 1/4 కప్పు
బెండకాయ ముక్కలు -- 1/4 కప్పు
తీపిగుమ్మిడి ముక్కలు -- 1/4 కప్పు
కరివేపాకు & కొత్తిమీర -- కొద్దిగా
కందిపప్పు -- 1/2 కప్పు
బియ్యం -- 2 పావులు  
చింతపండుగుజ్జు -- 1/4 కప్పు
పోపుదినుసులు -- తగినంత
ఉప్పు -- రుచికి సరిపడినంత
నూనె -- 1/4 కేజీ

తయారీవిధానం:--

ముందుగా బియ్యాన్ని కడిగి పక్కనపెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి నూనెవేసి, పోపుదినుసులు వేసి, వేగినతరవాత  కూరగాయ ముక్కల్ని, కరివేపాకు & కొట్టిమీరని  ఒక్కొక్కటిగా వేసి, కడిగిన కందిపప్పును, బియ్యాన్ని, తగినంత ఉప్పును, చింతపండుగుజ్జును వెయ్యాలి. అన్నీ వేసిన తరవాత బాగా కలియబెట్టి, 4 పావులు  నీళ్ళు పోసి, మిగిలిన నూనెను వేసి, కుక్కరు మూతపెట్టి, 5 విసెల్స్ వచ్చేవరుకు ఉంచి దించుకోవాలి. అంతే రుచికరమైన  కూరగాయల అన్నం రెడీ.        

రవ్వకేసరి

రవ్వకేసరి 

కావలసిన పదార్థాలు:--
గోధుమనూక (బొంబాయి రవ్వ) -- 1/2 కేజీ
పంచదార -- 1/2 కేజీ
నెయ్యి -- 1/4 కేజీ
జీడిపప్పు -- 50 గ్రాములు
కిస్ మిస్ -- 50 గ్రాములు
కేసరి రంగు -- చిటికెడు
పాలు & నీళ్ళు -- 1 లీటరు
యాలకులపొడి -- 1 స్పూన్

తయారీవిధానం:--
ముందుగా  గోధుమనూకని వేయించి పక్కనపెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక గిన్నెను తీసుకొని, 1  లీటరు పాలు నీళ్ళుపోసి, బాగా మరిగిన తరవాత, గోధుమనూక.... పంచదార, యాలకులపొడిని  కలిపి మసిలిన నీటిలో వేసి, కేసరి రంగును చిటికెడు వేసుకోవాలి. బాగా దగ్గరపడిన తరవాత, దించి పక్కనపెట్టుకోవాలి. ఇప్పుడు బాణలిలో నెయ్యివేసి జీడిపప్పు & కిస్ మిస్ ని దోరగా వేయించి కేసరిలో కలపాలి. అంతే  తియ్యని.... కమ్మని రవ్వకేసరి రెడీ.

           

(చిల్లులు లేని) అల్లం గారెలు

(చిల్లులు లేని) అల్లం గారెలు

కావలసిన పదార్థాలు:--
మినప్పప్పు -- 1/2 కేజీ
అల్లం -- 100 గ్రాములు
పచ్చిమిర్చి -- 50 గ్రాములు
జీలకర్ర -- 2 స్పూన్స్
కొత్తిమీర & కరివేపాకు -- కొంచెంగా 
నూనె -- 1/2 కేజీ
ఉప్పు -- తగినంత

తయారీవిధానం:--
గారెలు చేసే 2 గంటల ముందుగా మినప్పప్పుని నానబెట్టాలి. నానిన తరవాత నీళ్ళు తక్కువగా పోసి, గారెలపిండిలాగ గట్టిగా రుబ్బుకోవాలి. అల్లం, పచ్చిమిర్చి ముద్దలాగా చేసుకొని కలుపుకోవాలి. జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలి పెట్టి, నూనె పోసి గారెలపిండిని తీసుకొని చిల్లులు లేకుండా వడలులాగా వేసుకోవాలి. దోరగా వేయించి తీసుకోవాలి. అంతే వేడివేడి కమ్మని అల్లం గారెలు రెడీ.              


కొబ్బరి అన్నం

కొబ్బరి అన్నం 

కావలసిన పదార్థాలు:--

బియ్యం -- 1/2 కేజీ
కొబ్బరి తురుము -- 4 కప్పులు
జీడిపప్పు -- 50 గ్రాములు
నెయ్యి -- 50 గ్రాములు
ఏలకులు -- 4
లవంగాలు -- 4
దాల్చినచెక్క -- 4 ముక్కలు
పచ్చిమిర్చి -- 5 (చీలికలు చేసుకోవాలి) 
కరివేపాకు -- తగినంత
పల్లీలు -- 4 స్పూన్స్
ఉప్పు -- తగినంత

తయారీవిధానము:--
ముందుగా బియ్యం కడిగి పక్కన ఉంచుకోవాలి,  కొబ్బరితురుమును మిక్సీలో వేసి బాగా మెత్తగా చేసి, పాలను తీసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాత్రను పెట్టి, కొద్దిగా నెయ్యి వేసి, యాలకులు, లవంగాలు, దాల్చినచెక్క, జీడిపప్పు,  పల్లీలు, పచ్చిమిర్చి వేసి వేగిన తరవాత కొబ్బరిపాలు పోసి, కడిగి పక్కన పెట్టుకున్న బియ్యాన్ని వేసి, తగినంత ఉప్పు వేసి, మూతపెట్టి, ఉడికేంతవరకు ఉంచి, దించుకోవాలి. అంతే కమ్మని కొబ్బరి అన్నం రెడీ.

               

9.10.13

మినపసున్ని ఉండలు

మినపసున్ని ఉండలు 
కావలసిన పదార్థాలు:--

మినప్పప్పు  --  కేజీ
పంచదార --  కేజీ లేదా బెల్లం
బియ్యం --  1 కప్పు
నెయ్యి : 1/2 కేజీ

తయారీవిధానం:--

ముందుగా స్టవ్ వెలిగించి, బాణలి పెట్టి, మినప్పప్పుని దోరగా వేయించి పక్కనపెట్టుకోవాలి. కొంచెం చల్లారాక బియ్యాన్ని, మినప్పప్పుని  మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పంచదారని కూడా మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి, ఒక గిన్నెలో నెయ్యిని వేసి కరిగించి,  మినపపొడి మీద వేసి బాగా కలిపి, మనకు  కావలసినట్టు ఉండలు చుట్టుకోవాలి.  అంతే నోట్లోవేస్తే కరిగిపోయే మినపసున్ని ఉండలు రెడీ.

       

రవ్వలడ్డు (కొబ్బరి లస్కోరా)

రవ్వలడ్డు (కొబ్బరి లస్కోరా)

కావలసిన పదార్థాలు:--

బొంబాయి రవ్వ(గోధుమనూక) -- అరకేజీ
పంచదార -- అరకేజీ
నెయ్యి -- 1 కప్పు
యాలుకల పొడి -- 1  స్పూన్
కొబ్బరి పొడి -- 1 కప్పు
జీడిపప్పు & కిస్మిస్  -- 1/4 కప్పు

తయారీవిధానం:--

ముందుగా స్టవ్ వెలిగించి,బాణలి పెట్టి,  నెయ్యి వేడిచేసి, రవ్వను దోరగ వేయించి, ఒక పళ్ళెంలో వేసుకోవాలి. బాణలిలో కొంచెంగా నెయ్యివేసి, జీడిపప్పు & కిస్మిస్ ని వేసి దోరగా వేయించి, నూకమీద వెయ్యాలి. వెంటనే  వేడి రవ్వలో పంచదార, కొబ్బరి పొడి, యాలుకల పొడి కలిపి రెండు నిముషాలు ఉంచాలి.రవ్వ వేడికి పంచదార కరిగి కొద్దిగా తడి అవ్వుతుంది. ఇప్పుడు మిశ్రమాన్ని అంతా బాగా కలిపి, మనకి నచ్చిన సైజులో  ఉండలు చుట్టుకోవాలి. అంతే తియ్యనైన రవ్వలడ్డు (కొబ్బరి లస్కోరా)  రెడీ.





చింతపండు పులిహోర

చింతపండు పులిహోర

కావలసిన పదార్థాలు
పొడిపొడిగా వండిన అన్నం -- 4 కప్పులు 
చింతపండు గుజ్జు -- పావు కప్పు 
పచ్చిమిర్చి -- 6(నిలువుగా చీల్చి ఉంచుకోవాలి)
ఎండుమిర్చి -- 3
పోపుదినుసులు --  తగినన్ని(మినప్పప్పు , శెనగపప్పు , ఆవాలు, కొంచెంగా మెంతులు )
వేరుశెనగ పప్పు (గుళ్ళు) -- పావుకప్పు 
కరివేపాకు రెబ్బలు -- కొద్దిగా 
పసుపు & ఉప్పు --  రుచికి తగినంత  
ఇంగువ -- 1/2 స్పూన్ (ఇష్టమైతే మరికొంచెం వేసుకోవచ్చును)
నూనె -- 1 కప్పు 

తయారీవిధానం
ముందుగా స్టవ్ వెలిగించుకొని, బాణలి పెట్టి, కొద్దిగా నూనె వేసి చింతపండుగుజ్జులో కొద్దిగా ఉప్పు, పసుపు వేసి చింతపండు దగ్గరపడేవరకు మగ్గించి, పక్కనపెట్టుకోవాలి. ఇప్పుడు మల్లి బాణలి పెట్టి నూనెవేసి, పోపుదినుసులు, వేరుశెనగగుళ్ళు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఇంగువ, అన్నీ వేసి బాగా వేగాక కొంచెం పోపును తీసి పక్కన పెట్టుకోవాలి, మిగిలినపోపులో మగ్గించి పక్కనపెట్టుకున్న చింతపండుగుజ్జును వేసి, 5 నిముషాలు ఉంచి, దించి ఒక బేసనలో ఉంచుకొన్న అన్నం మీద పోపుని, చింతపండుతో కలిసిన పోపుని వేసి బాగా కలియబెట్టాలి. అంతా కలిసాక పైన మిగిలిన నూనెను వేసి మరొక్కసారి కలపాలి.  అంతే కమ్మని వాసనగల చింతపండు పులిహోర రెడీ.

పండుగనాడు ప్రతీఒక్క ఇంట్లోను చేసుకొనే ప్రసాదములలో ఇది ముందుగా ఉంటుంది. ఎందుకంటే పర్వదినాలలో పసుపుఅన్నం తప్పనిసరిగా చెయ్యాలని ..... అందరూ చేస్తారు. 

       

14.9.13

వంటింటి చిట్కాలు

వంటింటి చిట్కాలు

1) గిన్నెలకు గ్రీజు మరకలు అంటితే సబ్బునీళ్ళలో వినేగార్ కలిపి రుద్దితే పోతాయి.
2) కూరలో ఉప్పు ఎక్కువైతే కాస్త బియ్యప్పిండి కలపాలి.
3) అరటికాయ ముక్కలను కాసేపు మజ్జిగలో వేసి తీసి వేయిస్తే చక్కగా వేగుతాయి.
4) ఆపిల్ ముక్కల మీద నిమ్మ రసం రాస్తే రంగు మారకుండా ఎక్కువ సమయం తాజాగా ఉంటాయి.
5) కూరలు చేసేటప్పుడు నూనె వేడెక్కగానే పసుపు వేస్తే, కూరలు వాటి సహజ రంగు కోల్పోకుండా ఉంటాయి.
6) కూరల్లో పులుసులో ఉప్పు కారం ఎక్కువయ్యినప్పుడు రెండు చెంచాల సెనగపిండిని వేయించి కలిపితే సరిపోతుంది.
7) ఇడ్లీలు మృదువుగా రావాలంటే ప్లేట్లో పిండి వేసాక తడి చేత్తో అద్దితే సరిపోతుంది.
8) పిండి వంటలు చేసేటప్పుడు బాణలిలో నూనె పొంగాకుండా ఉండాలంటే, మరుగుతున్న నూనెలో తమలపాకు వేసి … అది రంగు మారాక తీస్తే సమస్య ఉండదు.
9) పులిహొర చేసేటప్పుడు అన్నం ఉడికే సమయంలో చెంచా నెయ్యి కాని వెన్న కాని వేస్తే అన్నం ముద్ద కాకుండా పొడి పొడిగా వస్తుంది.
10) టమాటాలు వండటానికి ముందు పదినిమిషాల పాటు వేడినీటిలో నానపెడితే వంటకాలు రుచిగా ఉంటాయి.
11) వంటకాల్లో సుగంధ ద్రవ్యాలను అలాగే వేయటానికి బదులు, పొడి చేసి వేస్తే పదార్థాలు కమ్మటి వాసన వస్తాయి.
12) బియ్యం నిల్వ చేసిన డబ్బాలో, గుప్పెడు పుదినా ఆకులు వేస్తే పురుగులు పట్టవు.
13) అప్పడాలు ఉంచిన డబ్బాలో కొన్ని బియ్యం లేదా సెనగపప్పు వేస్తే మెత్త బడకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి.
14) ఆపిల్ పండ్ల పక్కనే అరటి పండ్లని ఉంచితే, అవి త్వరగా పండుతాయి.
15) కారం నిల్వ ఉంచిన డబ్బాలో చిటికెడు ఇంగువ కలిపితే పురుగులు పట్టకుండా ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది.

8.9.13

పాల ఉండ్రాళ్ళు --రవ్వ ఉండ్రాళ్ళు -- జిల్లేడుకాయలు

పాల ఉండ్రాళ్ళు 

కావలసిన పదార్థాలు

బియ్యంపిండి -- 1 కప్పు
మంచినీళ్ళు -- 2 కప్పులు
పంచదార -- 1 కప్పు
పాలు -- 1 కప్పు
యాలకుల పొడి -- 1/2 స్పూన్

తయారీవిధానం

ముందుగా స్టవ్ వెలిగించి, ఒక మందపాటిగిన్నెలో 2 కప్పుల నీళ్ళు పోసి, మరిగిన తరవాత బియ్యంపిండి వేస్తూ, ఉండలు కట్టకుండా తిప్పుతూ, అంతా బాగా కలిసిన తరవాత, స్టవ్ మంట తగ్గించి, గిన్నె మీద మూతపెట్టి 5 నిముషాలు అయ్యాక, స్టవ్ మీద నుండి దించి, చల్లారిన తరవాత చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు స్టవ్ వెలిగించి, బాణలి పెట్టి, పంచదార వేసి .. తగినన్ని నీళ్ళు పోసి మరిగించాలి. ఈ పాకంలో ముందుగా చేసి పక్కన పెట్టిన చిన్న ఉండలని వేసి, పాలు, యాలకులపొడిని వేసి, ఉండలకి పాలు... పాకం అంతా కలిసిన తరవాత దించెయ్యాలి. అంతే కమ్మని పాల ఉండ్రాళ్ళు రెడీ.




జిల్లేడుకాయలు  

కావలసిన పదార్థాలు 
బియ్యంపిండి -- 1 కప్పు 
బెల్లంతురుము -- 1 కప్పు 
కొబ్బరితురుము -- 1 కప్పు 
యాలకులపొడి -- 1/2 స్పూన్ 
నెయ్యి -- 1 స్పూన్ 
ఉప్పు -- తగినంత 

తయారీవిధానం

ముందుగా స్టవ్ వెలిగించి, ఒక గిన్నె పెట్టి నీళ్ళు పోసి, మరిగిన తరవాత, కొంచెంగా నూనె , ఉప్పు వేసి కలిపి, బియ్యంపిండిని వేస్తూ, ఉండలు కట్టకుండా తిప్పి, 2 నిముషాలు తరవాత దించుకోవాలి. చల్లారిన తరవాత చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 

ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలి పెట్టి, బెల్లంతురుము, కొబ్బరితురుము వేసి తక్కువ మంటపై ఉంచి, ఆ మిశ్రమం గట్టిపడేవరకు ఉంచాలి. చివరగా యాలకులపొడిని వేసి దించాలి. 

చేతులకు నెయ్యి రాసుకొని, ముందుగా చేసి ఉంచుకున్న ఉండలని చిన్న చపాతీలాగా చేతితోనే వత్తుకోవాలి, అందులో కొబ్బరి పూర్ణం కొంచెంగా ఉంచి, ఆ చపాతీని ఉండలుగా.... అండాకారంగా చుట్టుకోవాలి. ఇలాగ అన్నీ చేసి ఉంచుకొని... స్టవ్ వెలిగించి ఇడ్లీ రేకులలో ఈ జిల్లేడుకాయలని ఉంచి 10 నిముషాలు ఆవిరి పెట్టి, తరవాత దించుకోవాలి. అంతే జిల్లేడుకాయలు రెడీ. 



రవ్వ కుడుములు 


కావలసిన పదార్థాలు --
వరినూక(బియ్యం రవ్వ) -- 1కప్పు
శెనగపప్పు -- 2 స్పూన్స్
కొబ్బరితురుము -- 2 స్పూన్స్
జీలకర్ర -- 1/2 స్పూన్
నెయ్యి -- 2 స్పూన్స్
ఉప్పు -- రుచికి తగినంత

తయారీవిధానం:--

శెనగపప్పుని కడిగి 15 నిముషాలు నానబెట్టి నీళ్ళు వంపేసి ఉంచాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి, ఒక గిన్నెలో నీళ్ళు పోసి, మరిగిన తరవాత ఉప్పు & జీలకర్ర వేసి, రవ్వను వేస్తూ ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. నీరు అంతా ఇంకిపోయి, రవ్వ ఉడికిన తరవాత దించి చల్లారిన తరవాత, కొబ్బరితురుము - నానబెట్టిన శెనగపప్పు - నెయ్యి వేసి, గుండ్రంని ఉండలుగా చేసుకొని, ఇడ్లీ రేకులలో ఉంచి..... స్టవ్ వెలిగించి ఇడ్లీ కుక్కర్ ను సుమారుగా 10 నిముషాలు ఉంచి ఆవిరిపెట్టి, దించుకోవాలి. అంతే వినాయకునికి ఇష్టమైన రవ్వకుడుములు రెడీ.

                      
                 

3.9.13

మసాలా ఇడ్లీ

మసాలా ఇడ్లీ:--

కావలసిన పదార్థాలు:-
మినప్పప్పు  -- 1 కప్పు
బియ్యం -- 3 కప్పులు
క్యాబేజీ తురుము -- 1/4 కప్పు
టమాట ముక్కలు -- 1/2 కప్పు
బంగాళదుంపలు -- 1/2 కప్పు
క్యారెట్ ముక్కలు -- 1/2 కప్పు
ఉల్లిపాయ ముక్కలు -- 1 కప్పు
పచ్చిమిర్చి -- 4
వేరుశెనగ పప్పు (పల్లీలు) -- కొంచెంగా
అల్లం పేస్టు -- 1 స్పూన్
కొత్తిమీర తురుము -- కొంచెంగా
పోపు సామాన్లు
ఉప్పు -- రుచికిసరిపడా

తయారీవిధానం:--
మినప్పప్పు, బియ్యం విడివిడిగా నానబెట్టుకోవాలి. ఈ రెండూ విడివిడిగానే రుబ్బుకొని, ఉప్పువేసి కలిపి రాత్రంతా పులియబెట్టాలి. తెల్లారాక కూరగాయముక్కల్ని కోసి, ఉడికించి పక్కనపెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి, బాణలిపెట్టి, నూనెవేసి, పోపుసామన్లు వేసి, వేగాక ఉడికించిపక్కనపెట్టుకున్న కూరగాయముక్కల్ని, అల్లంపేస్టుని, కొత్తిమీర తురుముని అన్నీ వేసి, బాగా వేగిన తరవాత, ఇడ్లీ పిండిలో వేసి బాగా కలపాలి.

ఈ పిండిని నేయ్యిరాసిన ఇడ్లీ ప్లేటులో వేసి, 10 నిముషాలు స్టవ్ మీద ఉంచి దించుకోవాలి. అంతే వేడివేడి మసాలా ఇడ్లీ రెడీ. ఈ ఇడ్లీలలో చెట్నీ నంచుకొనే పనిలేదు. ఇష్టమైనవారు వారికి నచ్చిన చెట్నీలను నంచుకోవచ్చును.

                   


9.8.13

క్యాబేజీ రోల్స్

క్యాబేజీ రోల్స్----

కావలసిన పదార్థాలు:--

శెనగపిండి -- 3 కప్పులు
వారిపిండి -- 1 కప్పు
క్యాబేజీ ఆకులు -- 12పెద్దవి
బంగాళదుంపలు -- 1/2 కేజీ
కొత్తిమీర తరుగు -- 1/2 కప్పు
గరంమసాలా పొడి -- 1 స్పూన్
అల్లం & పచ్చిమిర్చి పేస్టు -- 2 స్పూన్స్
ఉప్పు & పసుపు -- తగినంత
వంటషోడా -- చిటికెడు
నూనె -- 1/2 కేజీ

 తయారీ విధానం:--

ముందుగా శెనగపిండి, వరిపిండి, ఉప్పు, వంటషోడా అన్నీ కలిపి బజ్జీలపిండిలాగా కొంచెం జారుగా కలిపి పక్కన ఉంచుకోవాలి. క్యాబేజీ ఆకులను శుభ్రంగా తుడిచి ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి, ఒక కుక్కర్లో బంగాళదుంపల్ని ఉడికించి పక్కనపెట్టుకోవాలి. దుంపలకి తొక్కతీసి, మెత్తగా చిదిమి, దానిలో అల్లం & పచ్చిమిర్చి పేస్టు, గరంమసాలా, ఉప్పు, పసుపు, కొత్తిమీర తరుగు అన్నీ వేసి, బాగా కలిపి, ఒక క్యాబేజీ ఆకులో ఈ పిండి మిశ్రమాన్ని వేసి, రోల్ లాగా చుట్టుకొని, ఆకు ఊడిపోకుండా, చివరన tooth pin ని గుచ్చి ఉంచాలి. అన్ని రోల్స్ ని ఇలాగే రెడీ చేసుకొని, స్టవ్ వెలిగించి, బాణలిపెట్టి, నూనె వేసి, కాగిన తరవాత ఒక్కొక్క రోల్ ని ముందుగా కలిపి ఉంచుకున్న శెనగపిండిలో ముంచి,  ఒక్కొక్కటిగా నూనెలో వేసి, దోరగా గోధుమ రంగు వచ్చేవరకు వేయించి, తీసి పక్కన పెట్టుకోవాలి. అంతే కరకరలాడే కమ్మని క్యాబేజీ రోల్స్ రెడీ. వీటిని ఇష్టముంటే టమాటా సాస్ తో తినొచ్చును.



    

21.7.13

మిక్సెడ్ వెజిటబుల్ కిచిడి

మిక్సెడ్ వెజిటబుల్ కిచిడి:--

కావలసిన పదార్థాలు:--

బియ్యం -- 2 కప్పులు 
పెసరపప్పు -- 1/23 కప్పు 
క్యారెట్ తురుము -- 1 కప్పు 
పాలకూర తురుము -- 2 కప్పులు 
పచ్చి బఠాణీ -- 1/2 కప్పు 
కాలిఫ్లోవేర్ -- 2 ముక్కలు 
బీన్స్ ముక్కలు -- 1కప్పు
క్యాప్సికం ముక్కలు -- 2 కప్పులు
ఉల్లిపాయ ముక్కలు -- 2 కప్పులు
అల్లం & పచ్చిమిర్చి పేస్టు -- 3 స్పూన్స్
కొత్తిమీర తురుము -- 4 స్పూన్స్
పసుపు -- చిటికెడు
ఉప్పు -- తగినంత
నూనె -- 1/2 కప్పు

తయారీ విధానం:--
బియ్యం, పప్పు కలిపి కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి, కుక్కర్ పెట్టి, నూనె వేసి, పైనచెప్పిన మసాలా దినిసులు వేసి వేయించి, వేగిన తరవాత అల్లం, మిర్చి పేస్టు వేసి, అన్నిరకాలకూరల ముక్కలు వేసి వేయించి, కొంచెం వేగిన తరవాత కడిగి పక్కనపెట్టుకున్న బియ్యం,పప్పుని వేసి, తగినంత ఉప్పు మరియు నీరు పోసి బాగా కలియపెట్టి కుక్కర్ మూతపెట్టి, విసిల్ పెట్టాలి. 4 కూతలు వచ్చిన తరవాత దించి పక్కనపెట్టుకోవాలి. మూత తీసిన తరవాత కొత్తిమీర వేసి కలుపుకోవాలి.... అంతే వేడి -- వేడి ఘుమఘుమలాడే మిక్సెడ్ వెజిటబుల్ కిచిడి రెడీ.





18.7.13

దద్ధోజనం

దద్ధోజనం 

కావలసిన పదార్థాలు:--
బియ్యం -- 4 కప్పులు 
పెసరపప్పు -- 1/2 కప్పు 
పెరుగు -- 5 కప్పులు 
అల్లం -- చిన్నముక్క 
కొత్తిమీర & కరివేపాకు -- కొంచెంగా 
ఉప్పు -- తగినంత 
పచ్చిమిర్చి -- 4 
పోపుసామను -- కొద్దిగా
నూనె -- కొంచెం

తయారీ విధానం:--
బియ్యం & పెసరపప్పు కలిపి కడిగి మామూలు కంటే కొంచెం ఎక్కువగా నీరు పోసి ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించి కడిగి ఉంచుకున్న బియ్యం & పప్పును ఉడికించుకోవాలి. పెరుగులో ఉప్పు, దంచిఉంచుకున్న అల్లాన్ని , చీల్చి ఉంచుకున్న పచిమిర్చిని వేసి కలుపుకోవాలి. సన్నగా తరిగి ఉంచుకున్న కొత్తిమీర & కరివేపాకు వేసి పోపు వేసి ఉంచుకోవాలి. ఉడికించి పక్కన పెట్టుకున్న అన్నం చల్లారక పెరుగులో కలుపుకోవాలి. 
ఇష్టమైనవారు ఇందులో జీడిపప్పు కూడా వేసుకోవచ్చును. అంతే కమ్మని దద్ధోజనం రెడీ. 





కట్టు పొంగలి

కట్టు పొంగలి 

కావలసిన పదార్థాలు:--
బియ్యం -- 2 కప్పులు 
పెసరపప్పు -- 1/2 కప్పు 
నెయ్యి -- 50 గ్రాములు 
మిరియాలు -- 2 స్పూన్స్ 
జీలకర్ర -- 1 స్పూన్ 
అల్లం -- చిన్నముక్క 
ఇంగువ -- కొంచెంగా 
ఉప్పు -- తగినంత
పసుపు -- చిటికెడు

తయారీ విధానం:--
ముందుగా మిరియాలు & జీలకర్ర పొడిచేసి ఉంచుకోవాలి. ముందుగా బియ్యం & పెసరపప్పు కలిపి కడిగి తగినంత నీరు పోసి, అల్లంముక్క మెత్తగా దంచి వేయ్యాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడిగిన బియ్యం, పప్పుని ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే స్టవ్ మీద బాణలి పెట్టి నెయ్యి వేసి, దంచి ఉంచుకున్న మిరియాలు, జీలకర్ర పొడి, ఇంగువ వేసి వేగిన తరవాత, ఉడికించి పక్కన పెట్టుకున్న అన్నాన్ని, తగినంత ఉప్పు & పసుపు వేసి బాగా కలియబెట్లి దించుకోవాలి. ఇష్టమైనవారు ఇందులో జీడిపప్పు కూడా వేసుకోవచ్చును.
అంతే వేడి వేడి కట్టుపొంగలి రెడీ.




11.7.13

రవ్వ ఇడ్లీ

రవ్వ ఇడ్లీ:--

కావలసిన పదార్థాలు:--
బొంబాయి రవ్వ -- 1/4 కేజీ 
అల్లం పేస్టు -- 1 స్పూన్ 
పచ్చిమిర్చి పేస్టు -- 2 స్పూన్స్ 
ఉప్పు -- రుచికి తగినంత
చిక్కటి పెరుగు -- 3 కప్పులు
కరివేపాకురెబ్బలు -- 4
పోపు సామాన్లు -- కొద్దిగా
నెయ్యి -- కొంచెంగా

తయారీ విధానం:--
ముందుగా స్టవ్ వెలిగించి, బాణలి పెట్టి, 2 స్పూన్స్ నెయ్యివేసి, కరిగాక, బొంబాయి రవ్వను వేసి, మాడకుండా సన్నని మంటపై గోధుమరంగు వచ్చేవరకు వేయించి, ఒక గిన్నెలో వేసి పక్కనపెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ బాణలిలో, పోపు వేసుకొని, అందులో అల్లం-- పచ్చిమిర్చి పేస్ట్లు , కరివేపాకు, పెరుగు వేసి, అందులోనే వేయించి పక్కనపెట్టుకున్న రవ్వను కూడా వేసి, బాగా కలియపెట్టి 2 నిముషాలు ఉంచి దించి పక్కనపెట్టుకోవాలి.

చల్లారిన తరవాత ఇడ్లీస్టాండ్ తీసుకొని, నూనె రాసుకొని, ఆ రవ్వ మిశ్రమాన్ని ఇడ్లీ ప్లేట్లలో వేసుకొని, కుక్కర్ లో పెట్టి, స్టవ్ వెలిగించి, కుక్కరు పెట్టి, 15 నిముషాలు ఉంచితే ఇడ్లీలు రెడీ. అంతే వేడి - వేడి రవ్వ ఇడ్లీలు మీ ముందు సిద్దం.  ఈ వేడి-- వేడి ఇడ్లీలలను కొబ్బరి చట్నీతో తింటే చాలా బావుంటుంది. లేదా మనకి ఇష్టమైన చట్నీలతో తినొచ్చును.

ఈ రవ్వ ఇడ్లీలు చేసుకోవటం చాలా సులువు. పప్పు నానబెట్టుకోవటం, రుబ్బుకోవటం వంటి ఇబ్బందులు పడకుండాఉంటాము. మనకి అర్జెంటుగా ఇడ్లీలు కావాలన్నప్పుడు ఇలా చేసుకోవచ్చును. 





బ్రెడ్ ఛాట్

బ్రెడ్ ఛాట్

కావలసిన పదార్థాలు
బ్రెడ్ -- 1 ప్యాకెట్
పచ్చిబఠాణీ -- 1 కప్పు (ఉడికించినవి)
బంగాళదుంప ముక్కలు -- 1 కప్పు (ఉడికించినవి)
టమాట ముక్కలు -- 1/2 కప్పు
ఉల్లిపాయముక్కలు -- 1 కప్పు (సన్నగా తరిగి ఉంచుకోవాలి)
కొత్తిమీర -- (సన్నగా తరిగాలి) 2 స్పూన్స్
కారం & ఉప్పు -- తగినంత
పసుపు -- చిటికెడు
ఛాట్ మసాలా -- 1 స్పూన్
సన్న కారప్పూస -- 1 కప్పు
చింతపండు గుజ్జు -- 1 స్పూన్
నూనె -- కొంచెం

తయారీ విధానం
ముందుగా స్టవ్ వెలిగించి, బాణలి పెట్టి, కొంచెంగా నూనె వేసి ఉడికించి పక్కన పెట్టుకున్న బఠాణీలను వేసి, అందులో ఉప్పు, కారం, చిటికెడు పసుపు, చింతపండుగుజ్జు, వేసి కలపాలి. తగినంత నీరు పోసి చిక్కగా అయ్యేవరకు ఉడికించి పక్కనపెట్టుకోవాలి.

వేరే ఒక డిష్ లో సన్నగా తరిగిన ఉల్లిపాయముక్కలను, టమాటా ముక్కలను, కొత్తిమీర తురుమును వేసి, కలిపి ఉంచుకోవాలి.

ఇప్పుడు స్టవ్ వెలిగించి, సన్నని మంట మీద పెనం పెట్టి, ఒక్కొక్క బ్రెడ్ ముక్కని దోరగా, కరకరలాడే లాగా అన్ని ముక్కల్ని కాల్చుకొని, ఒక ప్లేట్ లో అమర్చుకొని, ఆ ముక్కలమీద బఠానీ కూర వేసి, ఉల్లిముక్కల మిశ్రమం ఆ పైన కారప్పూస చల్లుకోవాలి. అంతే కమ్మని రుచికరమైన బ్రెడ్ ఛాట్ రెడీ. ఇది చెయ్యటం సులువు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. (ఇష్టమైతే మామిడికాయని  సన్నగా తురుములాగా చేసుకొని పైన వేసుకోవచ్చును.)


7.7.13

కచోరీలు

కచోరీలు

కావలసిన పదార్థాలు
మైదాపిండి -- 1 కప్పు
నానబెట్టిన పెసరపప్పు -- 1/2 కప్పు
శెనగపిండి -- 1 కప్పు
గరంమసాలా పౌడర్ -- 1/4 స్పూన్
ఉప్పు & కారం -- తగినంత
అప్పడాల షోడా -- 1/4 స్పూన్
నూనె -- 1/4 కేజీ

తయారీవిధానం
ముందుగా మైదాపిండిలో ఉప్పు, అప్పడాలషోడా వేసి తగినన్ని నీళ్ళు పోసి, చపాతీపిండిలాగా కలుపుకోవాలి. పెసరపప్పుని ఒకగంట ముందు నానబెట్టుకొని, రుబ్బి, అందులో శెనగపిండి, ఉప్పు, కారం, గరంమసాలా వేసి, స్టవ్ వెలిగించి బాణలి పెట్టి, అందులో ఈ మిశ్రమాన్ని వేసి, దగ్గరపడేవరకు ఉడికించి దించుకోవాలి. చల్లారిన తరవాత చిన్న - చిన్న ఉండలుగా చేసుకోవాలి.

ఇప్పుడు మైదాపిండిని చిన్న చిన్న చపాతీలుగా వత్తుకొని, పెసరఉండలిని మధ్యలోపెట్టి, అంచులు మూసి, మళ్ళీ చపాతీలుగా వత్తుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలిపెట్టి, నూనె పోసి, కాగిన తరవాత వత్తుకొని ఉంచుకున్న, కచోరీలను దోరగా వేయించి ఒక ప్లేట్ప లో ఉంచుకోవాలి. ఇప్పుడు వీటిమీద మనకు ఇష్టమైతే, సన్నని కారపుపూస, కొత్తిమీర, టమాట, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అలంకరించుకొని, ఇష్టమైన చట్నీలతో తినొచ్చును. అంతే కరకరలాడే కమ్మని కచోరీ రెడీ.



5.7.13

కొన్ని వంటింటి చిట్కాలు

కొన్ని వంటింటి చిట్కాలు


1. కొబ్బరిముక్కను పెరుగులో వేస్తే తొందరగా పెరుగు పాడవదు.
2. పప్పు తొందరగా ఉడకాలంటే ఉడికేటపుడు డాల్డా గాని నూనె వేయాలి.
3. నిమ్మకాయ తొక్కలను పిండిన తర్వాత వాటిని కుక్కర్ కింద వేయడం వల్ల వాసనరాదు.
4. వడియాల పిండిలో కొంచెం నిమ్మరసం వేస్తే తెల్లగా వస్తాయి.
5. బ్రెడ్ పేకెట్ లో బంగాళదుంప ముక్కలు ఉంచితే త్వరగా పాడవదు.
6. కాకరకాయ ముక్కలను కొంచెం ఉప్పురాసి,నీళ్ళు చల్లి గంట సేపు ఉంచితే చేదు పోతుంది.
7. ఎండుకొబ్బరిచిప్ప కందిపప్పుడబ్బాలో వేసి నిల్వ ఉంచితే పప్పు పాడవదు.
8. క్యాబేజి ఉడికించేటపుడు వాసనరాకుండా ఉండాలంటే చిన్న అల్లం ముక్క వేయ్యాలి.
9. నూనె పొరపాటున ఒలికితే ఆ ప్రాంతంలో కొంచెం మైదాపిండి జల్లితే నూనెను త్వరగా పీల్చేస్తుంది.
10. పాలు కాచేటపుడు పొంగకుండా ఉండాలంటే అంచుకు నూనె రాయాలి.


మిర్చీ బజ్జీలు

మిర్చీ బజ్జీలు

కావలసిన పదార్థాలుపచ్చిమిరపకాయలు --1/4 కేజీ (బజ్జీలకి అంటే లావుగా ఉండేవి తీసుకోవాలి)
శెనగపిండి -- 2 కప్పులు
బియ్యం పిండి -- 2 స్పూన్స్
ఉల్లిపాయ ముక్కలు -- 1 కప్పు (సన్నగా తరిగి ఉంచుకోవాలి)
ఉప్పు -- తగినంత
కారం పొడి -- 1 స్పూన్
జీలకర్ర పౌడర్ -- 1 స్పూన్
అప్పడాలషోడా -- 1/2 స్పూన్
నూనె -- 1/4 కేజీ
వాము పౌడర్ -- 2 స్పూన్స్
నిమ్మకాయలు -- 2

తయారీ విధానం
లావుగా ఉండే బజ్జీల మిర్చీలు తీసుకొని కడిగి, మధ్యకు చీల్చుకొని, కావాలంటే గింజలు తీయాలి. కరం తినేవారు ఐతే ఉంచుకోవచ్చును. ఇప్పుడు శెనగపిండిలో-- బియ్యం పిండి, ఉప్పు , జీలకర్ర పౌడర్, అప్పడాల షోడా అన్నీ వేసి తగినంత నీళ్ళు పోస్తూ, కొంచెం గరిట జరుగా బాగా కలుపుకోవాలి. పిండిని ఎంత బాగా బీట్ చేస్తే, అంట బాగా బజ్జీలు పొంగుతాయి. మధ్యకు చీల్చిన మిరపకాయలలో ఉప్పు+ వాముని కలుపుకొని నింపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలి పెట్టి, నూనె వేసి కాగిన తరవాత, మిరపకాయలను శెనగపిండిలో ముంచుకొని, నూనెలో వేయాలి.
అలాగ అన్నీ దోరగా వేయించి తీసుకోవాలి. అన్నీ వేయించి ఒక పళ్ళెంలో ఉంచుకొని, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలలో, కొంచెముగా ఉప్పు, కారం వేసుకొని నింపుకొని పైన నిమ్మరసం పిండుకోవాలి. అంతే అందరికీ ఇష్టమైన వేడి -- వేడి, రుచికరమైన మిర్చి బజ్జీలు రెడీ.



సగ్గుబియ్యం వడలు

సగ్గుబియ్యం వడలు

కావలసిన పదార్థాలు
సగ్గుబియ్యం -- 1 కప్పు
బియ్యంపిండి --1 కప్పు
శెనగపిండి -- 2 స్పూన్స్
పచ్చిమిర్చి పేస్టు -- 1 స్పూన్
జీలకర్ర పౌడర్ -- 1 స్పూన్
పెరుగు -- 1 కప్పు
ఉప్పు --- తగినంత
నూనె -- 1/4 కేజీ

తయారీ విధానం
2 గంటల ముందుగా సగ్గుబియ్యాన్ని పెరుగులో నానబెట్టుకోవాలి. బాగా ననిన తరవాత దానిలో బియ్యంపిండి, శెనగపిండి, పచ్చిమిర్చి పేస్టు, జీలకర్ర పౌడర్ & ఉప్పు వేసి, గారెల పిండిలాగా మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి, బాణలి పెట్టి, నూనె పోసి, కాగాక, ఒక పాలకవరు మీదైనా, లేకుంటే చేతిమీదనైనా పిండిని తీసుకొని, గుండ్రంగా చేసి నూనెలో వేసుకొని, గోధుమరంగు వచ్చేవరకు వేయించి తీసుకోవాలి. మనకి నచ్చిన చెట్నీతో నంజుకొని తినొచ్చును. అంతే వేడి -- వేడి, కరకరలాడే కమ్మని సగ్గుబియ్యం వడలు రెడీ.(ఇష్టమైన వారు ఈ పిండిలో కొత్తిమీర కూడా వేసుకోవచ్చును)



1.7.13

మైసూరు బోండాలు

మైసూరు బోండాలు

కావలసిన పదార్థాలు
మైదాపిండి -- 2 కప్పులు
బియ్యంపిండి -- 1/2 కప్పు
పుల్లటి పెరుగు -- 2 కప్పులు
బొంబాయి రవ్వ -- 4 స్పూన్స్
అల్లం + పచ్చిమిర్చి పేస్టు -- 2 స్పూన్స్
ఉప్పు -- తగినంత
వంటసోడా -- 1/4 స్పూన్
నూనె -- 1/4 కేజీ

తయారీ విధానం:--
పైన చెప్పిన పదార్థాలు అన్నీ.... పుల్లటి పెరుగులో వేసి 2 గంటలు ముందు నానబెట్టుకోవాలి.ఈ పిండి బజ్జీల పిండిలాగా కలుపుకోవాలి. పిండి ఎంత బాగా నానితే, బోండాలు అంత మెత్తగా, మృదువుగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించి, బాణలి పెట్టి, నూనె వేసి కాగిన తరవాత, పిండిని కొంచెం-- కొంచెం చేతితో చిన్ని -చిన్ని ఉండలుగా తీసుకొని, నూనెలో వేస్తే గుండ్రంగా బోండాలు, పెద్దవిగా పొంగుతాయి. ఇలాగే అన్నీ వేయించి తీసుకొని, మనకి నచ్చిన చెట్నీతో తినొచ్చును. అంతే వేడి -- వేడి మెత్తని మైసూరు బోండాలు రెడీ......


సేమ్యా ఉప్మా:--

సేమ్యా ఉప్మా:--

కావలసిన పదార్థాలు--
బాంబినో సేమ్యా -- 250 గ్రాములు
పచ్చిమిర్చి -- 6
ఉల్లిపాయ ముక్కలు -- 1/2 కప్పు
అల్లం --ఒక చిన్నముక్క
నిమ్మకాయ --1
పోపు దినుసులు --సెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు & కొత్తిమీర
టమాట ముక్కలు -- 1/4 కప్పు
పచ్చిబటాణీ -- కొద్దిగా
జీడిపప్పు ---15 పలుకులు
ఉప్పు --రుచికి సరిపడినంత
నూనె -- 100 గ్రాములు
నీళ్ళు -- 500 గ్రాములు (సేమ్యా ఎంత ఉంటే... దానికి రెండింతలు నీళ్ళు తీసుకోవాలి.)

తయారీ విధానం:--

ముందుగా స్టవ్ వెలిగించి బాణలి పెట్టి, నూనె వేసి, పోపు దినుసులు వేసి వేగాక జీడిపప్పు, కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు పచ్చి బటాణీ , పచ్చిమిర్చి---అన్నీ వేసి వేగిన తరవాత, అందులో సేమ్యా కూడా వేసి దోరగా వేయించిన పిదప,నీళ్ళు పోసి, ఉప్పువేసి సన్నని మంట మీద ఉడికించుకోవాలి. సేమ్యా అంతా దగ్గరికి వచ్చాక నిమ్మరసం, ఇష్టమైతే కొంచెంగా నెయ్యి వేసి దించుకోవాలి. వేరే డిష్ లో సర్వ్ చేసుకోవాలి. అంతే వేడి--వేడి సేమ్యా ఉప్మా రెడీ.




27.6.13

పాలకూర పప్పు:--

పాలకూర పప్పు:--

కావలసిన పదార్థాలు:--
పాలకూర తరుగు -- 6 కప్పులు
కందిపప్పు -- 2 కప్పులు
ఉల్లిపాయముక్కలు -- 1 కప్పు
పచ్చిమిర్చి -- 3
ఉప్పు, పసుపు  -- తగినంత
కారం -- 1 స్పూన్
వెల్లులి -- 4 రెబ్బలు
పోపుదినుసులు --కొంచెం (కరివేపాకు, ఇంగువ, వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మినపప్పు )
నూనె -- 4 స్పూన్స్

తయారీ విధానం:--
ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ లో కడిగి పెట్టుకున్న కందిపప్పుని, పాలకూరని, ఉల్లిపాయముక్కలు, పచ్చిమిర్చి వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాణలి పెట్టి పోపువేసి ఆ పోపులోనే ఉడికించిన తోటకూర పప్పుని వెయ్యాలి. ఉప్పు, పసుపు, కారం వేసి, 5 నిముషాలు తరవాత దించుకోవాలి. అంతే పాలకూర పప్పు రెడీ. ఇష్టమైనవారు ఈ పాలకూరని పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చును. ఇష్టమైతే టమాటాలు కూడా వేసుకోవచ్చును.    




తోటకూర పప్పు:--

తోటకూర పప్పు:--

కావలసిన పదార్థాలు:--
తోటకూర తరుగు -- 6 కప్పులు
కందిపప్పు -- 2 కప్పులు
ఉల్లిపాయముక్కలు -- 1 కప్పు
పచ్చిమిర్చి -- 3
ఉప్పు, పసుపు  -- తగినంత
కారం -- 1 స్పూన్
వెల్లులి -- 4 రెబ్బలు
పోపుదినుసులు --కొంచెం (కరివేపాకు, ఇంగువ, వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మినపప్పు )
నూనె -- 4 స్పూన్స్

తయారీ విధానం:--
ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ లో కడిగి పెట్టుకున్న కందిపప్పుని, తోటకూరని, ఉల్లిపాయముక్కలు, పచ్చిమిర్చి వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాణలి పెట్టి పోపువేసి ఆ పోపులోనే ఉడికించిన తోటకూర పప్పుని వెయ్యాలి. ఉప్పు, పసుపు, కారం వేసి, 5 నిముషాలు తరవాత దించుకోవాలి. అంతే తోటకూర పప్పు రెడీ. ఇష్టమైనవారు ఈ తోటకూరని పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చును. ఇష్టమైతే టమాటాలు కూడా వేసుకోవచ్చును.




బచ్చలికూర పప్పు:--

బచ్చలికూర పప్పు:--

కావలసిన పదార్థాలు:--
బచ్చలికూర -- 3 కప్పులు
పెసరపప్పు -- 1 కప్పు              
ఉప్పు , పసుపు -- తగినంత
కారం -- 1 స్పూన్
వెల్లుల్లి రెబ్బలు -- 4
పచ్చిమిర్చి -- 3
నూనె -- 4 స్పూన్స్  
పోపుదినుసులు --కొంచెం (కరివేపాకు, ఇంగువ, వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మినపప్పు )

తయారీ విధానం:--
ముందుగా స్టవ్ వెలిగించి కక్కర్ లో పెసరపప్పు , బచ్చలికూర, పచ్చిమిర్చి వేసి ఉడికించి దించుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాణలి పెట్టి పోపువేసి ఆ పోపులోనే ఉడికించిన బచ్చలికూర పప్పుని వెయ్యాలి. ఉప్పు, పసుపు, కారం వేసి, 5 నిముషాలు తరవాత దించుకోవాలి. అంతే బచ్చలికూర పప్పు రెడీ.




గోంగూర పప్పు

గోంగూర పప్పు

కావలసిన పదార్తాములు:--
గోంగూర తరుగు -- 6 కప్పులు
కందిపప్పు --2 కప్పులు
ఉల్లిపాయముక్కలు -- 2 కప్పులు
కారం -- 2 స్పూన్స్
పచ్చిమిర్చి -- 6
ఉప్పు, పసుపు --తగినంత
వెల్లుల్లి రెబ్బలు -- 4
పోపుదినుసులు --కొంచెం (కరివేపాకు, ఇంగువ, వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మినపప్పు )
నూనె -- 4 స్పూన్స్

తయారీవిధానం:--
ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి, కందిపప్పుని ఉడికించుకోవాలి. ఉడికిన తరవాత, వేరే స్టవ్ మీద చిన్న బాణలి పెట్టి పోపువేసి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, గోంగూర వేసి మెత్తగా ఉడికిన తరవాత ఉడికించి పక్కన పెట్టుకున్న పప్పుని వేసి----- ఉప్పు , పసుపు, కారం వేసి గరిటతో మెత్తగా పప్పుని మెదుపుకోవాలి. 10 నిమిషాల తరవాత దించేసుకోవటమే. అంతే కమ్మని పుల్ల పుల్లని గోంగూరపప్పు రెడీ.




మెంతికూర పప్పు:--

మెంతికూర పప్పు:--

కావలసిన పదార్థాలు:--
మెంతిఆకులు -- 2 కప్పులు( ఏరి ఉంచుకోవాలి)
పెసరపప్పు -- 1 కప్పు
పచ్చిమిర్చి -- 3
కారం -- 1 స్పూన్
వెల్లుల్లి రెబ్బలు -- 3
పోపుదినుసులు --కొంచెం (కరివేపాకు, ఇంగువ, వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మినపప్పు )
ఉప్పు, పసుపు -- తగినంత
నూనె -- 2 స్పూన్స్

తయారీవిధానం:--
ముందుగా స్టవ్ వెలిగించి, కుక్కర్ పెట్టి, అందులో కడిగిపెట్టుకున్న పెసరపప్పుని, మెంతికూరని, పచ్చిమిర్చిని అన్నిటిని కలిపి ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు వేరే స్టవ్ మీద చిన్న బాణలి పెట్టి పోపు వేయించుకోవాలి. ఉడికిన పప్పులో ఈ పోపుని వేసి, ఉప్పు, పసుపు, కారం & కొత్తిమీర... కలిపి వేరే డిష్ లో ఉంచుకోవాలి. అంతే మెంతికూర పప్పు రెడీ. ఇదే విధంగా కందిపప్పుతో కూడా చేసుకోవచ్చును. చపాతీ లో కూడా ఈ పప్పుని తినొచ్చును.


చుక్కకూర పప్పు

చుక్కకూర పప్పు

కావలసిన పదార్థాలు:--
చుక్కకూర -- 2 కట్టలు
కందిపప్పు -- 2 కప్పులు
పచ్చిమిర్చి -- 4
కారం -- 1 స్పూన్
ఉప్పు, పసుపు -- తగినంత
ఉల్లిపాయముక్కలు -- 1 కప్పు
కొత్తిమీర -- కొంచెం
పోపుదినుసులు -- కొంచెం (కరివేపాకు, ఇంగువ, వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మినపప్పు )
నూనె -- 4 స్పూన్స్

తయారీవిధానం:--
ముందుగా స్టవ్ వెలిగించి, కుక్కర్ పెట్టి, అందులో కడిగిపెట్టుకున్న కందిపప్పుని, చుక్కకూరని & ఉల్లిపాయల్ని, పచ్చిమిర్చిని అన్నిటిని కలిపి ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు వేరే స్టవ్ మీద చిన్న బాణలి పెట్టి పోపు వేయించుకోవాలి. ఉడికిన పప్పులో ఈ పోపుని వేసి, ఉప్పు, పసుపు, కారం & కొత్తిమీర... కలిపి వేరే డిష్ లో ఉంచుకోవాలి. ఇదే విధంగా, పెసరపప్పుతోను, సెనగపప్పుతోను కూడా చేసుకోవచ్చును. అంతే కమ్మని చుక్కకూర పప్పు రెడీ.


25.6.13

నువ్వుల అప్పాలు:--

నువ్వుల అప్పాలు:--

కావలసిన పదార్థాలు:--
వరిపిండి---- 2 కప్పులు 
మైదాపిండి -- 1 కప్పులు 
గోధుమపిండి -- 1 కప్పు 
నువ్వులుపప్పు -- 1 కప్పు
యాలకులపొడి -- 2 స్పూన్స్
పంచదార -- 2 కప్పులు
నూనె --- 1/2 కేజీ
నీళ్ళు -- 2 కప్పులు
వంటసోడా -- చిటికెడు

తయారీవిధానం:--

ముందుగా స్టవ్ వెలిగించి ఒక మందపాటి గిన్నెలో 2 కప్పులు నీళ్ళు పోసి, పంచదార వేసి.....పంచదార అంతా మరుగుతూ ఉన్నప్పుడు అన్ని రకాల పిండిలు వేసి, నువ్వులుపప్పు కూడా వేసి చిటికెడు వంటసోడా----కొంచెం నూనె, యాలకుల పొడి అన్నీ వేసి.... కలిపి కిందకి దించుకోవాలి. పిండి చల్లారిన తరవాత...... చేతికి నూనె రాసుకొని, పిండిని చిన్న--చిన్న ఉండలు చేసుకొని అరటిఆకు మీద ఐనా.... ప్లాస్టిక్ కవరు మీద ఐనా.....నూనె రాసి....ఉండలని పలుచగా చిన్న చిన్న వడలులాగా... చేతితో వత్తుకోవాలి..... ఇప్పుడు అన్నీ చేసిన తరవాత........ స్టవ్ మీద బాణలి పెట్టి, నూనె వేసుకొని సన్నటి సెగ మీద అన్నీ వేయించి తీసుకోవాలి. ఇవి వారం రోజులవరకు నిల్వ ఉంటాయి. అంతే కరకరలాడే తియ్యని నువ్వుల అప్పాలు రెడీ.






బెల్లం అప్పాలు:--

బెల్లం అప్పాలు:--

కావలసిన పదార్థాలు 
వరిపిండి -- 2 కప్పులు 
గోధుమపిండి -- 2 కప్పులు 
బెల్లంకోరు -- 2 కప్పులు 
యాలకులపొడి -- 1 స్పూన్
నూనె -- 1/4 కేజీ
నీళ్ళు -- 2 కప్పులు

తయారీవిధానం:--
ముందుగా స్టవ్ వెలిగించి ఒక మందపాటి గిన్నెలో 2 కప్పులు నీళ్ళు పోసి, బెల్లం వేసి.....బెల్లం అంతా మరుగుతూ ఉన్నప్పుడు వరిపిండి & గోధుమపిండి వేసి,----కొంచెం నూనె, యాలకుల పొడి వేసి.... కలిపి కిందకి దించుకోవాలి. పిండి చల్లారిన తరవాత...... చేతికి నూనె రాసుకొని, పిండిని చిన్న--చిన్న ఉండలు చేసుకొని అరటిఆకు మీద ఐనా.... ప్లాస్టిక్ కవరు మీద ఐనా.....నూనె రాసి....ఉండలని పలుచగా చిన్న చిన్న వడలులాగా... చేతితో వత్తుకోవాలి..... ఇప్పుడు అన్నీ చేసిన తరవాత........ స్టవ్ మీద బాణలి పెట్టి, నూనె వేసుకొని సన్నటి సెగ మీద అన్నీ వేయించి తీసుకోవాలి. ఇవి వారం రోజులవరకు నిల్వ ఉంటాయి. అంతే తియ్యని బెల్లం అప్పాలు రెడీ.






వెన్న అప్పాలు:--

వెన్న అప్పాలు:--

కావలసిన పదార్థాలు:--
బియ్యం -- 1/2 కేజీ 
పంచదార 1/4 కేజీ 
వెన్న -- 1 కప్పు 
యాలకులపొడి -- 1 స్పూన్
నూనె -- 1/2 కేజీ

తయారీవిధానం:--
బియ్యం 4 గంటల ముందుగా నానబెట్టుకుని, నీరు అంతా వడగట్టి, ఎండలో ఆరబెట్టుకోవాలి... తడిపొడిగా ఉన్నప్పుడే బియ్యాన్ని పిండిలాగా మర (మిల్లు) పట్టించాలి.

ఇప్పుడు స్టవ్ వెలిగించి, ఒక మందపాటి గిన్నెలో పంచదార వేసి, ఒక కప్పు నీళ్ళు పోసి. ఏలకులపొడి వేసి, మరుగుతున్నప్పుడు , వరిపిండిని.... వెన్నని వేసి బాగా కలిపి దించెయ్యాలి. చల్లారిన తరవాత పళ్ళెంలో వేసి పూరి పిండిలాగా బాగా మదాయించుకోవాలి. (రోలు ఉన్నవాళ్లు అప్పడాల పిండి మాదిరిగా....బాగా బండతో దంచాలి....ఎంత బాగా దంచితే అంతబాగా మృదువుగా వస్తాయి.) చేతికి నూనె రాసుకొని, పిండిని చిన్న--చిన్న ఉండలు చేసుకొని అరటిఆకు మీద ఐనా.... ప్లాస్టిక్ కవరు మీద ఐనా.....నూనె రాసి....ఉండలని పలుచగా చిన్న చిన్న వడలులాగా... చేతితో వత్తుకోవాలి..... ఇప్పుడు అన్నీ చేసిన తరవాత........ స్టవ్ మీద బాణలి పెట్టి, నూనె వేసుకొని సన్నటి సెగ మీద అన్నీ వేయించి తీసుకోవాలి. ఇవి నెల రోజులవరకు నిల్వ ఉంటాయి. అంతే ఎంతో రుచికరమయిన......నోట్లోవేస్తే కరిగిపోయే వెన్న అప్పాలు రెడీ.