Showing posts with label పచ్చళ్ళు. Show all posts
Showing posts with label పచ్చళ్ళు. Show all posts

8.4.17

వంకాయ పచ్చి పచ్చడి

వంకాయ పచ్చి పచ్చడి

ఈ వంకాయ పచ్చి పచ్చడి చెయ్యటానికి పెద్ద తెల్ల వంకాయలని వాడుకోవాలి. అప్పుడే పచ్చడికి రుచి బాగా వస్తుంది.  

కావలసిన పదార్థాలు 
తెల్ల వంకాయలు పెద్దవి - 2 
ఉల్లిపాయ ముక్కలు - 1 కప్పు 
పచ్చిమిర్చి - 6
అల్లం - చిన్నముక్క 
కొత్తిమీర - 1/4 కప్పు 
కరివేపాకు - రెండు రెబ్బలు 
ఉప్పు - రుచికి సరిపడినంత  
ఇంగువ - 1/4 స్పూన్  
పోపు దినుసులు
శనగపప్పు  మినపప్పు  ఆవాలు  ఎండుమిర్చి

తయారుచేయు విధానం 
ముందుగా వంకాయలని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తడి ఆరిన తరవాత వంకాయలకి నూనె రాసి ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి సన్నని మంటపై వంకాయలని అన్నివైపులా సమానంగా కాల్చుకోవాలి. కాయలు చల్లారిన తరవాత పై తొక్కని తీసేసి, లోపలి గుజ్జుని ఒక పాత్రలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ గుజ్జుని పురుగులు లేకుండా చూసుకొని మెత్తగా చేసుకొని కొత్తిమీర, కరివేపాకు, సన్నగా తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి అన్నీ బాగా కలిపి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలి పెట్టి నూనె వేసి పోపుదినుసులు ఒక్కొక్కటిగా వేసుకుని చిటపటలాడాక కరివేపాకు, సన్నగా చేసి ఉంచుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఇంగువ వేసి పక్కనే ఉంచుకున్న వంకాయ గుజ్జు(పచ్చడి)లో వేసి బాగా కలపాలి. అంతే వంకాయ పచ్చి పచ్చడి రెడీ. వేడి వేడి అన్నంలో కమ్మని నూనె వేసుకొని పచ్చడిని కలుపుకు తింటే ఉంటుంది......... హ్మ్మ్ నేను చెప్పటం ఎందుకు ఎలా ఉంటుందో మీరే తిని నాకు చెప్పండి. 

              

7.4.17

బీరకాయ పచ్చడి,

బీరకాయ పచ్చడి

కావలసిన పదార్థాలు
బీరకాయ ముక్కలు - 1 కప్పు
పసుపు - చిటికెడు
ఉప్పు - రుచికి సరిపడినంత
చింతపండు - కొద్దిగా
వెల్లుల్లి - 3 రెబ్బలు
(పోపు దినుసులు)
మినపప్పు - 1/2 స్పూన్
శెనగపప్పు - 1/2 స్పూన్
ఆవాలు - 1 స్పూన్
జీలకర్ర - 1/4 స్పూన్ 
మెంతులు - చాలా కొంచెం
ఇంగువ - 1/4 స్పూన్ 
ఎండుమిర్చి - 3 (కారం ఎక్కువ కావాలి అనుకునేవారు ఎక్కువ వేసుకోవచ్చును)

తయారుచేయు విధానం 
ముందుగా బీరకాయలని శుభ్రంగా కడిగి తొక్కు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పక్కన ఉంచుకోవాలి.  ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బాణలి పెట్టి, నూనె పోసి వేడెక్కాక పోపు దినుసులు ఒక్కొక్కటిగా వేసుకొని, బాగా వేగిన తరవాత ఇంగువ వేసి దించి ఒక బౌల్ లో పోపుని ఉంచుకోవాలి. ఇప్పుడు అదే బాణలిలో మరికొద్దిగా నూనె వేసి తొక్కుతీసి ముక్కలు చేసి పక్కన ఉంచుకున్న బీరకాయ ముక్కలని వేసి ఒకసారి బాగా కలిపి, స్టవ్ మంటను బాగా తగ్గించి మూతపెట్టి ఒక 10 నిమిషాలసేపు ఉంచాలి. ముక్కలు మెత్తబడిపోతే దించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ గిన్నెలో పోపుని, ఉప్పు, పసుపు, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు అన్నీ వేసి బాగా మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ మిశ్రమంలో మగ్గించి పక్కనపెట్టుకున్న బీరకాయ ముక్కలని వేసి మరొకసారి మెత్తగా రుబ్బుకోవాలి. అంతే బీరకాయ పచ్చడి రెడీ. ఇష్టమైనవారు ఈ పచ్చడిపైన కొద్దిగా నూనె వేడిచేసి మినప్పప్పు, ఆవాలు ఇంగువ వేసి పోపు వేసుకోవచ్చును, పోపు వెయ్యకపోయినా పరవాలేదు. 

(కొంతమంది బీరకాయలని తొక్కుతీసి ముక్కలని కూర చేసుకుంటారు, కానీ తొక్కుని పారేస్తారు, అలా తొక్కులని పారెయ్యకుండా ఇక్కడ మనం బీరకాయ ముక్కలతో పచ్చడిని చెప్పుకున్నాము కదా ఆ ముక్కలతో పాటుగా తొక్కుని కూడా సన్నగా తరిగి మగ్గించుకోవచ్చును. అప్పుడు అది బీరకాయ తొక్కు పచ్చడి అవుతుంది. ఆ తొక్కు పచ్చడి చేసే విధానం కూడా ఇలానే)   
                         

దోసకాయ బండ(పచ్చి) పచ్చడి

దోసకాయ బండ(పచ్చి) పచ్చడి
 

కావలసిన పదార్థాలు 
దోసకాయ ముక్కలు - 1 కప్పు 
పసుపు - చిటికెడు 
చింతపండు - చిన్న నిమ్మకాయంత 
ఉప్పు - రుచికి సరిపడినంత 
ఇంగువ - 1/4 స్పూన్ 
నూనె - పోపుకి సరిపడినంత 
(పోపు దినుసులు) 
మినపప్పు - 3స్పూన్స్, 
ఆవాలు - 1 స్పూన్ 
మెంతులు - చాల కొంచెం (దగ్గరదగ్గర 10 గింజలు వేస్తె చాలు, ఎక్కువ వేస్తె చేదు వస్తుంది.)
ఎండుమిర్చి - 3

తయారుచేయు విధానం 
ముందుగా దోసకాయలని బాగా కడిగి పైన తొక్కను తీసి కాయను రెండు ముక్కలు చెయ్యాలి. దోసకాయ లోపల ఉన్న గింజలను వేరు చేసి ఒక బౌల్ లోకి తీసుకొని ఉంచుకోవాలి.  ఇప్పుడు దోసకాయని వీలైనంత సన్నగా చిన్న చిన్న ముక్కలుగా తరుగుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలి పెట్టి అందులో పోపుకి సరిపడినంత నూనెను పోసి వేడెక్కాక మినప్పప్పు వేసి వేయించుకోవాలి తరవాత మెంతులు, ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువ అన్నీ ఒకదాని తరవాత ఒకటిగా వేసుకుంటూ పోపు మాడకుండా దించి పక్కన ఉంచుకోవాలి. పోపు చల్లారిన తరవాత మిక్సీ గిన్నెలో వేసి, ఉప్పు, పసుపు, చింతపండుని వేసి బాగా మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో దోసకాయలనుండి వేరు చేసిన గింజలని కూడా వేసి మరొకసారి మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తం మిశ్రమాన్ని సన్నగా తరుగుకొని పక్కన ఉంచుకున్న దోసకాయ ముక్కలలో వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన బాణలి పెట్టి కొద్దిగా నూనె వేసి మినప్పప్పు, ఆవాలు, ఇంగువ పోపు వేసి దోసకాయ పచ్చడి పైన వెయ్యాలి. ఎంతో రుచికరమైన ఘుమఘుమలాడే దోసకాయ బండ(పచ్చి) పచ్చడి రెడీ. 
(పచ్చడిని ముక్కలుగా తినటం ఇష్టంలేని వారు పోపుని మిక్సీలో వేసి మెత్తగా తిప్పిన తరవాత ముక్కలని కూడా వేసి ఒక్కసారి తిప్పి వెంటనే ఆపెయ్యాలి. ఆలా చేస్తే ముక్కలు సగం నలిగి నలగకుండా ఉంటాయి. ఆలా కూడా పచ్చడి బాగానే ఉంటుంది.)     
                       

కొత్తిమీర పచ్చడి

కొత్తిమీర పచ్చడి
కావలిసిన పదార్థాలు
కొత్తిమీర తరుగు - 2 కప్పులు 
పచ్చిమిర్చి - 5
చింతపండు - కొద్దిగా 
పసుపు - చిటికెడు 
ఉప్పు - రుచికి  సరిపడినంత 
ఇంగువ - 1/4 స్పూన్ 
నూనె - పోపుకి సరిపడినంత 
పోపుదినుసులు- మినప్పప్పు, శనగపప్పు, 2ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర     

తయారుచేయు విధానం 
ముందుగా కొత్తిమీర వేళ్ళు తీసేసి, బాగా కడిగి, సన్నగా తరుగుకొని కప్పులో ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలి పెట్టి, వేడి అయ్యాక పోపుకి సరిపడా కొద్దిగా నూనె వేసి కాగిన తరవాత, పోపుదినుసులు వేసి చిటపటలాడాక ఇంగువ వేసి దించి పక్కన ఉంచుకోవాలి. కొత్తిమీర పచ్చివాసన అంటే కొంతమంది ఇష్టపడరు అందుకని, పోపువేసిన బాణలిలోనే కొద్దిగా నూనె వేసి కడిగి పక్కన పెట్టుకున్న కొత్తిమీరని, పచ్చిమిర్చిని వేసి పచ్చివాసన పోయేంతవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీలో ముందుగా పోపుని, ఉప్పు, పసుపు, చింతపండుని వేసి బాగా మెత్తగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడిలో కొత్తిమీరని వేసి మెత్తగా రుబ్బుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన కొత్తిమీర పచ్చడి రెడీ. పచ్చడిపైన ఇష్టమున్నవారు కమ్మదనం కోసం ఎండుమిర్చి, ఆవాలు, ఇంగువ పోపు వేసుకోవచ్చును. ఈ పచ్చడి అన్నంలో కలుపుకోవచ్చు, ఇడ్లీ, దోస వంటి టిఫిన్స్ లో చట్నీలాగా కూడా వాడుకోవచ్చును. 
                  

6.4.17

వెలక్కాయ పచ్చడి & వెలక్కాయ పెరుగు పచ్చడి

వెలక్కాయ పచ్చడి

కావలిసిన పదార్థాలు
వెలక్కాయ గుజ్జు - 1 కప్పు 
పచ్చి మిర్చి - 6
పసుపు - చిటికెడు 
ఉప్పు - రుచికి సరిపడినంత 
బెల్లం  -1/4 కప్పు
కొత్తిమీర - 1 కట్ట 
ఇంగువ - 1/4 స్పూన్ 
చింతపండు - చిన్న నిమ్మకాయంత 
నూనె - పోపుకి సరిపడినంత 
పోపు దినుసులు - మినప్పప్పు, శనగపప్పు, 2 ఎండుమిర్చి, ఆవాలు    

తయారు చేయువిధానం
ముందుగా స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక అందులో నూనె వేసి పోపు దినుసులను, ఇంగువను వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీలో పోపుని, ఉప్పు, పసుపు, చింతపండు, బెల్లం, కొత్తిమీర, పచ్చిమిర్చి అన్నీవేసి మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో వెలక్కాయ గుజ్జుని వేసి బాగా మెత్తగా రుబ్బుకోవాలి(మిక్సీలో). అంతే  కొంచెం కారముగా, కొంచెం వగరుగా , భలే రుచిగా ఉండే వెలక్కాయ పచ్చడి రెడీ. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకు తింటే ఎంత బావుంటుందో. మీరు ట్రై చేస్తారు కదూ.


వెలక్కాయ పెరుగు పచ్చడి

ఒక బౌల్ లోకి రెండు గరిటెల పెరుగు తీసుకొని ఈ పచ్చడిని కలిపి ఈ మిశ్రమంలో కొద్దిగా మినప్పప్పు, ఆవాలు , ఒక ఎండు మిర్చి, రెండు కరివేపాకు రెబ్బలు, ఇంగువ పోపు వేసి కలుపుకుంటే వెలక్కాయ పెరుగు పచ్చడి రెడీ.  

    

కంది(పప్పు) పచ్చడి

కంది(పప్పు) పచ్చడి   

కావలసిన పదార్థాలు 
కందిపప్పు - 1 కప్పు 
ఎండుమిర్చి - 6
జీలకర్ర - 1/2 స్పూన్ 
ఇంగువ - 1 స్పూన్ 
ఉప్పు - తగినంత 
పసుపు - చిటికెడు 
చింతపండు - చిన్న నిమ్మకాయంత 
నూనె - పోపుకి సరిపడినంత 
పోపుదినుసులు - ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, ఇంగువ 

తయారుచేయు విధానం 
ముందుగా స్టవ్ వెలిగించి బాణలి పెట్టి, బాణలి వేడి ఎక్కాక అందులో కందిపప్పుని వేసి మాడిపోకుండా దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాణలిలో కొంచెం నూనె వేసుకొని పోపుదినుసులని వేసి అవి చిటపటలాడాక ఇంగువ వేసి దించి పక్కనే ఉన్న కందిపప్పులో వేసుకోవాలి. కందిపప్పు, పోపు ఉన్న మిశ్రమంలో కొద్దిగా రుచికి సరిపడినంత ఉప్పు, చింతపండు, పసుపు వేసి మిక్సీ గిన్నెలో వేసి బాగా మెత్తగా పొడి చేసుకుంటూ కొద్దికొద్దిగా నీళ్ళు పోస్తూ మెత్తగా రుబ్బుకోవాలి(మిక్సీలో). ఇష్టమైనవాళ్ళు రుబ్బిన పచ్చట్లో కొద్దిగా ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు వేసుకుంటారు. వేసుకోకపోయినా బావుంటుంది.  అంతే ఘుమఘుమలాడే కందిపచ్చడి రెడీ.       

30.3.14

ఉగాది పచ్చడి

ఉగాది పచ్చడి



ఉగాది పచ్చడి గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీకు తెలియచేస్తున్నాను.

ఈ పచ్చడిలో ఆరు రుచులు కలసి ఉంటాయి, ఆరు ఋతువులకు ప్రతీక---తీపి--చేదు, ఉప్పు--కారం, పులుపు--వగరు.

1) తీపిని కలిగించే కొత్త బెల్లం---ఆకలిని కలిగిస్తుంది.

2) పులుపునిచ్చే చింతపండు---కఫ వాతాలని పోగొడుతుంది.

3) కారం---శరీరంలోని క్రిముల్ని నాశనం చేయటమే కాక, శ్లేష్మ రోగాలని దరిచేరనీయదు.

4) వగరు పుట్టించే మామిడి--- లాలాజలాన్ని ఊరించి, జీర్ణక్రియకి తోడ్పడుతుంది.

5)వేపపువ్వు---కడుపులోని ఏమైనా అనారోగ్య దోషాలు ఉంటే, వాటిని దూరం చేస్తుంది. కడుపులో ఉన్న నులిపురుగును చంపి, తిరిగి పుట్టనీయకుండా చేస్తుంది. ఇందులోఇంకా చాలా ఔషధగుణాలున్నాయి.

6) ఉప్పు--ఎముకలని బలపరుస్తుంది.

మన సంవత్సర ఫలితం ఉగాది పచ్చడి మీద ఆధారపడి ఉంటుందట. తీపిఎక్కువగ ఉంటే, మనజీవితం ఆనందమయంగా ఉంటుందని చెబుతారు. అలా అని మనం కోరుండి తీపి ఎక్కువ వేసుకుని తినకూడదు. మనకు నచ్చిన, నచ్చకపోయినా తప్పనిసరి ఈ పచ్చడిని, ఈ ఒక్కరోజు తిని తీరాలి.

పచ్చడి తయారుచేయుటకు కావలసిన పదార్థాలు 

బెల్లం
వేపపువ్వు
చింతపండు
మామిడికాయ ముక్కలు (సన్నగా తురిమి ఉంచుకోవాలి)
ఉప్పు
కారంపొడి


తాయారు చేయు విధానం 

చింతపండును 15 నిమిషముల ముందు నానబెట్టి, పులిహోరకి తీసుకున్నట్టుగా చిక్కగా పులుసు తీసుకొని ఒక బౌల్ లోకి ఉంచుకోవాలి. అందులో -- వేపపువ్వును, (వేపపువ్వును రెమ్మలనుండి వలచి, రెండు అరచేతుల మధ్య ఉంచి, నులిమితే పువ్వు యొక్క సన్నని పొట్టు వస్తుంది.), సన్నగా తరిగి ఉంచుకున్న మామిడి ముక్కలను, తగినంత ఉప్పు & కారంను వేసి...... అన్ని బాగా కలపాలి. అంతే ఆరు రుచుల ఉగాది పచ్చడి రెడీ. 

ఇది అసలు ఉగాది పచ్చడి చేసే విధానం. కానీ కొంతమంది ఇందులో అరటిపండు ముక్కలు, జీడిపప్పు, కిస్స్మిస్స్ మొదలైనవన్నీ కలుపుతుంటారు. ఆ విధంగా కలిపితే ఆరు రుచులే కాకుండా ...... ఇంకా ఎక్కువ రుచుల సమ్మేళనం అవుతుంది కదా !  మీరే ఆలోచించండి. 

            

21.6.13

టమాట పచ్చడి

టమాట పచ్చడి

కావలసిన పదార్థాలు:--
టమాటాలు -- 1/2 కేజీ 
కారం -- 1 కప్పు 
ఉప్పు --తగినంత
మెంతులు పొడి -- వేయించి పొడి చేసుకోవాలి -- 2 స్పూన్స్
పోపుదినుసులు -- సెనగపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు & ఇంగువ.
నూనె -- 150 గ్రాములు

తయారీవిధానము:--
ముందుగా టమాటాలను శుభ్రం చేసి, ముక్కలు కోసి ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించి, బాణలి పెట్టి, కొంచెం నూనె వేసి టమాటా ముక్కల్ని వేయించుకోవాలి. మూత పెట్టకుండా, సన్నని సెగమీద, వేయించుకోవాలి. ముక్కల్లో ఉన్న నీరు అంతా పోయి, నూనె మిగిలే వరకూ వేయించుకోవాలి. దీనిలో ఉప్పు & కారం వేసి, ముక్కలన్నీ మెత్తగా అయ్యేంతవరకు గరిటతో కలపాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న బాణలిలో మెంతుల్ని, నూనె లేకుండా దోరగా వేయించి, పొడి చేసి, టమాటా పచ్చట్లో కలుపుకోవాలి. మిగిలిన నూనెలో సెనగపప్పు, ఆవాలు, ఎండుమిర్చి , ఇంగువ & కరివేపాకు వేసి వేయించి పచ్చడి మీద వేసి కలుపుకోవాలి. ఇది చల్లారాక సీసాలో దాచుకుంటే, నెల రోజులవరకు ఉంటుంది. అంతే కమ్మని టమాటా పచ్చడి రెడీ.




గోంగూర పచ్చడి

గోంగూర పచ్చడి

కావలసిన పదార్థాలు 
గోంగూర (కడిగి ఆరబెట్టిన గోంగూర ఆకులు)-- 8 కప్పులు 
ఎండుమిర్చి 50 గ్రాములు
ఉప్పు -- తగినంత
పోపు దినుసులు --ఆవాలు, మెంతులు, ఇంగువ.
ఉల్లిపాయల ముక్కలు-- ఒక కప్పు
నూనె -- 1/2 కప్పు

తయారీ విధానం
ముందుగా స్టవ్ వెలిగించి, బాణలిపెట్టి, నూనె వేసి, వేడి ఎక్కిన తరవాత, పోపు వేసుకుని, చివర్లో ఎండుమిర్చి & ఇంగువ వేసి దించి, వేరే ప్లేటులో పెట్టుకోవాలి. అదే బాణలిలో కొంచెం నూనె వేసి, గోంగూరని వేసి, సన్నటి సెగమీద వేయించుకోవాలి. ఆకు బాగా దగ్గర పడేవరకు వేయించుకోవాలి. చల్లారిన తరవాత పోపులో ఉప్పు వేసి మిక్సీలో మెత్తగా అయ్యిన తరవాత గోంగూరని కూడా వేసి తిప్పాలి. మరీ పేస్టు లాగా తిప్పకూడదు. చివరిగా పచ్చట్లో కొంచెం నూనె వేడి చేసి.... ఆవాలు &ఇంగువ వేయించి పచ్చడి పైన వేసుకోవాలి. ఉల్లిముక్కల్ని వేసి కలుపుకుంటే బావుంటుంది. అంతే ఆంధ్ర స్పెషల్ గోంగూర పచ్చడి రెడీ.




మామిడికాయ & పెసరపప్పు పచ్చడి

మామిడికాయ & పెసరపప్పు పచ్చడి

కావలసిన పదార్థాలు
మామిడికాయ --1 
పెసరపప్పు --1 కప్పు 
ఎండుమిర్చి --6
ఉప్పు --రుచికితగినంత
పసుపు -- చిటికెడు
పోపుదినుసులు -- ఎండుమిర్చి, ఆవాలు & ఇంగువ

తయారీవిధానము
పచ్చడి చేసే ఒక గంట ముందుగా పెసరపప్పును నానబెట్టుకోవాలి. మామిడికాయని చెక్కు తీసి, చిన్ని ముక్కలుగా తరిగి ఉంచుకోవాలి. మామిడి ముక్కల్ని, నానబెట్టి ఉంచుకున్న పెసరపప్పుని, ఎండుమిర్చి, ఉప్పు & పసుపు వేసి మిక్సీ లో మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని, స్టవ్ వెలిగించి, బాణలి పెట్టి, నూనె వేసి, ఆవాలు, ఎండుమిర్చి & ఇంగువ వెయ్యాలి. పోపు వేగాక పచ్చట్లో వేసి కలపాలి. అంతే పుల్ల పుల్లని మామిడికాయ--పెసరపప్పు పచ్చడి రెడీ.



30.4.13

కొబ్బరి -- మామిడి పచ్చడి

కొబ్బరి -- మామిడి పచ్చడి
కావలసిన పదార్థాలు
కొబ్బరి తురుము -- 2 కప్పులు 
మామిడి తురుము -- 1 కప్పు 
ఎండుమిరపకాయలు -- 10
పోపుదినుసులు, ఇంగువ, ఉప్పు, పసుపు & నూనె
తయారీవిధానము
ముందుగా స్టవ్ వెలిగించి బాణలిపెట్టి, కొంచెం నూనెవేసి, కాగినతరవాత--పోపుదినుసులు, ఇంగువ, ఎండుమిరపకాయలు వేసి బాగా వేగినతరవాత దించి పక్కనపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పోపులో కొబ్బరితురుము, మామిడి తురుము, తగినంత ఉప్పు , పసుపు వేసి మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. అంతే పుల్ల -- పుల్లని కొబ్బరి -- మామిడి పచ్చడి రెడీ. ఇష్టమైన వాళ్ళు పచ్చడిపై మిరపకాయి , ఆవాలు, ఇంగువ అన్ని కలిపి, పోపు వేసుకోవచ్చును వచ్చును.


ఉగాది పచ్చడి

ఉగాది పచ్చడి
ఉగాది పచ్చడి గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీకు తెలియచేస్తున్నాను.
ఈ పచ్చడిలో ఆరు రుచులు కలసి ఉంటాయి, ఆరు ఋతువులకు ప్రతీక---తీపి--చేదు, ఉప్పు--కారం, పులుపు--వగరు.
1) తీపిని కలిగించే కొత్త బెల్లం---ఆకలిని కలిగిస్తుంది.
2) పులుపునిచ్చే చింతపండు---కఫ వాతాలని పోగొడుతుంది.
3) కారం---శరీరంలోని క్రిముల్ని నాశనం చేయటమే కాక, శ్లేష్మ రోగాలని దరిచేరనీయదు.
4) వగరు పుట్టించే మామిడి--- లాలాజలాన్ని ఊరించి, జీర్ణక్రియకి తోడ్పడుతుంది.
5)వేపపువ్వు---కడుపులోని ఏమైనా అనారోగ్య దోషాలు ఉంటే, వాటిని దూరం చేస్తుంది. కడుపులో ఉన్న నులిపురుగును చంపి, తిరిగి పుట్టనీయకుండా చేస్తుంది. ఇందులోఇంకా చాలా ఔషధగుణాలున్నాయి.
6) ఉప్పు--ఎముకలని బలపరుస్తుంది.
మన సంవత్సర ఫలితం ఉగాది పచ్చడి మీద ఆధారపడి ఉంటుందట. తీపిఎక్కువగ ఉంటే, మనజీవితం ఆనందమయంగా ఉంటుందని చెబుతారు. అలా అని మనం కోరుండి తీపి ఎక్కువ వేసుకుని తినకూడదు. మనకు నచ్చిన, నచ్చకపోయినా తప్పనిసరి ఈ పచ్చడిని, ఈ ఒక్కరోజు తిని తీరాలి.