24.4.14

పాలక్ ఊతప్పం

పాలక్ ఊతప్పం 

కావలసిన పదార్థాలు 
బియ్యం - 3 కప్పులు 
మినప్పప్పు - 1 కప్పు 
టమాటా రసం - ఒకటిన్నర కప్పు 
పాలక్ పేస్ట్ - 1 కప్పు 
ఉల్లిపాయ ముక్కలు - 1/2 కప్పు 
క్యాప్సికం ముక్కలు - 1/2 కప్పు 
మిరియాల పౌడర్ - 1/4 స్పూన్ 
చీజ్ - 100 గ్రాములు (సన్నగా తురుము చేసి ఉంచుకోవాలి)
ఉప్పు & కారం - రుచికి సరిపడినంత 

తయారీవిధానం 
ముందురోజు బియ్యం, మినప్పప్పుని విడివిడిగా నానబెట్టి, విడివిడిగా దోసెలపిండిలా రుబ్బుకొని తగినంత ఉప్పు వేసి పిండిని బాగా కలపాలి. మరుసటిరోజు ఉదయం ఊతప్పం వేసుకుంటే, పిండి పులిసి బావుంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి, బాణలి పెట్టి, కొంచెం నూనెవేసి, ఉల్లిపాయముక్కలు వేసి గోధుమరంగు వచ్చేవరకు వేయించి, అందులో టమాటా రసం, పాలక్ పేస్ట్ , ఉప్పు, మిరియాల పౌడర్ అన్నీవేసి బాగా వేయించి (మగ్గించి) పక్కన ఉంచుకోవాలి.   

ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి, పిండిని కొంచెం మందంగా వేసి, అది దోరగా కాలిన తరవాత పాన్ పైనుండి పక్కన ఒక ప్లేట్ లోకి తీసుకొని, దానిపై  ఉడికించి పక్కన పెట్టుకున్న టమాటా & పాలక్ పేస్ట్ ని వేసి, సన్నగా తరిగి పెట్టుకున్న క్యాప్సికం ముక్కలు & చీజ్ ని పైన పరచి, 450 డిగ్రీల ఫారన్ హీట్ వేడిలో 10 నిముషాలు పాటు ఓవెన్ లో ఉంచి తీసి కొంచెం చల్లబడిన తరవాత తినేయ్యటమే. అంతే చాలా రుచికరమైన, బలమైన .... పిల్లలు ఎంతో ఇష్టపడే పాలక్ ఊతప్పం రెడీ. 

 
      
         

వెజిటబుల్ ఊతప్పం

వెజిటబుల్ ఊతప్పం 

కావలసిన పదార్థాలు 
బియ్యం - 3 కప్పులు 
మినప్పప్పు - 1 కప్పు 
ఉల్లిపాయ ముక్కలు - 1 కప్పు 
టమాటా ముక్కలు - 1 కప్పు 
కొత్తిమీర తురుము - 1/2 కప్పు 
పచ్చిమిర్చి ముక్కలు - 1/2 కప్పు (సన్నగా తరిగిపెట్టుకోవాలి)
ఉప్పు - రుచికి సరిపడినంత 

తయారీవిధానం 
ముందురోజు బియ్యం, మినప్పప్పుని విడివిడిగా నానబెట్టి, విడివిడిగా దోసెలపిండిలా రుబ్బుకొని తగినంత ఉప్పు వేసి పిండిని బాగా కలపాలి. మరుసటిరోజు ఉదయం ఊతప్పం వేసుకుంటే, పిండి పులిసి బావుంటుంది, ఇప్పుడు స్టవ్ వెలిగించి, పాన్ పెట్టి, పిండిని కొంచెం మందంగా వేసి, దానిపైన టమాటా, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర మరియు పచ్చిమిర్చి అన్నీ సమపాళ్ళలో పరచి, చుట్టూ కొంచెం నూనె వేసి, సన్నని మంటపైన కాలనివ్వాలి. ఇష్టమైనవారు రెండోవైపు తిప్పి  కాల్చుకోవచ్చును.అంతే వేడి - వేడి రుచికరమైన వెజిటబుల్ ఊతప్పం రెడీ. (ఇష్టమైనవారు క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చును) 

                    

14.4.14

వరిపిండి వడియాలు .... Varipindi Vadiyalu

వరిపిండి వడియాలు .... Varipindi Vadiyalu

కావలసిన పదార్థాలు
వరిపిండి (బియ్యంపిండి) -- 1 గ్లాసు
ఉప్పు - 1 స్పూన్
కారం - 1 స్పూన్
జీలకర్ర - 1 స్పూన్
ఇంగువ - 1/4 స్పూన్
నీరు - 6 గ్లాసులు

తయారీవిధానం 
ముందుగా స్టవ్ వెలిగించి, ఒక వెడల్పాటి గిన్నెను పెట్టి, అందులో 4 గ్లాసుల నీటిని పోసుకుని, ఆనీటిలో ఉప్పు, కారం, జీలకర్ర, ఇంగువ వేసి బాగా మసిలించాలి. (కారం ఇష్టపడేవారు వారికి కావలసిన కారం వేసుకోవచ్చును.) వరిపిండిని 2గ్లాసుల నీటిలో కలుపుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు బాగామసిలిన నీటిలో వరిపిండి మిశ్రమాన్ని పోస్తూ కలుపుకోవాలి. మిశ్రమం కొంచెం చిక్కబడుతుంది. చిక్కబడగానే దించి, పక్కన పెట్టుకొని, చల్లారిన తరవాత ఒక పలుచటి కవరు మీద, స్పూన్ తో పిండిని వేసి పలుచగా అట్లపిండిని నెరిపినట్లు నెరపాలి. ఎంత పలుచగా మనం వడియాలు పెడితే, అంత త్వరగా ఎండుతాయి, రుచిగా ఉంటాయి. సాయంత్రం అయ్యేసరికి వడియాలు ఎండిపోతాయి. అంతే కరకరలాడే వరిపిండి వడియాలను వేయించుకొని తినటమే. (కవరుపై వడియాలను పెడితే ఎండాక తీసుకోవటానికి సులువుగా ఉంటాయి. అదే బట్టపై అరవేస్తే ఎండిన తరవాత తీసుకోవటానికి కొంచెం కష్టపడాలి. వడియాలు ఆరవేసిన బట్టని వెనుకకు తిప్పి నీరు చల్లితే వడియాలను తీసుకోవటం సులువు అవుతుంది.)                   

1.4.14

పైనాపిల్ మిల్క్ షేక్

పైనాపిల్ మిల్క్ షేక్ 

కావలసిన పదార్థాలు
పైనాపిల్ కట్ చేసిన ముక్కలు - 5
పాలు - 2 కప్పులు
మలాయి - 2 స్పూన్స్
పంచదార - 6 స్పూన్స్

తయారుచేయు విధానం 
ముందుగా పైనాపిల్ కి ముళ్ళు తీసి, ముక్కలుగా కోసుకోవాలి. షేక్ కి కావలసిన ముక్కలని తీసుకొని, మిక్సీ లో వేసి, బాగా నలిగిన తరవాత, పాలు, పంచదార వేసి, బాగా మెత్తగా నురగ వచ్చేవరకు మిక్సీ చెయ్యాలి. ఇప్పుడు షేక్ ని ఒక గ్లాస్ లోకి తీసుకొని, ఐస్ క్యూబ్స్ వేసి, పైన మలాయి వేసుకొని చల్లగా తాగెయ్యటమే అంతే. అన్నిరకాల ఫ్లేవర్ల కంటే పైనాపిల్ ఫ్లేవర్  చాలాబావుంటుంది. చాలా సులువుగా మనం ఇళ్ళల్లో చేసుకునేవే ఈ షేక్ లు, షరాబత్ లు, వేసవికాలంలో పిల్లలు ఎంతో ఇష్టంగా తాగుతారు. మరింక ఆలస్యం ఎందుకు ???? మీరు త్వరగా తయారుచేసేయ్యండి.


బనానా షేక్

బనానా షేక్ 

కావలసిన పదార్థాలు
బాగా పండిన అరటిపండ్లు - 2
పాలు (చల్లనివి) - 2 కప్పులు
పంచదార - 4 స్పూన్స్
మలాయి - 3 స్పూన్స్

తయారుచేయు విధానం 
ముందుగా మిక్సీ తీసుకొని, జ్యూస్ గిన్నెలో పాలు - పంచదార వేసి 1 నిమిషం బాగా కలిసేటట్లు తిప్పాలి. తరవాత అరటిపండ్లు తోక్కతీసుకొని, పాల మిశ్రమంలో వేసి మళ్ళీ 2 నిమిషాలపాటు మిక్సీ చెయ్యాలి. అన్నీ బాగా షేక్ అయ్యిన తరవాత, ఒక గ్లాస్ లో పోసుకొని, ఐస్ క్యూబ్స్ వేసుకొని, ఆపైన మలాయి వేసుకొని తాగటమే........... ఈ మండు వేసవి కాలంలో చల్ల - చల్లగా  ఇటువంటి షేక్, జ్యూస్, షరబత్ లు తాగితే ఎండ తాపం తగ్గుతుంది, ప్రాణానికి హాయిగా ఉంటుంది. అదే వేరే ఎవరైనా చేసి మనకి ఇస్తే, ఇంకా మజాగా ఉంటుంది. ఆ మజానే వేరు కదా !