29.9.17

పాయసాన్నం

పాయసాన్నం 


కావలసిన పదార్థాలు:--
బియ్యం -- 2 కప్పులు
పంచదార -- 4 కప్పులు
నెయ్యి -- 1కప్పు
ఏలకుల పొడి -- 1 స్పూన్
జీడిపప్పు -- 50 గ్రాములు
కిస్ మిస్ -- 25 గ్రాములు

తయారీ విధానం:--
ముందుగా స్టవ్ వెలిగించి, బియ్యం కుక్కర్ లో మెత్తగా ఉడికించి, పక్కనపెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో పంచదార  వేసి మెత్తగా గరిటతో కలుపుతూ స్టవ్ మీద సన్నని మంటపై, ఉడికించితే, పంచదార అంతా కరిగి మెత్తగా పాకంలాగా వస్తుంది. ఇది ఉడికే లోపున....వేరే స్టవ్ మీద చిన్న పాత్రలో నెయ్యి వేసి, వేడిచేసి అందులో జీడిపప్పు, కిస్ మిస్ లు దోరగా వేయించి, పాయసాన్నంలో వేసి, ఏలకుల పొడి వేసి కలిపి దగ్గరగా అయిన తరవాత, దించుకోవటమే. అంతే ఎంతో రుచికరమైన తియ్యని పాయసాన్నం రెడీ.23.8.17

రవ్వ కుడుములు

రవ్వ కుడుములు 

కావలసిన పదార్థాలు 
వరినూక(బియ్యం రవ్వ) -- 1కప్పు
శెనగపప్పు -- 2 స్పూన్స్
కొబ్బరితురుము -- 2 స్పూన్స్
జీలకర్ర -- 1/2 స్పూన్
నెయ్యి -- 2 స్పూన్స్
ఉప్పు -- రుచికి తగినంత

తయారీవిధానం

శెనగపప్పుని కడిగి 15 నిముషాలు నానబెట్టి నీళ్ళు వంపేసి ఉంచాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి, ఒక గిన్నెలో నీళ్ళు పోసి, మరిగిన తరవాత ఉప్పు & జీలకర్ర వేసి, రవ్వను వేస్తూ ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. నీరు అంతా ఇంకిపోయి, రవ్వ ఉడికిన తరవాత దించి చల్లారిన తరవాత, కొబ్బరితురుము - నానబెట్టిన శెనగపప్పు - నెయ్యి వేసి, గుండ్రంని ఉండలుగా చేసుకొని, ఇడ్లీ రేకులలో ఉంచి..... స్టవ్ వెలిగించి ఇడ్లీ కుక్కర్ ను సుమారుగా 10 నిముషాలు ఉంచి ఆవిరిపెట్టి, దించుకోవాలి. అంతే వినాయకునికి ఇష్టమైన రవ్వకుడుములు రెడీ.

జిల్లేడుకాయలు

జిల్లేడుకాయలు  

కావలసిన పదార్థాలు 
బియ్యంపిండి -- 1 కప్పు 
బెల్లంతురుము -- 1 కప్పు 
కొబ్బరితురుము -- 1 కప్పు 
యాలకులపొడి -- 1/2 స్పూన్ 
నెయ్యి -- 1 స్పూన్ 
ఉప్పు -- తగినంత 

తయారీవిధానం

ముందుగా స్టవ్ వెలిగించి, ఒక గిన్నె పెట్టి నీళ్ళు పోసి, మరిగిన తరవాత, కొంచెంగా నూనె , ఉప్పు వేసి కలిపి, బియ్యంపిండిని వేస్తూ, ఉండలు కట్టకుండా తిప్పి, 2 నిముషాలు తరవాత దించుకోవాలి. చల్లారిన తరవాత చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 

ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలి పెట్టి, బెల్లంతురుము, కొబ్బరితురుము వేసి తక్కువ మంటపై ఉంచి, ఆ మిశ్రమం గట్టిపడేవరకు ఉంచాలి. చివరగా యాలకులపొడిని వేసి దించాలి. 

చేతులకు నెయ్యి రాసుకొని, ముందుగా చేసి ఉంచుకున్న ఉండలని చిన్న చపాతీలాగా చేతితోనే వత్తుకోవాలి, అందులో కొబ్బరి పూర్ణం కొంచెంగా ఉంచి, ఆ చపాతీని ఉండలుగా.... అండాకారంగా చుట్టుకోవాలి. ఇలాగ అన్నీ చేసి ఉంచుకొని... స్టవ్ వెలిగించి ఇడ్లీ రేకులలో ఈ జిల్లేడుకాయలని ఉంచి 10 నిముషాలు ఆవిరి పెట్టి, తరవాత దించుకోవాలి. అంతే జిల్లేడుకాయలు రెడీ. 

పాల ఉండ్రాళ్ళు

పాల ఉండ్రాళ్ళు 

కావలసిన పదార్థాలు 

బియ్యంపిండి -- 1 కప్పు
మంచినీళ్ళు -- 2 కప్పులు
పంచదార -- 1 కప్పు
పాలు -- 1 కప్పు
యాలకుల పొడి -- 1/2 స్పూన్

తయారీవిధానం

ముందుగా స్టవ్ వెలిగించి, ఒక మందపాటిగిన్నెలో 2 కప్పుల నీళ్ళు పోసి, మరిగిన తరవాత బియ్యంపిండి వేస్తూ, ఉండలు కట్టకుండా తిప్పుతూ, అంతా బాగా కలిసిన తరవాత, స్టవ్ మంట తగ్గించి, గిన్నె మీద మూతపెట్టి 5 నిముషాలు అయ్యాక, స్టవ్ మీద నుండి దించి, చల్లారిన తరవాత చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు స్టవ్ వెలిగించి, బాణలి పెట్టి, పంచదార వేసి .. తగినన్ని నీళ్ళు పోసి మరిగించాలి. ఈ పాకంలో ముందుగా చేసి పక్కన పెట్టిన చిన్న ఉండలని వేసి, పాలు, యాలకులపొడిని వేసి, ఉండలకి పాలు... పాకం అంతా కలిసిన తరవాత దించెయ్యాలి. అంతే కమ్మని పాల ఉండ్రాళ్ళు రెడీ.

8.4.17

ఆలూ రోల్స్

ఆలూ రోల్స్ 

కావాలసిన పదార్థాలు 
బంగాళదుంపలు(ఆలూ) - 2
బ్రెడ్ పౌడర్ - 1 కప్పు 
ఉడికించిన పచ్చిబఠాణీ -  1 కప్పు 
సేమియా - 1/4 కప్పు 
పచ్చిమిర్చి - 3
ఉల్లిపాయ ముక్కలు - 1 కప్పు 
అల్లంవెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్ 
గరం మసాలా - 1 స్పూన్ 
నెయ్యి - 1 స్పూన్ 
కొత్తిమీర తరుగు - 1/2 కప్పు 
మైదా (లేకపోతె వరిపిండి) - 1/2 కప్పు 
మొక్కజొన్న పిండి - 1/2 కప్పు 
ఉప్పు - రుచికి సరిపడినంత 
పసుపు - చిటికెడు 
కారం - 1/2 స్పూన్ 

తయారుచేయు విధానం 
ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి అందులో బంగాళదుంపల్నివేసి ఉడికించి పక్కన ఉంచుకోవాలి. చల్లారిన తరవాత పై తొక్కుతీసి మెత్తగా ముద్దగా చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలి పెట్టి కొద్దిగా నూనె పోసి ఉడికించిన పచ్చిబఠాణీని వేయించాలి, వేగిన తరవాత అల్లంవెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఉప్పు, మెత్తగా చేసుకున్న బంగాళాదుంప ముద్ద, బ్రెడ్ పౌడర్ వేసి బాగా కలపాలి. కొద్దిసేపు అయ్యాక కొత్తిమీర, నెయ్యిని కూడా వేసి బాగా అన్నీ కలిసేటట్టుగా చేసి కిందకి దింపి పక్కన ఉంచుకోవాలి. ఈ మిశ్రమం చల్లారిన తరవాత కోలగా రోల్స్ చేసి పక్కన ఉంచుకోవాలి.

ఇప్పుడు ఒక బౌల్ లో మైదా, మొక్కజొన్నపిండిని వేసి అందులో కొద్దిగా ఉప్పుని వేసి ఇడ్లీ పిండిలాగా చిక్కగా కలుపుకోవాలి. పక్కనే ఒక ప్లేట్ లో సేమియాని వేసి ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలి పెట్టి అందులో రోల్స్ మునిగేటట్టుగా Deep Fry కి సరిపడినంత నూనెను పోసి, ఆ నూనె బాగా కాగిన తరవాత, పక్కన ఉంచుకున్న రోల్స్ ని మైదా మిశ్రమంలో ముంచి పక్కనే ఉన్న సేమియాలో అద్ది నూనెలో వేసి దోరగా వేయించుకోవాలి. అంతే కరకరలాడే వేడివేడి కమ్మని ఆలూ రోల్స్ రెడీ. వీటిని టమాటా సాస్ తో తింటే చాలా బావుంటాయి.