Showing posts with label ప్రసాదాలు. Show all posts
Showing posts with label ప్రసాదాలు. Show all posts

29.9.17

పాయసాన్నం

పాయసాన్నం 


కావలసిన పదార్థాలు:--
బియ్యం -- 2 కప్పులు
పంచదార -- 4 కప్పులు
నెయ్యి -- 1కప్పు
ఏలకుల పొడి -- 1 స్పూన్
జీడిపప్పు -- 50 గ్రాములు
కిస్ మిస్ -- 25 గ్రాములు

తయారీ విధానం:--
ముందుగా స్టవ్ వెలిగించి, బియ్యం కుక్కర్ లో మెత్తగా ఉడికించి, పక్కనపెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో పంచదార  వేసి మెత్తగా గరిటతో కలుపుతూ స్టవ్ మీద సన్నని మంటపై, ఉడికించితే, పంచదార అంతా కరిగి మెత్తగా పాకంలాగా వస్తుంది. ఇది ఉడికే లోపున....వేరే స్టవ్ మీద చిన్న పాత్రలో నెయ్యి వేసి, వేడిచేసి అందులో జీడిపప్పు, కిస్ మిస్ లు దోరగా వేయించి, పాయసాన్నంలో వేసి, ఏలకుల పొడి వేసి కలిపి దగ్గరగా అయిన తరవాత, దించుకోవటమే. అంతే ఎంతో రుచికరమైన తియ్యని పాయసాన్నం రెడీ.



23.8.17

జిల్లేడుకాయలు

జిల్లేడుకాయలు  

కావలసిన పదార్థాలు 
బియ్యంపిండి -- 1 కప్పు 
బెల్లంతురుము -- 1 కప్పు 
కొబ్బరితురుము -- 1 కప్పు 
యాలకులపొడి -- 1/2 స్పూన్ 
నెయ్యి -- 1 స్పూన్ 
ఉప్పు -- తగినంత 

తయారీవిధానం

ముందుగా స్టవ్ వెలిగించి, ఒక గిన్నె పెట్టి నీళ్ళు పోసి, మరిగిన తరవాత, కొంచెంగా నూనె , ఉప్పు వేసి కలిపి, బియ్యంపిండిని వేస్తూ, ఉండలు కట్టకుండా తిప్పి, 2 నిముషాలు తరవాత దించుకోవాలి. చల్లారిన తరవాత చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 

ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలి పెట్టి, బెల్లంతురుము, కొబ్బరితురుము వేసి తక్కువ మంటపై ఉంచి, ఆ మిశ్రమం గట్టిపడేవరకు ఉంచాలి. చివరగా యాలకులపొడిని వేసి దించాలి. 

చేతులకు నెయ్యి రాసుకొని, ముందుగా చేసి ఉంచుకున్న ఉండలని చిన్న చపాతీలాగా చేతితోనే వత్తుకోవాలి, అందులో కొబ్బరి పూర్ణం కొంచెంగా ఉంచి, ఆ చపాతీని ఉండలుగా.... అండాకారంగా చుట్టుకోవాలి. ఇలాగ అన్నీ చేసి ఉంచుకొని... స్టవ్ వెలిగించి ఇడ్లీ రేకులలో ఈ జిల్లేడుకాయలని ఉంచి 10 నిముషాలు ఆవిరి పెట్టి, తరవాత దించుకోవాలి. అంతే జిల్లేడుకాయలు రెడీ. 

పాల ఉండ్రాళ్ళు

పాల ఉండ్రాళ్ళు 

కావలసిన పదార్థాలు 

బియ్యంపిండి -- 1 కప్పు
మంచినీళ్ళు -- 2 కప్పులు
పంచదార -- 1 కప్పు
పాలు -- 1 కప్పు
యాలకుల పొడి -- 1/2 స్పూన్

తయారీవిధానం

ముందుగా స్టవ్ వెలిగించి, ఒక మందపాటిగిన్నెలో 2 కప్పుల నీళ్ళు పోసి, మరిగిన తరవాత బియ్యంపిండి వేస్తూ, ఉండలు కట్టకుండా తిప్పుతూ, అంతా బాగా కలిసిన తరవాత, స్టవ్ మంట తగ్గించి, గిన్నె మీద మూతపెట్టి 5 నిముషాలు అయ్యాక, స్టవ్ మీద నుండి దించి, చల్లారిన తరవాత చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు స్టవ్ వెలిగించి, బాణలి పెట్టి, పంచదార వేసి .. తగినన్ని నీళ్ళు పోసి మరిగించాలి. ఈ పాకంలో ముందుగా చేసి పక్కన పెట్టిన చిన్న ఉండలని వేసి, పాలు, యాలకులపొడిని వేసి, ఉండలకి పాలు... పాకం అంతా కలిసిన తరవాత దించెయ్యాలి. అంతే కమ్మని పాల ఉండ్రాళ్ళు రెడీ.

21.8.15

శెనగపప్పు పూర్ణం బొబ్బట్లు

శెనగపప్పు పూర్ణం బొబ్బట్లు

కావలసిన పదార్థాలు

శెనగపప్పు - 1/2 కేజీ
మైదా - 1/2 కేజీ
బెల్లం - 400 గ్రాములు
నెయ్యి - 100 గ్రాములు 
నూనె - 100 గ్రాములు
యాలకులపొడి - 1 స్పూను

తయారు చేయువిధానం
బొబ్బట్లు చేసుకోవటానికి 2 గంటలకు ముందే మైదాపిండిని కలుపుకొని ఉంచుకోవాలి. ఎలా కలపాలంటే ----చపాతీపిండి లేదా పూరీ పిండిని కలిపినట్టుగా కలుపుకోవాలి. ఇలా కలిపిన పిండికి కొంచెం ఎక్కువగా నూనె వేసి కలిపినట్లయితే, తోపు పిండి (మైదాపిండి) మృదువుగా ఉంటుంది. ఇహ ఇప్పుడు స్టవ్ వెలిగించి, కుక్కరు పెట్టి, అందులో 1/2 కేజీ శెనగపప్పును ఒక గిన్నెలోకి తీసుకొని, తగిననంత నీరు పోసి ఉడికించుకోవాలి.  

పప్పు బాగా మెత్తబడుతుంది. చల్లారిన తరవాత పప్పులో తురుముచేసి పక్కనపెట్టుకున్న బెల్లాన్ని, యాలకుల పొడిని వేసి బాగా కలపాలి. ఉడికిన పప్పులో బెల్లం కలిపెసరికి పాకంలాగా అయ్యి, పప్పు పల్చబడుతుంది. ఇలా పల్చబడిన మిశ్రమాన్ని మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక మందపాటి బాణలిగానీ, గిన్నెగానీ ఉంచి అందులో వేసి, ఆ మిశ్రమం దగ్గర అయ్యేవరకు కలుపుతూ ఉండాలి. కలపకపోతే మిశ్రమం బాణలికి అడుగు అంటే అవకాశం ఉంటుంది. మొత్తానికి మిశ్రమం దగ్గర పడ్డాక స్టవ్ మీద నుండి దించి, పక్కన పెట్టుకొని, చల్లారిన తరవాత చిన్న చిన్న పూరి ఉండలులాగా చేసుకోవాలి. 

చేసిన తరవాత, నానబెట్టిన మైదా పిండిని తీసుకొని, ఉండలుగా చేసిపెట్టుకోవాలి. పాలకవరు గానీ, నూనె ప్యాకెట్టు కవరు గానీ, అందుబాటులో ఉంటే అరటిఆకునైనా తీసుకోవచ్చును, ఏదైనా తీసుకొని దానికి నెయ్యి కొంచెం రాసి, మైదాపిండి ఉండను ఉంచి, నేతి గిన్నెలో ముంచిన చేతితోనే పలచగా చాపాతిలాగా వత్తుకోవాలి. ఇలా చేసిన మైదాపిండి చపాతి మధ్యలో ముందుగా చేసి ఉంచుకున్న పూర్ణం ఉండని ఒక దానిని ఉంచి, ఆ పూర్ణం కనిపించకుండా మైదాపిండి చపాతితో మూసెయ్యాలి. మళ్ళీ నేతి గిన్నెలో చేయి ముంచి మైదాపిండి చపాతీ నుండి పూర్ణం బయటకు రాకుండా నెమ్మదిగా, గుండ్రంగా చేతితో బొబ్బట్టుని వత్తుకోవాలి. నెయ్యి ఎంత ఎక్కువగా వేసి వత్తుకుంటే బొబ్బట్టు అంత మృదువుగా, అంటుకోకుండా ఉంటుంది. ఈవిధంగా ఒక రెండు బొబ్బట్లు చేసి పక్కన పెట్టుకున్నాక స్టవ్ వెలిగించి,  బాగా తక్కువ, సన్నని మంటపైన పెనం పెట్టుకొని, పెనం కొంచెం వేడి ఎక్కాక, కవరుపై నుండి జాగ్రత్తగా బొబ్బట్టుని పెనం మీదకు వదలాలి, వదిలేటప్పుడు కవరు పెనానికి తగలకూడదు. బొబ్బట్టు చిరగకూడదు(విరిగిపోకూడదు). ఇలా పెనంపై ఉన్న బొబ్బట్టుని రెండు వైపులా  బంగారపు వర్ణం వచ్చేవరకు నెయ్యి వేస్తూ కాల్చుకోవాలి. అంతే కమ్మని, తియ్యని, మధురమైన బొబ్బట్లు రెడీ. తడిచెయ్యి తగలకుండా బొబ్బట్లు చేసుకున్నట్లయితే ఆ బొబ్బట్లు ఒక వారం వరకు నిల్వ ఉంటాయి.


27.3.14

పూర్ణం బూరెలు

పూర్ణం బూరెలు 

కావలసిన పదార్థాలు
శెనగపప్పు -- 2 కప్పులు
పంచదార - 2 కప్పులు
ఏలకుల పొడి - 2 స్పూన్స్
తోపుపిండి - 1 కప్పు మినప్పప్పు & 3 కప్పులు బియ్యం 3 గంటల ముందుగా నానబెట్టి దోసెల పిండిలాగా రుబ్బి ఉంచుకోవాలి.
నూనె - 1/2 కేజీ (బూరెలు నూనెలో మునిగే అంత)

తయారీవిధానం 
ముందుగా స్టవ్ వెలిగించి శెనగపప్పును కుక్కర్లో బాగా మెత్తగా ఉడకబెట్టుకోవాలి. కుక్కరు వెయిట్ తీసిన తరవాత పప్పులో పంచదార కలిపాలి. పంచదార కలిపగానే పప్పు జారుగా అంటే పలచగా అవుతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి, ఒక మందపాటి గిన్నెలో ఈ మిశ్రమాన్ని వేసి,  సన్నని మంటపై మిశ్రమం అడుగంటకుండా గరిటతో తిప్పుతూ ఉండాలి. మిశ్రమం గట్టిబడ్డాక, (దగ్గరగా అయిన తరవాత) దించి పక్కన ఉంచుకోవాలి. మిశ్రమం చల్లారిన తరవాత ఉండలుగా అదేనండి పూర్ణాలుగా చుట్టి పక్కన ఉంచుకోవాలి.


ఇప్పుడు స్టవ్ వెలిగించి, బాణలి పెట్టి, నూనె పోసి కాగాక ఒక్కొక్క పూర్ణాన్ని తోపుపిండిలో ముంచి నూనెలో వేసి, బంగారురంగు వచ్చేవరకు వేయించి తీసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన సాంప్రదాయపు పిండివంట పూర్ణం బూరెలు రెడీ.

              

5.1.14

రవ్వ పులిహొర

రవ్వ  పులిహొర 

కావలసిన పదార్థాలు:--
బియ్యపు రవ్వ -- 2 కప్పులు
నిమ్మకాయ --1
పచ్చిమిర్చి-- 6
ఉప్పు--రుచికి తగినంత
పసుపు-- 1 స్పూన్
కరివేపాకు -- 4 రెబ్బలు
వేరుశెనగగుళ్ళు -- 1/4 కప్పు
పోపు దినుసులు -- (సెనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి-4, ఇంగువ) కరివేపాకు
నూనె-- 50 గ్రాములు

తయారుచేయు విధానం:--
ముందుగా  స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో 4 కప్పులు నీళ్ళు పోసుకొని, మరిగిన తరవాత బియ్యపురవ్వని వేసి, 2 స్పూన్స్ నూనె వేసి ఉడికించి ఒక పళ్ళెంలోకి తీసి ఉంచుకోవాలి. ఉప్పు, పసుపు,  కొంచెం నూనె వేసుకొని.....కలుపుకోవాలి..ఇప్పుడు స్టవ్ వెలిగించి, బాణలి పెట్టి,నూనె వేసి పోపుదినుసులు, వేరుశెనగగుళ్ళు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి వేయించి.....ఉడికించి పక్కన పెట్టుకున్న రవ్వపైన వేసి కలుపుకోవాలి, నిమ్మరసాన్ని కూడా వేసి  ....పోపు అంతా రవ్వ మిశ్రమానికి బాగా కలిసేలా కలుపుకోవాలి.....  అంతే రవ్వ పులిహొర రెడీ.....


సేమ్యా పులిహోర

సేమ్యా  పులిహోర

కావలసిన పదార్థాలు
సేమ్యా – 1/4 కేజీ
నిమ్మచెక్కలు  – 3
పచ్చిమిరపకాయలు – 4
జీడిపప్పు -- 1/4 కప్పు
కరివేపాకు -4 రెబ్బలు
పోపుదినుసులు -- కొంచెం
ఎండుమిర్చి -- 3
ఇంగువ -- కొంచెం
పసుపు – చిటికెడు
ఉప్పు – తగినంత
నూనె – 1/4 కప్పు

తయారీవిధానం
ముందుగా స్టవ్ వెలిగించి ఒక పెద్ద గిన్నెతీసుకొని, అందులో నాలుగు గ్లాసుల నీళ్లు పోసి మరిగించాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు సేమ్యా వేసి 5 నిమిషాలు ఉఢకనివ్వాలి. తర్వాత సేమ్యాను చిల్లుల బేసేనలో వేయ్యాలి. సేమ్యా మీద వెంటనే చల్లటినీళ్లు పోయాలి. దీనివల్ల సేమ్యా మరింత ఉడికి మెత్తబడకుండా విడివిడిగా అంటుకోకుండా ఉంటుంది. నీరంతా పోయినతర్వాత ఒక పళ్ళెంలో వేసి,  తగినంత ఉప్పు, నిమ్మరసం, పసుపు  వేసి కలిపి పెట్టాలి. బాణలిలో నూనె వేడి చేసి పోపుదినుసులు వేసి, జీడిపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, చిటికెడు పసుపు వేసి,  బాగా వేయించి ఉడికించి పక్కన పెట్టుకున్న సేమ్యాలో వేసి కలియబెట్టాలి. అంతే పుల్లపుల్లగా సేమ్యాపులిహోర రెడీ.


ఆవ పులిహోర

ఆవ పులిహోర

కావలసిన పదార్థాలు
పొడిపొడిగా వండిన అన్నం -- 4 కప్పులు 
చింతపండు గుజ్జు -- పావు కప్పు
అల్లం ముక్కలు -- 5 స్పూన్స్ 
పచ్చిమిర్చి -- 6(నిలువుగా చీల్చి ఉంచుకోవాలి)
ఎండుమిర్చి -- 3
పోపుదినుసులు --  తగినన్ని(మినప్పప్పు , శెనగపప్పు , ఆవాలు, కొంచెంగా మెంతులు )
వేరుశెనగ పప్పు (గుళ్ళు) -- పావుకప్పు 
కరివేపాకు రెబ్బలు -- కొద్దిగా 
పసుపు & ఉప్పు --  రుచికి తగినంత  
ఇంగువ -- 1/2 స్పూన్ (ఇష్టమైతే మరికొంచెం వేసుకోవచ్చును)
నూనె -- 1 కప్పు
ఆవముద్ద --  (ఆవముద్ద తయారుచేయు విధానం:::2 స్పూన్స్ సెనగపప్పు, 3 స్పూన్స్ నూలుపప్పు, 2స్పూన్స్ ఆవాలు, 3 పచ్చిమిర్చి......ఇవి అన్ని కలిపి 1 గంట నానపెట్టి రుబ్బుకుంటే ఆవముద్ద రెడీ అవుతుంది)

తయారీవిధానం
ముందుగా స్టవ్ వెలిగించుకొని, బాణలి పెట్టి, కొద్దిగా నూనె వేసి చింతపండుగుజ్జులో కొద్దిగా ఉప్పు, పసుపు వేసి చింతపండు దగ్గరపడేవరకు మగ్గించి, పక్కనపెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ బాణలి పెట్టి నూనెవేసి, పోపుదినుసులు, వేరుశెనగగుళ్ళు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు,  ఎండుమిర్చి, ఇంగువ, అన్నీ వేసి బాగా వేగాక కొంచెం పోపును తీసి పక్కన పెట్టుకోవాలి, మిగిలిన పోపులో మగ్గించి పక్కనపెట్టుకున్న చింతపండుగుజ్జును వేసి, 5 నిముషాలు ఉంచి, దించి ఒక బేసనలో ఉంచుకొన్న అన్నం మీద పోపుని  వేసి బాగా కలియబెట్టాలి. చివరగా రుబ్బి ఉంచుకున్న ఆవముద్దని వేసి బాగా కలపాలి.   అంతా కలిసాక పైన మిగిలిన నూనెను వేసి మరొక్కసారి కలపాలి.  అంతే కమ్మని వాసనగల ఆవపులిహోర రెడీ.


చింతకాయ పులిహొర

చింతకాయ  పులిహొర 

కావలసిన పదార్థాలు:--
అన్నం-- 10 కప్పులు
చింతకాయలు -- 10
పచ్చిమిర్చి-- 6
వేరుసెనగ గుళ్ళు--1 కప్పు
ఉప్పు--రుచికి తగినంత
పసుపు-- 1 స్పూన్
కరివేపాకు -- 4 రెబ్బలు
నూలుపొడి -- 1 కప్పు
పోపు దినుసులు(సెనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి-4 ఇంగువ) కరివేపాకు
నూనె-- 100 గ్రాములు

తయారుచేయు విధానం:--
ముందుగా  స్టవ్ వెలిగించి, బాణలి పెట్టి, చింతకాయలని తరిగి, ఉడికించి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన బాణలి పెట్టి,  నూనె వేసి,  పోపుదినుసులు, వేరుసెనగ గుళ్ళు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి, ఉడికించి పక్కన పెట్టుకున్న చింతకాయ గుజ్జుని వడకట్టి పోపులో వేసి వేయించి, వండి ఉంచుకున్న అన్నం పైన పోపుని వేసి ..... ఉప్పు, పసుపు, కొంచెం నూనె వేసుకొని కలుపుకోవాలి..అన్నీ అన్నానికి బాగా కలిసేలా చూసుకోవాలి.... చింతకాయ పులిహోర మీద  నూలుపొడి వేసి కలుపుకోవాలి.  అంతే పుల్లపుల్లని చింతకాయ పులిహొర రెడీ.....


మామిడికాయ పులిహొర

మామిడికాయ  పులిహొర 

కావలసిన పదార్థాలు:--
అన్నం-- 10 కప్పులు
పుల్లని మామిడికాయలు -- 2 (సన్నగా కోరి ఉంచుకోవాలి)
పచ్చిమిర్చి-- 6
వేరుసెనగ గుళ్ళు--1 కప్పు
ఉప్పు--రుచికి తగినంత
పసుపు-- 1 స్పూన్
కరివేపాకు -- 4 రెబ్బలు
జీడిపప్పు -- 1 కప్పు
పోపు దినుసులు(సెనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి-4 ఇంగువ) కరివేపాకు
నూనె-- 100 గ్రాములు

తయారుచేయు విధానం:--
ముందుగా  స్టవ్ వెలిగించి, బాణలి పెట్టి, నూనె వేసి పోపుదినుసులు, వేరుసెనగ గుళ్ళు, పచ్చిమిర్చి,  జీడిపప్పు,  కరివేపాకు వేసి, మామిడి తరుగు(కోరు)ని కూడా వేసి వేయించి, వండి ఉంచుకున్న అన్నం పైన పోపుని వేసి ..... ఉప్పు, పసుపు, కొంచెం నూనె వేసుకొని కలుపుకోవాలి..అన్నీ అన్నానికి బాగా కలిసేలా కలుపుకోవాలి..... మామిడి పులిహోర మీద  నూలుపొడి వేసి కలుపుకోవాలి.  అంతే పుల్లపుల్లని మామిడికాయ పులిహొర రెడీ.....


ఉసిరికాయ పులిహొర

ఉసిరికాయ పులిహొర 

కావలసిన పదార్థాలు:--
అన్నం-- 4 కప్పులు
పెద్ద ఉసిరికాయలు -- 6 (సన్నగా కోరి ఉంచుకోవాలి)
పచ్చిమిర్చి-- 6
వేరుసెనగ గుళ్ళు--1 కప్పు
ఉప్పు--రుచికి తగినంత
పసుపు-- 1 స్పూన్
కరివేపాకు -- 4 రెబ్బలు
నూలుపొడి -- 1 కప్పు
జీడిపప్పు -- 1 కప్పు
పోపు దినుసులు(సెనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి-2, ఇంగువ) కరివేపాకు
నూనె-- 100 గ్రాములు

తయారుచేయు విధానం:--
ముందుగా ఒక పళ్ళెంలోకి అన్నం తీసుకొని, ఉప్పు, పసుపు, కొంచెం నూనె వేసుకొని.....కలుపుకోవాలి..ఇప్పుడు స్టవ్ వెలిగించి, బాణలి పెట్టి,నూనె వేసి పోపుదినుసులు, వేరుసెనగ గుళ్ళు, పచ్చిమిర్చి,  జీడిపప్పు,  కరివేపాకు వేసి, ఉసిరికాయల తరుగు(కోరు)ని కూడా వేసి వేయించి,.....అన్నం పైన వేసి కలుపుకోవాలి....పోపు అంతా అన్నానికి కలిసేలా కలుపుకోవాలి..... ఉసిరి పులిహోర మీద  నూలుపొడి వేసి కలుపుకోవాలి.  అంతే పుల్లపుల్లని ఉసిరికాయ పులిహొర రెడీ.....ఇష్టమైనవారు కొత్తిమీరని వేసుకోవచ్చును.



నారింజకాయ పులిహొర

నారింజకాయ పులిహొర 

కావలసిన పదార్థాలు:--
అన్నం-- 8 కప్పులు
నారింజకాయ --1
పచ్చిమిర్చి-- 6
వేరుసెనగ గుళ్ళు--1 కప్పు
ఉప్పు--రుచికి తగినంత
పసుపు-- 1 స్పూన్
కరివేపాకు -- 4 రెబ్బలు
నూలుపొడి -- 1 కప్పు
జీడిపప్పు -- 1 కప్పు
పోపు దినుసులు(సెనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి-4, ఇంగువ) కరివేపాకు
నూనె-- 50 గ్రాములు

తయారుచేయు విధానం:--
ముందుగా ఒక పళ్ళెంలోకి అన్నం తీసుకొని, ఉప్పు, పసుపు, నారింజ రసం, కొంచెం నూనె వేసుకొని.....కలుపుకోవాలి..ఇప్పుడు స్టవ్ వెలిగించి, బాణలి పెట్టి,నూనె వేసి పోపుదినుసులు, వేరుసెనగ గుళ్ళు, పచ్చిమిర్చి,  జీడిపప్పు,  కరివేపాకు వేసి వేయించి.....అన్నం పైన వేసి కలుపుకోవాలి....పోపు అంతా అన్నానికి కలిసేలా కలుపుకోవాలి..... నారింజ పులిహోర మీద  నూలుపొడి వేసి కలుపుకోవాలి.  అంతే పుల్లపుల్లని నారింజకాయ పులిహొర రెడీ.....ఇష్టమైనవారు కొత్తిమీరని వేసుకోవచ్చును.


దబ్బకాయి పులిహొర

దబ్బకాయ పులిహొర 

కావలసిన పదార్థాలు:--
అన్నం-- 8 కప్పులు
దబ్బకాయ --1
పచ్చిమిర్చి-- 6
వేరుసెనగ గుళ్ళు--1 కప్పు
ఉప్పు--రుచికి తగినంత
పసుపు-- 1 స్పూన్
కరివేపాకు -- 4 రెబ్బలు
నూలుపొడి -- 1 కప్పు
పోపు దినుసులు(సెనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి-4, ఇంగువ) కరివేపాకు
నూనె-- 50 గ్రాములు

తయారుచేయు విధానం:--
ముందుగా ఒక పళ్ళెంలోకి అన్నం తీసుకొని, ఉప్పు, పసుపు, దబ్బ రసం, కొంచెం నూనె వేసుకొని.....కలుపుకోవాలి..ఇప్పుడు స్టవ్ వెలిగించి, బాణలి పెట్టి,నూనె వేసి పోపుదినుసులు, వేరుసెనగ గుళ్ళు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించి.....అన్నం పైన వేసి కలుపుకోవాలి....పోపు అంతా అన్నానికి కలిసేలా కలుపుకోవాలి..... పులిహోర మీద  నూలుపొడి వేసి కలుపుకోవాలి.  అంతే పుల్లపుల్లని దబ్బ పులిహొర రెడీ.....


28.10.13

కొబ్బరి పాయసం

కొబ్బరి పాయసం

కావలసిన పదార్థాలు:--

పాలు -- 1/2 లీటరు
కొబ్బరి తురుము -- 1 కప్పు
యాలకుల పొడి -- 1/2 స్పూన్
పంచదార -- 1/4 కేజీ
కిస్ మిస్ -- 2 స్పూన్స్
జీడిపప్పు -- 3స్పూన్స్
బాదంపప్పు -- 2 స్పూన్స్
నెయ్యి -- 2 స్పూన్స్
సగ్గుబియ్యం -- 1/4 కప్పు (10 నిముషాలు ముందు ఉడికించి పక్కన పెట్టుకోవాలి)

తయారీ విధానం:--

ముందుగా  స్టవ్ వెలిగించి ఒక మందపాటి గిన్నెలో నెయ్యి వేసి జీడిపప్పు, కిస్ మిస్ , బాదం పప్పు లను వేరువేరుగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో పాలుపోసి, బాగా మరిగిన తరవాత పంచదార వేసి.... అందులో కొబ్బరి తురుము, ముందుగా ఉడికించి పక్కనపెట్టుకున్న సగ్గుబియ్యం, అన్ని వేసి బాగా మరిగించి, దించేముందు యాలకులపొడిని వేసి, పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పాయసంలో వేయించి పక్కన ఉంచుకున్న .. జీడిపప్పు, కిస్ మిస్, బాదంపప్పు  వేసుకోవాలి. అంతే తియ్యని కమ్మని కొబ్బరి పాయసం రెడీ.




       

21.10.13

పొట్లకాయ తిమ్మనం

పొట్లకాయ తిమ్మనం

కావలసిన పదార్థాలు
బియ్యపు పిండి -- 3 స్పూన్స్
పొట్లకాయ ముక్కలు -- 1 కప్పు (ఉడికించినవి)
కొబ్బరి -- 4 స్పూన్స్
పాలు -- 1/2 లీటరు
పంచదార -- 1/4 కేజీ
జీడిపప్పు -- 50 గ్రా
కిస్ మిస్ -- 25 గ్రా
యాలకులపొడి -- 1 స్పూన్
నెయ్యి -- 2 స్పూన్స్

తయారీ విధానం:--

ముందుగా  బియ్యంపిండిని, కొబ్బరిని మిక్సీలో మెత్తగా రుబ్బి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మందపాటి గిన్నెలో పాలుపోసి మరిగించి, పంచదార వేసి పాలను బాగా మరిగించాలి. ఇప్పుడు రుబ్బి ఉంచుకున్న కొబ్బరి + బియ్యపుపిండి మిశ్రమాన్ని మరియు ఉడికించి ఉంచుకున్న పొట్లకాయ ముక్కలని వేసి సన్నటి సెగ మీద 10 నిముషాలు ఉడకనివ్వాలి. కొంచెం చిక్కబడే సమయానికి దించెయ్యాలి. ఇప్పుడు ఒక చిన్న బాణలిలో నెయ్యి వేసి... జీడిపప్పు + కిస్ మిస్ లను దోరగా వేయించి తిమ్మనంలో వేసుకుని, యాలకులపొడిని కూడా కలిపుకోవాలి. అంతే తియ్యటి తిమ్మనం రెడీ. ఈ తిమ్మనంలో అట్లను నంజుకొని తింటే చాలా బావుంటుంది.



అట్లతద్ది అట్లు

అట్లతద్ది అట్లు 

కావలసిన పదార్థాలు:--

మినప్పప్పు -- 1 కప్పు
బియ్యం -- 2 కప్పులు
ఉప్పు -- తగినంత
జీలకర్ర -- 1 స్పూన్
నూనె -- తగినంత

తయారీ విధానం:--
మినప్పప్పు & బియ్యం 4 గంటలు ముందుగా నానబెట్టి, రుబ్బుకుని, ఉప్పు & జీలకర్ర కలిపి 8 గంటలు నాననివ్వాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి, పెనం (pan) పెట్టుకొని, వేడి ఎక్కిన తరవాత నూనె రాసి, అట్టుని వేసుకొని, దోరగా కాలిన తరవాత తీసేయ్యటమే. పిండిని కొంచెం గట్టిగా రుబ్బుకుంటే, పెనం మీద వేసేటప్పుడు గట్టిగా రుద్ది అట్టుని వేస్తె అట్టు మృదువుగా వస్తుంది. అంతే ఎంతో రుచిగా ఉండే అట్లతద్ది అట్లు రెడీ....నోము నోచినవాళ్ళు ఇలాగ అట్లు వేసుకొని తింటారు. ముత్తైదువులకు వాయనం ఇవ్వటానికి చిన్న చిన్న అట్లని వేసి ఇస్తారు. ఈ అట్లని బెల్లం పాకంతో కానీ, తిమ్మనంతో కానీ తింటే బావుంటుంది. 


10.10.13

కూరగాయల అన్నం

కూరగాయల అన్నం (Mixed Vegetable Rice)

కావలసిన పదార్థాలు:--

క్యారెట్ ముక్కలు -- 1/4 కప్పు
క్యాప్సికం ముక్కలు -- 1/4 కప్పు
టమాట ముక్కలు -- 1/4 కప్పు
పచ్చిబఠాణీ -- 1/4 కప్పు
వంకాయముక్కలు -- 1/4 కప్పు
బెండకాయ ముక్కలు -- 1/4 కప్పు
తీపిగుమ్మిడి ముక్కలు -- 1/4 కప్పు
కరివేపాకు & కొత్తిమీర -- కొద్దిగా
కందిపప్పు -- 1/2 కప్పు
బియ్యం -- 2 పావులు  
చింతపండుగుజ్జు -- 1/4 కప్పు
పోపుదినుసులు -- తగినంత
ఉప్పు -- రుచికి సరిపడినంత
నూనె -- 1/4 కేజీ

తయారీవిధానం:--

ముందుగా బియ్యాన్ని కడిగి పక్కనపెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి నూనెవేసి, పోపుదినుసులు వేసి, వేగినతరవాత  కూరగాయ ముక్కల్ని, కరివేపాకు & కొట్టిమీరని  ఒక్కొక్కటిగా వేసి, కడిగిన కందిపప్పును, బియ్యాన్ని, తగినంత ఉప్పును, చింతపండుగుజ్జును వెయ్యాలి. అన్నీ వేసిన తరవాత బాగా కలియబెట్టి, 4 పావులు  నీళ్ళు పోసి, మిగిలిన నూనెను వేసి, కుక్కరు మూతపెట్టి, 5 విసెల్స్ వచ్చేవరుకు ఉంచి దించుకోవాలి. అంతే రుచికరమైన  కూరగాయల అన్నం రెడీ.        

రవ్వకేసరి

రవ్వకేసరి 

కావలసిన పదార్థాలు:--
గోధుమనూక (బొంబాయి రవ్వ) -- 1/2 కేజీ
పంచదార -- 1/2 కేజీ
నెయ్యి -- 1/4 కేజీ
జీడిపప్పు -- 50 గ్రాములు
కిస్ మిస్ -- 50 గ్రాములు
కేసరి రంగు -- చిటికెడు
పాలు & నీళ్ళు -- 1 లీటరు
యాలకులపొడి -- 1 స్పూన్

తయారీవిధానం:--
ముందుగా  గోధుమనూకని వేయించి పక్కనపెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక గిన్నెను తీసుకొని, 1  లీటరు పాలు నీళ్ళుపోసి, బాగా మరిగిన తరవాత, గోధుమనూక.... పంచదార, యాలకులపొడిని  కలిపి మసిలిన నీటిలో వేసి, కేసరి రంగును చిటికెడు వేసుకోవాలి. బాగా దగ్గరపడిన తరవాత, దించి పక్కనపెట్టుకోవాలి. ఇప్పుడు బాణలిలో నెయ్యివేసి జీడిపప్పు & కిస్ మిస్ ని దోరగా వేయించి కేసరిలో కలపాలి. అంతే  తియ్యని.... కమ్మని రవ్వకేసరి రెడీ.

           

(చిల్లులు లేని) అల్లం గారెలు

(చిల్లులు లేని) అల్లం గారెలు

కావలసిన పదార్థాలు:--
మినప్పప్పు -- 1/2 కేజీ
అల్లం -- 100 గ్రాములు
పచ్చిమిర్చి -- 50 గ్రాములు
జీలకర్ర -- 2 స్పూన్స్
కొత్తిమీర & కరివేపాకు -- కొంచెంగా 
నూనె -- 1/2 కేజీ
ఉప్పు -- తగినంత

తయారీవిధానం:--
గారెలు చేసే 2 గంటల ముందుగా మినప్పప్పుని నానబెట్టాలి. నానిన తరవాత నీళ్ళు తక్కువగా పోసి, గారెలపిండిలాగ గట్టిగా రుబ్బుకోవాలి. అల్లం, పచ్చిమిర్చి ముద్దలాగా చేసుకొని కలుపుకోవాలి. జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలి పెట్టి, నూనె పోసి గారెలపిండిని తీసుకొని చిల్లులు లేకుండా వడలులాగా వేసుకోవాలి. దోరగా వేయించి తీసుకోవాలి. అంతే వేడివేడి కమ్మని అల్లం గారెలు రెడీ.              


కొబ్బరి అన్నం

కొబ్బరి అన్నం 

కావలసిన పదార్థాలు:--

బియ్యం -- 1/2 కేజీ
కొబ్బరి తురుము -- 4 కప్పులు
జీడిపప్పు -- 50 గ్రాములు
నెయ్యి -- 50 గ్రాములు
ఏలకులు -- 4
లవంగాలు -- 4
దాల్చినచెక్క -- 4 ముక్కలు
పచ్చిమిర్చి -- 5 (చీలికలు చేసుకోవాలి) 
కరివేపాకు -- తగినంత
పల్లీలు -- 4 స్పూన్స్
ఉప్పు -- తగినంత

తయారీవిధానము:--
ముందుగా బియ్యం కడిగి పక్కన ఉంచుకోవాలి,  కొబ్బరితురుమును మిక్సీలో వేసి బాగా మెత్తగా చేసి, పాలను తీసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాత్రను పెట్టి, కొద్దిగా నెయ్యి వేసి, యాలకులు, లవంగాలు, దాల్చినచెక్క, జీడిపప్పు,  పల్లీలు, పచ్చిమిర్చి వేసి వేగిన తరవాత కొబ్బరిపాలు పోసి, కడిగి పక్కన పెట్టుకున్న బియ్యాన్ని వేసి, తగినంత ఉప్పు వేసి, మూతపెట్టి, ఉడికేంతవరకు ఉంచి, దించుకోవాలి. అంతే కమ్మని కొబ్బరి అన్నం రెడీ.