Showing posts with label టిఫిన్లు (Snacks). Show all posts
Showing posts with label టిఫిన్లు (Snacks). Show all posts

8.4.17

ఆలూ రోల్స్

ఆలూ రోల్స్ 

కావాలసిన పదార్థాలు 
బంగాళదుంపలు(ఆలూ) - 2
బ్రెడ్ పౌడర్ - 1 కప్పు 
ఉడికించిన పచ్చిబఠాణీ -  1 కప్పు 
సేమియా - 1/4 కప్పు 
పచ్చిమిర్చి - 3
ఉల్లిపాయ ముక్కలు - 1 కప్పు 
అల్లంవెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్ 
గరం మసాలా - 1 స్పూన్ 
నెయ్యి - 1 స్పూన్ 
కొత్తిమీర తరుగు - 1/2 కప్పు 
మైదా (లేకపోతె వరిపిండి) - 1/2 కప్పు 
మొక్కజొన్న పిండి - 1/2 కప్పు 
ఉప్పు - రుచికి సరిపడినంత 
పసుపు - చిటికెడు 
కారం - 1/2 స్పూన్ 

తయారుచేయు విధానం 
ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి అందులో బంగాళదుంపల్నివేసి ఉడికించి పక్కన ఉంచుకోవాలి. చల్లారిన తరవాత పై తొక్కుతీసి మెత్తగా ముద్దగా చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలి పెట్టి కొద్దిగా నూనె పోసి ఉడికించిన పచ్చిబఠాణీని వేయించాలి, వేగిన తరవాత అల్లంవెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఉప్పు, మెత్తగా చేసుకున్న బంగాళాదుంప ముద్ద, బ్రెడ్ పౌడర్ వేసి బాగా కలపాలి. కొద్దిసేపు అయ్యాక కొత్తిమీర, నెయ్యిని కూడా వేసి బాగా అన్నీ కలిసేటట్టుగా చేసి కిందకి దింపి పక్కన ఉంచుకోవాలి. ఈ మిశ్రమం చల్లారిన తరవాత కోలగా రోల్స్ చేసి పక్కన ఉంచుకోవాలి.

ఇప్పుడు ఒక బౌల్ లో మైదా, మొక్కజొన్నపిండిని వేసి అందులో కొద్దిగా ఉప్పుని వేసి ఇడ్లీ పిండిలాగా చిక్కగా కలుపుకోవాలి. పక్కనే ఒక ప్లేట్ లో సేమియాని వేసి ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలి పెట్టి అందులో రోల్స్ మునిగేటట్టుగా Deep Fry కి సరిపడినంత నూనెను పోసి, ఆ నూనె బాగా కాగిన తరవాత, పక్కన ఉంచుకున్న రోల్స్ ని మైదా మిశ్రమంలో ముంచి పక్కనే ఉన్న సేమియాలో అద్ది నూనెలో వేసి దోరగా వేయించుకోవాలి. అంతే కరకరలాడే వేడివేడి కమ్మని ఆలూ రోల్స్ రెడీ. వీటిని టమాటా సాస్ తో తింటే చాలా బావుంటాయి.     
              
  

7.4.17

పాని పూరీ (గోల్ గప్పె) Pani puri (Golgappe)

పాని పూరీ (గోల్ గప్పె)   Paani Puri (Golgappe) 


కావలసిన పదార్థాలు:- 
బొంబాయి రవ్వ (గోధుమనూక) - 1 కప్పు
మైదాపిండి - 2 స్పూన్స్
అప్పడాల షోడా - 1/4 స్పూన్
ఉప్పు - రుచికి తగినంత
నూనె - 1/4 కేజీ

తయారీవిధానం:-
ముందుగా ఒక బౌల్ తీసుకొని, అందులో బొంబాయి రవ్వ, మైదాపిండి, ఉప్పు, అప్పడాల షోడా అన్నీ వేసి, కొంచెంగా గోరువెచ్చని నీరు పోసి, పూరి పిండి మాదిరిగా కలపాలి. పిండిని బాగా కలిపి, ఒక తడిబట్ట కప్పి, 30 నిముషాలు పక్కనపెట్టి నాననివ్వాలి. పిండి నానిన తరవాత చిన్న-చిన్న ఉండలుగా చేసుకోవచ్చును..... లేదా పెద్ద చపాతిలాగా వత్తుకొని, అంచు ఉన్న గ్లాస్ ఐనా, సీసా లేదా డబ్బాల మూతలు ఉన్నా చిన్న పూరీలుగా కట్ చేసుకోవచ్చును. అన్ని తయారుచేసుకున్నాక..... స్టవ్ వెలిగించి, బాణలి పెట్టి, నూనె పోసి, కాగిన తరవాత, 3 లేక 4 పూరీలను మాత్రమే నూనెలో వేస్తూ వేయించాలి. బాగా నూనె మరిగిపోకూడదు, అలాగని మరీ మంటను తగ్గించకూడదు. మీడియంలో మంటను ఉంచి పూరీలను వేయించాలి. నూనెలో వెయ్యగానే పూరీ బాగా పైకి పొంగాలి. ఈవిధంగా పూరీలను తయారుచేసి పక్కన ఉంచుకోవాలి. 


పానీపూరీలోకి పానీ తయారుచేయు విధానం
కొత్తిమీర - 1/2 కప్పు
పుదీనా - 1/2 కప్పు
పచ్చిమిర్చి - 2
నల్ల ఉప్పు - చిటికెడు
ఉప్పు - రుచికి సరిపడినంత

ముందుగా కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి అన్నీ కలిపి మిక్సీ లో వేసి కొద్దిగా నీరు పోసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ ని ఒక బౌల్ లోకి తీసుకొని ఒక టీ గ్లాసు నీరు పోసి పలుచగా చేసుకోవాలి. ఈ పానీలో నల్ల ఉప్పు, ఉప్పు వేసి బాగా కలిపి పక్కన ఉంచుకోవాలి. 

కూర తయారుచేయు విధానం 
సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు - 1 కప్పు
పచ్చిమిర్చి - 2 (చిన్న ముక్కలుగా చేసి ఉంచుకోవాలి)
టమాటా ముక్కలు- 1/2 కప్పు
ఉప్పు - రుచికి సరిపడినంత
కారం - 2 స్పూన్స్
పసుపు - చిటికెడు
జీలకర్ర పొడి - 1 స్పూన్
ధనియాల పొడి - 1/2 స్పూన్
ఛాట్ మసాలా - 1/2 స్పూన్
కొత్తిమీర తరుగు - 1/4 కప్పు
బఠాణీ - 1 కప్పు(పసుపు, ఉప్పు వేసి బాగా మెత్తగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి)
బంగాళాదుంపలు - 2 (ఉడికించి తొక్కతీసి ఉంచుకోవాలి)   

ముందుగా స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక 3 స్పూన్స్ నూనె వేసి, అందులో తరిగిన ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఉప్పు, కారం, పసుపు, ఒక్కొక్కటిగా వేసుకుంటూ పచ్చివాసన పోయేటట్టు కొద్దిసేపు వేయించుకోవాలి, ఇప్పుడు మెత్తగా ఉడికించి పక్కన ఉంచుకున్న బఠాణీ వేసుకోవాలి, ఉడికించిన బంగాళాదుంపని చేతితో మెత్తగా చేస్తూ బాణలిలో వేసెయ్యాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుతూ కొద్దిగా నీరు పోసి, జీలకర్ర పొడిని, ధనియాల పొడిని వెయ్యాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో ముందుగా తయారుచేసి ఉంచుకున్న పానీని రెండు గరిటలు కలిపి, మిశ్రమాన్ని మెత్తగా గరిటతో చేసుకోవాలి. అంతే పూరీలోకి కూర కూడా రెడీ.
   
ఇప్పుడు పూరీలలో తయారుచేసిన కూరని వేసి ఉల్లిపాయ ముక్కలని, కొత్తిమీరని వేసుకొని, పానీని పోసుకొని అమాంతం నోట్లో వేసీసుకోవటమే. అంతే కమ్మని Street Food ని మనం ఇంట్లోనే తయారుచేసుకొని తినెయ్యటమే.   
                     
                      

రైస్ బాల్స్

రైస్ బాల్స్ 
రోజూ తినే రకాలే తినమంటే పిల్లలు మారాం చేస్తారుగా. అందుకే వాళ్ళకి వెరైటీ వంటకాలు రుచి చూపించండి. ఈరోజు మనం రైస్ బాల్స్ ఎలా తయారుచెయ్యాలో నేర్చుకుందాం. 

కావలసిన పదార్థాలు 
బియ్యం పిండి - 1 కప్పు 
నీరు - 3 కప్పులు 
ఉప్పు - 1/4 స్పూన్ 
కారం - 1/2 స్పూన్ 
పోపు దినుసులు 
మినప్పప్పు - 1 స్పూన్ 
శెనగపప్పు - 1 స్పూన్ 
ఆవాలు - 1/4 స్పూన్ 
జీలకర్ర - 1/4 స్పూన్ 
ఎండుమిర్చి - 2
కరివేపాకు - 2 రెబ్బలు 

తయారుచేయు విధానం 
ముందుగా స్టవ్ వెలిగించి ఒక వెడల్పాటి గిన్నెను పెట్టి 3 కప్పుల నీటిని పోసి అందులో ఉప్పు, కారం వేసుకోవాలి. నీరు బాగా మసలిన తరవాత పిండిని వేస్తూ ఉండలు కట్టకుండా తిప్పుకోవాలి. పిండి బాగా కలసిన తరవాత స్టవ్ పై నుండి దించి పక్కన ఉంచి చల్లారనివ్వాలి.  చల్లారిన తరవాత చేతికి నూనె రాసుకొని పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. పిండి అంతా ఉండలుగా చేసుకుని ఒక వెడల్పాటి గిన్నెలో వేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇడ్లీ పాత్ర పెట్టి, అడుగున నీరు పోసి, ఇడ్లీ ప్లేట్లు తీసుకొని ఆ ప్లేట్లలో పిండి ఉండలని ఉంచి పాత్రని మూత పెట్టి 10 నిముషాలు ఆవిరి పట్టించాలి. లేదా కుక్కర్ లో అడుగున నీరు పోసి ఒక ఖాళీ బౌల్ ని ఉంచి దానిపైన ఉండలు ఉన్న వెడల్పాటి గిన్నెను ఉంచి కుక్కరు మూత పెట్టి విజిల్ పెట్టకుండా 10 ఆవిరి పెట్టాలి. 10 నిమిషాల తరవాత ఆ ఉండాలని తీసి పక్కన వేరే పాత్రలో ఉంచి చల్లారబెట్టాలి.      

ఈలోగా స్టవ్ వెలిగించి బాణలి పెట్టి నూనె పోసి పోపు దినుసులు అన్నీ ఒకదాని తరవాత మరొకటి వేసి చిటపటలాడాక ఇంగువ, కరివేపాకు వేసి పక్కనే ఉంచుకున్న ఆవిరి పెట్టిన ఉండలని(రైస్ బాల్స్ ని) ఆ పోపులో వెయ్యాలి. బాణలిపై మూతపెట్టి ఆ పోపు అంతా రైస్ బాల్స్ కి బాగా పట్టేంతవరకు స్టవ్ మంటని తగ్గించి ఉంచాలి. 5 నిమిషాల తరవాత బాల్స్ ని మరొకసారి బాగా కలిపి స్టవ్ పై నుండి దించి పిల్లలకి వేడి వేడిగా ప్లేట్లో వేసి ఇచ్చెయ్యటమే. వీటికి చట్నీతో పని లేదు. పిల్లలు పేచీ పెడితే ఏదైనా సాస్ వేసి ఇవ్వొచ్చును. అంతే రుచికరంగా ఉండే రైస్ బాల్స్ రెడీ. ఇంకెందుకు ఆలస్యం మీరు ట్రై చెయ్యండి.                            


11.12.16

అటుకుల చుడవా (మిక్చరు)

అటుకుల చుడవా (మిక్చరు)

కావలసిన పదార్థాలు 
పేపర్ అటుకులు - 2 కప్పులు  
(వేరుశనక్కాయలు) పల్లీలు - 1/2 కప్పు 
పుట్నాల (చట్నీ)పప్పు - 1/2 కప్పు 
పోపుదినుసులు - ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, 
పచ్చిమిర్చి(నిలువుగా చీల్చుకొని ఉంచుకోవాలి) - 6
పసుపు - చిటికెడు 
ఉప్పు - రుచికి సరిపడినంత 
నూనె - 6 స్పూన్స్ 
కరివేపాకు - 4 రెబ్బలు 

తయారీవిధానం
ముందుగా స్టవ్ వెలిగించి, బాణలి పెట్టి, అది వేడెక్కాక, ముందుగా బాగుచేసుకొని ఉంచుకున్న అటుకులని వేసి గోధుమరంగు వచ్చేవరకు వేయించి, పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే బాణలిలో 2 స్పూన్స్ నూనె వేసుకొని, పల్లీలు & పుట్నాలపప్పు వేసి వేయించుకోవాలి, కొద్దిగా దోరగా వేగిన తరవాత పోపుదినుసులు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వెయ్యాలి, పోపు చిటపటలాడాక కరివేపాకు, ఉప్పు, పసుపు వెయ్యాలి. పోపు సామాను అన్నీ బాగా వేగిన తరవాత ముందుగా వేయించి పక్కన ఉంచుకున్న అటుకులని కూడా వేసి బాగా కలుపుకోవాలి. అటుకులకి మిశ్రమం అంతా బాగా కలవటం కోసం 2 స్పూన్స్ నూనె వెయ్యాలి. అంతే చాలా రుచిగా క్రిస్పీగా ఉండే అటుకుల చుడవా (మిక్చరు) తయారైపోయింది. చాలా సులువుగా, అతి తక్కువ సమయంలో ఈ చుడవాని చేసుకోవచ్చును. ఈ మిశ్రమంలో కొద్దిగా నిమ్మరసం వేసుకుంటే బావుంటుంది. ఇష్టమైనవారు వేసుకోవచ్చును, వేసుకోకపోయినా బాగానే ఉంటుంది.       


30.10.15

బ్రెడ్ వడ

బ్రెడ్ వడ 

కావలసిన పదార్థాలు 
బ్రెడ్ స్లైసులు  - 6
వంటషోడా - 1/4 స్పూన్
శెనగపిండి - 2 కప్పులు
కారం - 1 స్పూన్
ఉప్పు - రుచికి సరిపడినంత
నూనె - 1/4 Kg

తయారీవిధానం 
ముందుగా ఒక వెడల్పైన డిష్షులోకి శెనగపిండిని తీసుకోవాలి. అందులో ఉప్పు, కారం, వంటషోడా వేసి కొద్దికొద్దిగా నీరు పోస్తూ మరీ జారుగా దోసెలపిండి మాదిరిగా కాకుండా, కొద్దిగా చిక్కగా బజ్జీపిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ స్లైసులని తీసుకొని, అంచులని వేరుచేసి, క్రాసుగా, ట్రై ఏంగిల్ గా కట్ చేసి, పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి, బాణలి పెట్టి, నూనె పోసి, కాగిన తరవాత బ్రెడ్ స్లైసెస్ లని ఒక్కొక్కటిని పిండిలో ముంచి, వడలుగా వెయ్యాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేవరకు వేయించి తీసుకోవాలి. అంతే కరకరలాడే కమ్మని బ్రెడ్ వడలు రెడీ. మీకు ఇష్టమైన చట్నీతో ఈ వడలని తినొచ్చును. (ఇష్టమైన వారు రెండు బ్రెడ్ ముక్కలకి మధ్యలో ఏదైనా గ్రీన్ చట్నీని, పెట్టి వడలు వేసుకోవచ్చు.) ఎవరైనా అతిథులు ఇంటికి వచ్చినప్పుడు చాలా తొందరగా, సులువుగా చేసుకునే స్నాక్ ఐటెం ఇది. మీరూ ట్రై చేస్తారు కదూ.         
              

బ్రెడ్ దహి వడ

బ్రెడ్ దహి వడ

కావలసిన పదార్థాలు
బ్రెడ్ స్లైసులు  - 6
మీగడ లేకుండా చిక్కగా చేసి ఉంచుకున్న పెరుగు - 1/2 కప్పు
క్యారెట్ తురుము - 1/4 కప్పు
పచ్చిమిర్చి ముక్కలు 1/4 కప్పు
మెత్తగా చేసి ఉంచుకున్న అల్లం - 2 స్పూన్స్
ఉల్లిపాయ తురుము - 1 కప్పు
బియ్యం (వరి) పిండి - 1 కప్పు
వంటషోడా - 1/4 స్పూన్
కొత్తిమీర తరుగు - 1/2 కప్పు
ఉప్పు - రుచికి సరిపడినంత
నూనె - 1/4 Kg

తయారీవిధానం
ముందుగా ఒక వెడల్పాటి గిన్నెలోకి బియ్యం (వరి) పిండిని తీసుకోవాలి. అందులో పచ్చిమిర్చి ముక్కలు, 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, అల్లం వేసి, కొద్దికొద్దిగా నీళ్ళు పోస్తూ బాగా కలపాలి....ఇప్పుడు ఆ మిశ్రమంలో బ్రెడ్ స్లైసుల్ని మెత్తగా పొడిలాగా చేసుకొని వేసి, కొంచెం గట్టిగా వడలు వేసుకోవటానికి అనుకూలంగా ఉండేటట్టు బాగా కలపాలి.ఇప్పుడు స్టవ్ వెలిగించి, బాణలి పెట్టి, నూనె పోసి, నూనె వేడెక్కిన తరవాత మిశ్రమం నుండి చిన్న ముద్దని చేతిలోకి తీసుకొని, అరచేతిలో వడలాగా వత్తుకొని, నూనెలో వేసి, బంగారు వర్ణం వచ్చేవరకు వేయించి తీసుకోవాలి. ఈవిధంగా అన్నీ చేసుకున్నాక, ఆ వడలని ఒక ప్లేటులోకి తీసుకొని, వాటిపైన పెరుగుని వేసి, కొత్తిమీర, క్యారెట్ తురుము, ఉల్లి తురుము వేసుకోవాలి. పెరుగులో కొద్దిసేపు వడలు నానిన తరవాత తినేయ్యటమే. కమ్మని, మెత్తని వడలు రెడీ. ఇష్టమైనవారు వడలు పైన సన్నని జంతికలు (మురుకులు) జల్లుకోవచ్చును.        


18.4.15

బంబాయి రవ్వ వడలు

బంబాయి రవ్వ వడలు 

కావలసిన పదార్థాలు 
బొంబాయి రవ్వ - - 1 కప్పు 
పెరుగు - 1 కప్పు 
ఉల్లిపాయముక్కలు - 1/2 కప్పు 
పచ్చిమిర్చి - 6(ముక్కలుచేసి ఉంచుకోవాలి)
కరివేపాకు - 5 రెబ్బలు 
కొత్తిమీర తరుగు - 1/4 కప్పు 
 ఉప్పు - రుచికి సరిపడినంత 
వంటషోడా - కొంచెంగా 
నూనె - 1/4 కేజీ 

తయారీవిధానం 
ముందుగా రవ్వలొ పెరుగును వేసి రెండు గంటలు నానబెట్టాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలి పెట్టి నూనె వేసి మరిగించాలి. నూనె మరిగేలోపు  నానబెట్టిన రవ్వ  పిండిలో  ఉల్లిపాయముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర తరుగు, ఉప్పు, వంటషోడా అన్నీ వేసి బాగా కలిపి చిన్నచిన్న వడలు లాగా ఒక కవరు పైన వత్తుకొని కాగిన నూనెలో వేసి, దోరగా రెండువైపులా బంగారు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి.  అంతే  కరకరలాడే కమ్మటి బొంబాయి రవ్వ వడలు రెడీ .....ఈ  వడలని టమాటా చట్నీ లేదా కొబ్బరి చెట్నీలతో తింటే చాలా బావుంటాయి. 
     

26.12.14

ఇంట్లోనే తయారుచేసుకునే పిజ్జా

(ఇంట్లోనే తయారుచేసుకునే) పిజ్జా 
కావలసిన పదార్థాలు 
మైదా - 1 కప్పు 
ఈస్ట్ - 2 స్పూన్స్ 
వంటషోడా - 1/2 స్పూన్ 
క్యాప్సికం - 1 (చిన్న ముక్కలు తరిగి ఉంచుకోవాలి) 
టమాటాలు - 3 (చక్రాలుగా తరిగి ఉంచుకోవాలి)
టమాటా సాస్ & వెన్న - (మన ఇష్టానికి తగినంత వేసుకోవచ్చును)
పన్నీరు తురుము - 1/4 కప్పు 

తయారీ విధానం 
ముందుగా స్టవ్ వెలిగించి, ఒక చిన్న గిన్నెలోకి కొంచెం నీరు తీసుకొని వేడిచేయాలి. నీరు వేడెక్కే లోపల ఒక బేసిన్ లోకి ఈస్ట్ & వంటషోడ తెసుకొని, కొద్దిగా చల్లని నీరు జల్లి కలిపి, ఆ మిశ్రమానికి మైదాపిండిని చేర్చి,  గోరువెచ్చని నీరు కలిపి చపాతీ పిండిలాగా ముద్దగా కలుపుకొని, 10 నిముషాలు పక్కన పెట్టాలి. ఇప్పుడు మళ్ళీ పిండిని మరొకసారి బాగా కలిపి, అర అంగుళం మందంలో గుండ్రంగా చపాతీలాగా చేతితో వత్తుకోవాలి. ఇప్పుడు పిజ్జా బేస్ తయారయ్యిందన్నమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించి, సన్నని మంటపై పెనం (pan) పెట్టి, పెనానికి కొద్దిగా వెన్నరాసి, తయారుచేసి ఉంచుకున్న పిజ్జా బేస్ ని ఉంచి మూతపెట్టాలి. బేస్ కాలే లోపల ... సన్నగా తరిగి ఉంచుకున్న క్యాప్సికం ముక్కలు & టమాటా ముక్కలు వేరే స్టవ్ వెలిగించి, బాణలిలో వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. కొద్దిసేపటికి పిండి బాగా కాలి ఉబ్బుతుంది. (ఉడుకుతుంది). ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న టమాటా & క్యాప్సికం ముక్కల మిశ్రమాన్ని బేస్ పైన వేసి, టమాటా సాస్, వెన్న, పన్నీరు తురుము వేసి మరికొద్దిసేపు ఉంచాలి. 10 నిముషాలు అయ్యాక ముక్కలుగా కోసుకొని, స్టవ్ ని ఆపెయ్యాలి. అంతే పిల్లలు - పెద్దలు ఎంతో ఇష్టపడే వేడివేడి రుచికరమైన పిజ్జా రెడీ. టమాటా సాస్ తో సర్వ్ చేసి తినేయ్యటమే...... 
                                

25.7.14

మసాలా బటూరా

మసాలా బటూరా

కావలసిన పదార్థాలు

గోధుమపిండి - 1 కప్పు
మైదాపిండి - 1 కప్పు
పెరుగు - 3 కప్పులు
నెయ్యి - 1 స్పూన్
షోడా - 1 చిన్న స్పూన్
వేడి నీరు - కొంచెం
ఉప్పు - రుచికి తగినంత
నెయ్యి లేదా నూనె - 200 గ్రా
ఉల్లిపాయ తరుగు - 1/2 కప్పు
పచ్చిమిర్చి తరుగు - 2 స్పూన్స్
కొత్తిమీర తరుగు - 2 స్పూన్స్
గరంమసాలా పొడి - 1 స్పూన్

తయారీవిధానం
ఒక బౌల్ లో గోధుమ & మైదా పిండ్లు, షోడా, నెయ్యి, పంచదార, పెరుగు, వేడినీరు, అన్నీ వేసి బాగా కలిపి, 6 గంటలు నానబెట్టాలి. ఇది సాదా బటూరా చేసే విధానం.

మసాలా బటూరాకి గోధుమ, మైదా పిండులు, షోడా, నెయ్యి, పంచదార, పచ్చిమిర్చి, ఉల్లితరుగు, కొత్తిమీర, గరం మసాల అన్నీ కలిపి వేడినీరు పోస్తూ పిండిని బాగా మదాయిస్తూ కలిపి, తడిబట్ట కప్పి 6 గంటలు నాన్నబెట్టాలి. పిండి నానిన తరవాత, చిన్న - చిన్న ఉండలుగా చేసుకొని పూరీ లాగానే బటూరాని వత్తుకోవాలి. నూనెలో బంగారు రంగు వచ్చేవరకు వేయించి తీయాలి. బటూరలని ఆలూ, శనగల కూరలతో వడ్డిస్తే చాలా రుచిగా ఉంటుంది.

(సాదా బటూరల మాదిరిగానే పిండిని కలుపుతూ, అందులో 3 స్పూన్స్ పంచదార, యాలకులపొడి కలిపి..... బటూర వత్తితే అవి తీపి బటూరాలు అవుతాయి :) )

                            

24.4.14

పాలక్ ఊతప్పం

పాలక్ ఊతప్పం 

కావలసిన పదార్థాలు 
బియ్యం - 3 కప్పులు 
మినప్పప్పు - 1 కప్పు 
టమాటా రసం - ఒకటిన్నర కప్పు 
పాలక్ పేస్ట్ - 1 కప్పు 
ఉల్లిపాయ ముక్కలు - 1/2 కప్పు 
క్యాప్సికం ముక్కలు - 1/2 కప్పు 
మిరియాల పౌడర్ - 1/4 స్పూన్ 
చీజ్ - 100 గ్రాములు (సన్నగా తురుము చేసి ఉంచుకోవాలి)
ఉప్పు & కారం - రుచికి సరిపడినంత 

తయారీవిధానం 
ముందురోజు బియ్యం, మినప్పప్పుని విడివిడిగా నానబెట్టి, విడివిడిగా దోసెలపిండిలా రుబ్బుకొని తగినంత ఉప్పు వేసి పిండిని బాగా కలపాలి. మరుసటిరోజు ఉదయం ఊతప్పం వేసుకుంటే, పిండి పులిసి బావుంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి, బాణలి పెట్టి, కొంచెం నూనెవేసి, ఉల్లిపాయముక్కలు వేసి గోధుమరంగు వచ్చేవరకు వేయించి, అందులో టమాటా రసం, పాలక్ పేస్ట్ , ఉప్పు, మిరియాల పౌడర్ అన్నీవేసి బాగా వేయించి (మగ్గించి) పక్కన ఉంచుకోవాలి.   

ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి, పిండిని కొంచెం మందంగా వేసి, అది దోరగా కాలిన తరవాత పాన్ పైనుండి పక్కన ఒక ప్లేట్ లోకి తీసుకొని, దానిపై  ఉడికించి పక్కన పెట్టుకున్న టమాటా & పాలక్ పేస్ట్ ని వేసి, సన్నగా తరిగి పెట్టుకున్న క్యాప్సికం ముక్కలు & చీజ్ ని పైన పరచి, 450 డిగ్రీల ఫారన్ హీట్ వేడిలో 10 నిముషాలు పాటు ఓవెన్ లో ఉంచి తీసి కొంచెం చల్లబడిన తరవాత తినేయ్యటమే. అంతే చాలా రుచికరమైన, బలమైన .... పిల్లలు ఎంతో ఇష్టపడే పాలక్ ఊతప్పం రెడీ. 

 
      
         

వెజిటబుల్ ఊతప్పం

వెజిటబుల్ ఊతప్పం 

కావలసిన పదార్థాలు 
బియ్యం - 3 కప్పులు 
మినప్పప్పు - 1 కప్పు 
ఉల్లిపాయ ముక్కలు - 1 కప్పు 
టమాటా ముక్కలు - 1 కప్పు 
కొత్తిమీర తురుము - 1/2 కప్పు 
పచ్చిమిర్చి ముక్కలు - 1/2 కప్పు (సన్నగా తరిగిపెట్టుకోవాలి)
ఉప్పు - రుచికి సరిపడినంత 

తయారీవిధానం 
ముందురోజు బియ్యం, మినప్పప్పుని విడివిడిగా నానబెట్టి, విడివిడిగా దోసెలపిండిలా రుబ్బుకొని తగినంత ఉప్పు వేసి పిండిని బాగా కలపాలి. మరుసటిరోజు ఉదయం ఊతప్పం వేసుకుంటే, పిండి పులిసి బావుంటుంది, ఇప్పుడు స్టవ్ వెలిగించి, పాన్ పెట్టి, పిండిని కొంచెం మందంగా వేసి, దానిపైన టమాటా, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర మరియు పచ్చిమిర్చి అన్నీ సమపాళ్ళలో పరచి, చుట్టూ కొంచెం నూనె వేసి, సన్నని మంటపైన కాలనివ్వాలి. ఇష్టమైనవారు రెండోవైపు తిప్పి  కాల్చుకోవచ్చును.అంతే వేడి - వేడి రుచికరమైన వెజిటబుల్ ఊతప్పం రెడీ. (ఇష్టమైనవారు క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చును) 

                    

2.2.14

మసాలా పరోటా

మసాలా పరోటా 

కావలసిన పదార్థాలు 
గోధుమపిండి - 1/4 కేజీ
మైదా - 1/4 కేజీ
శెనగపప్పు - 1/4 కేజీ
పాలు - 1/4 లీటరు
అల్లం - చిన్నముక్క
జీలకర్ర - 2 స్పూన్స్
మిరియాలు - 1 స్పూన్
కారం - 1 స్పూన్
గరంమసాలా - 1/2 స్పూన్
సన్నగా తరిగిపెట్టుకున్న కొత్తిమీర - 1/2 కప్పు
నెయ్యి - 100 గ్రా
ఉప్పు - రుచికిసరిపడినంత

తయారుచేయు విధానం
ముందుగా ఒక బేసిన తీసుకొని అందులో గోధుమపిండి, మైదాపిండి, పాలు, ఉప్పు అన్నీ వేసి తగినంత నీరు పోస్తూ చపాతీపిండిలాగా మృదువుగా కలుపుకోవాలి. చివరిగా నూనె వేసి కలిపి, ఆ పిండిపైన తడిబట్ట కప్పి, అరగంట సేపు పక్కన ఉంచుకోవాలి. ఈలోగా స్టవ్ వెలిగించి, ఒక చిన్న కుక్కర్ తీసుకొని, అందులో శెనగపప్పును వేసి, బాగా మెత్తగా ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాణలి తీసుకొని, అందులో జీలకర్ర, మిరియాలు సన్ననిమంటపై వేయించి తీసి, మిక్సీ లో మెత్తగా పొడిగా చేసుకొని, ఆ పొడిని, దంచిపెట్టుకున్న అల్లం ముక్కల్ని, కొత్తిమీర, కారం, ఉప్పు,  గరంమసాలా పొడిని అన్నీ పప్పులో వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.                

పిండి నానినతరవాత, చిన్నచిన్న ఉండలుగా చేసుకొని, చపాతీలాగా వత్తుకొని, దానిమీద పప్పు మిశ్రమాన్ని కొంచెం ఉంచి, మూసేసి, చపాతీని నాలుగు మడతలు వేసి, మళ్ళీ మెల్లగా వత్తాలి. అలా అన్నీ వత్తి పక్కన పెట్టుకొని, స్టవ్ వెలిగించి, పెనం పెట్టి, ఒక్కొక్కటిగా పరోటాలను  నేతితో కాల్చుకోవాలి. అంతే కమ్మని రుచికరమైన మసాలా పరోటా రెడీ. ఇష్టమైన వారు నచ్చిన కూరలతో, సాస్ లతో  తినవచ్చును.

                     

22.11.13

మంచూరియ

 వెజ్ మంచూరియ
కావలసిన పదార్థాలు ---

క్యాబేజీ --  4 కప్పులు
అల్లం -- 50 గ్రా
వెల్లుల్లి -- 10 రెబ్బలు
పచ్చిమిర్చి -- 10
సోయాసాస్ -- 3 స్పూన్స్
ఉప్పు -- తగినంత
మైదాపిండి -- 1/2 కప్పు
టమాటాసాస్ -- 1 కప్పు
నూనె -- 1/4 కేజీ

తయారీ విధానం:--

ముందుగా స్టవ్ వెలిగించి బాణలి పెట్టి, అందులో కొద్దిగా నూనె వేసి ----  సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చిని ...... వేరువేరుగా వేయించి పక్కన ఉంచుకోవాలి, ఇప్పుడు బాణలిలో 2 స్పూన్స్ నూనె వేసి, క్యాబేజీని పచ్చివాసన పోయేంతవరకు వేయించాలి. ఆ క్యాబేజీలో వేయించి పక్కన పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చిని సగం వేసి, ఉప్పు మరియు 2 స్పూన్స్ సోయాసాస్ వేసి కలిపి, పక్కన ఉంచి, చల్లారిన తరవాత...... ఈ మిశ్రమంపై మైదాపిండిని చల్లుతూ ఉండలుగా చుట్టాలి. స్టవ్ వెలిగించి బాణలి పెట్టి, నూనె పోయాలి ........ నూనె కాగేలోపు, మిగిలిన మైదాపిండిని కొంచెం చిక్కగా (బూరెల తోపు పిండిలాగా) కలుపుకొని, తోపులో ముంచి, నూనెలో బంగారు రంగు వచ్చేవరకు వేయించి, ఒక ప్లేటులోకి తీసుకోవాలి,  టమాటాసాస్ & 1 స్పూన్ సోయాసాస్  - మిగిలిన అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చిని.... కొంచెం నీటిని కలిపి వేడిచేసి, అందులో ఉండలు అన్నిటికి వేసి,  సాస్ బాగా అంటేటట్లుగా కలుపుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన  మంచూరియా రెడీ. కొత్తిమీరని పైన అలంకరించుకొని వేడివేడిగా తినెయ్యటమే.  

     
                 

28.10.13

పల్లీ (వేరుశెనగ పప్పు) లడ్డు

పల్లీ (వేరుశెనగ పప్పు) లడ్డు 

కావలసిన పదార్థాలు 

వేరుశెనగపప్పు (పల్లీలు ) -- 1 కప్పు
బెల్లం తురుము -- అరకప్పు
కొబ్బరి ముక్కలు -- 1/4 కప్పు (సన్నగా తరిగి ఉంచుకోవాలి)
యాలకులపొడి -- 1/4 స్పూన్
నెయ్యి -- కొద్దిగా

తయారీ విధానం:--

ముందుగా స్టవ్ వెలిగించి, బాణలి పెట్టి, పల్లీలు వేయించి, పొట్టుతీసి, మిక్సీలో బాగా మెత్తగా పొడి చేసి  ఉంచుకోవాలి. ఇప్పుడు బాణలిలో కొద్దిగా నెయ్యి వేసి, కొబ్బరి ముక్కలని దోరగా వేయించి పక్కన ఉంచుకోవాలి. తరవాత ఒక మందపాటి గిన్నెలో బెల్లంతురుము వేసి, దానికి సరిపడ నీరు చేర్చి, పాకం వచ్చేవరకు, అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలి. పాకం వచ్చిందో లేదో చూడాలంటె, చల్లటి నీటిలో పాకాన్ని ఒక చుక్క వేస్తె, ఉండకట్టాలి, అలా ఉండకట్టింది అన్నాక, కొబ్బరితురుము, యాలకులపొడి, పల్లీలపొడి వేసి బాగా కలిపి, స్టవ్ మీదనుండి దించెయ్యాలి. కాస్త చల్లారిన తరవాత,  చేతికి వేడి పట్టేటట్టు ఉంటే ఉండలు చుట్టుకోవాలి. అంతే  కమ్మని, నోటిలో వేసుకుంటే కరిగిపోయే పల్లీల ఉండలు రెడీ.


రైస్ వడ

రైస్ వడ 

కావలసిన పదార్థాలు:
ఉడికించిన అన్నం -- 2 కప్పులు (కొంచెం మెత్తగా ఉడికించిన అన్నం)
కొబ్బరి తురుము -- 1 కప్పు
పెరుగు -- 1 కప్పు
కారం పొడి -- 1 స్పూన్
అల్లం పచ్చిమిర్చి పేస్టు -- 2 స్పూన్స్
క్యాబేజీ తురుము -- 1/4 కప్పు
క్యాప్సికం తురుము -- 1/4 కప్పు
టమాటా ముక్కలు -- 1/4 కప్పు
మైదాపిండి -- 3 స్పూన్స్
కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, ఇంగువ, ఉప్పు --- తగినంత
నూనె -- 1/4 కేజీ

తయారీ విధానం:--

ముందుగా ఒక వెడల్పాటి డిష్ లో  పెరుగువేసి,  అన్నము ఇంకా మిగిలిన పదార్థాలు ఒక్కొక్కటిగా వేసి, బాగా మెత్తగా కలిపి (గారెల పిండి వలె ఉండాలి) పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి, బాణలి పెట్టి, నూనె వేసి, అన్నం మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని, వడల మాదిరిగా వేసి, ఎర్రగా రెండు వైపులా కాలిన తరవాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇష్టమైన వారు వారికి నచ్చిన చట్నీతో తినవచ్చును. అంతే కమ్మని రైస్ వడ రెడీ.

(చిన్న చిట్కా----- మనకి అన్నం ఎప్పుడైనా మిగిలినట్లు ఐతే, పిల్లల్ని తినమంటే తినరు కాబట్టి, ఇలాగ వడలు వేసి ఇవ్వవచ్చును. ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చిన చాలా త్వరగా ఈ వడలను చేసి సర్వ్ చేయవచ్చును.)

              

     

9.8.13

క్యాబేజీ రోల్స్

క్యాబేజీ రోల్స్----

కావలసిన పదార్థాలు:--

శెనగపిండి -- 3 కప్పులు
వారిపిండి -- 1 కప్పు
క్యాబేజీ ఆకులు -- 12పెద్దవి
బంగాళదుంపలు -- 1/2 కేజీ
కొత్తిమీర తరుగు -- 1/2 కప్పు
గరంమసాలా పొడి -- 1 స్పూన్
అల్లం & పచ్చిమిర్చి పేస్టు -- 2 స్పూన్స్
ఉప్పు & పసుపు -- తగినంత
వంటషోడా -- చిటికెడు
నూనె -- 1/2 కేజీ

 తయారీ విధానం:--

ముందుగా శెనగపిండి, వరిపిండి, ఉప్పు, వంటషోడా అన్నీ కలిపి బజ్జీలపిండిలాగా కొంచెం జారుగా కలిపి పక్కన ఉంచుకోవాలి. క్యాబేజీ ఆకులను శుభ్రంగా తుడిచి ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి, ఒక కుక్కర్లో బంగాళదుంపల్ని ఉడికించి పక్కనపెట్టుకోవాలి. దుంపలకి తొక్కతీసి, మెత్తగా చిదిమి, దానిలో అల్లం & పచ్చిమిర్చి పేస్టు, గరంమసాలా, ఉప్పు, పసుపు, కొత్తిమీర తరుగు అన్నీ వేసి, బాగా కలిపి, ఒక క్యాబేజీ ఆకులో ఈ పిండి మిశ్రమాన్ని వేసి, రోల్ లాగా చుట్టుకొని, ఆకు ఊడిపోకుండా, చివరన tooth pin ని గుచ్చి ఉంచాలి. అన్ని రోల్స్ ని ఇలాగే రెడీ చేసుకొని, స్టవ్ వెలిగించి, బాణలిపెట్టి, నూనె వేసి, కాగిన తరవాత ఒక్కొక్క రోల్ ని ముందుగా కలిపి ఉంచుకున్న శెనగపిండిలో ముంచి,  ఒక్కొక్కటిగా నూనెలో వేసి, దోరగా గోధుమ రంగు వచ్చేవరకు వేయించి, తీసి పక్కన పెట్టుకోవాలి. అంతే కరకరలాడే కమ్మని క్యాబేజీ రోల్స్ రెడీ. వీటిని ఇష్టముంటే టమాటా సాస్ తో తినొచ్చును.



    

11.7.13

బ్రెడ్ ఛాట్

బ్రెడ్ ఛాట్

కావలసిన పదార్థాలు
బ్రెడ్ -- 1 ప్యాకెట్
పచ్చిబఠాణీ -- 1 కప్పు (ఉడికించినవి)
బంగాళదుంప ముక్కలు -- 1 కప్పు (ఉడికించినవి)
టమాట ముక్కలు -- 1/2 కప్పు
ఉల్లిపాయముక్కలు -- 1 కప్పు (సన్నగా తరిగి ఉంచుకోవాలి)
కొత్తిమీర -- (సన్నగా తరిగాలి) 2 స్పూన్స్
కారం & ఉప్పు -- తగినంత
పసుపు -- చిటికెడు
ఛాట్ మసాలా -- 1 స్పూన్
సన్న కారప్పూస -- 1 కప్పు
చింతపండు గుజ్జు -- 1 స్పూన్
నూనె -- కొంచెం

తయారీ విధానం
ముందుగా స్టవ్ వెలిగించి, బాణలి పెట్టి, కొంచెంగా నూనె వేసి ఉడికించి పక్కన పెట్టుకున్న బఠాణీలను వేసి, అందులో ఉప్పు, కారం, చిటికెడు పసుపు, చింతపండుగుజ్జు, వేసి కలపాలి. తగినంత నీరు పోసి చిక్కగా అయ్యేవరకు ఉడికించి పక్కనపెట్టుకోవాలి.

వేరే ఒక డిష్ లో సన్నగా తరిగిన ఉల్లిపాయముక్కలను, టమాటా ముక్కలను, కొత్తిమీర తురుమును వేసి, కలిపి ఉంచుకోవాలి.

ఇప్పుడు స్టవ్ వెలిగించి, సన్నని మంట మీద పెనం పెట్టి, ఒక్కొక్క బ్రెడ్ ముక్కని దోరగా, కరకరలాడే లాగా అన్ని ముక్కల్ని కాల్చుకొని, ఒక ప్లేట్ లో అమర్చుకొని, ఆ ముక్కలమీద బఠానీ కూర వేసి, ఉల్లిముక్కల మిశ్రమం ఆ పైన కారప్పూస చల్లుకోవాలి. అంతే కమ్మని రుచికరమైన బ్రెడ్ ఛాట్ రెడీ. ఇది చెయ్యటం సులువు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. (ఇష్టమైతే మామిడికాయని  సన్నగా తురుములాగా చేసుకొని పైన వేసుకోవచ్చును.)


7.7.13

కచోరీలు

కచోరీలు

కావలసిన పదార్థాలు
మైదాపిండి -- 1 కప్పు
నానబెట్టిన పెసరపప్పు -- 1/2 కప్పు
శెనగపిండి -- 1 కప్పు
గరంమసాలా పౌడర్ -- 1/4 స్పూన్
ఉప్పు & కారం -- తగినంత
అప్పడాల షోడా -- 1/4 స్పూన్
నూనె -- 1/4 కేజీ

తయారీవిధానం
ముందుగా మైదాపిండిలో ఉప్పు, అప్పడాలషోడా వేసి తగినన్ని నీళ్ళు పోసి, చపాతీపిండిలాగా కలుపుకోవాలి. పెసరపప్పుని ఒకగంట ముందు నానబెట్టుకొని, రుబ్బి, అందులో శెనగపిండి, ఉప్పు, కారం, గరంమసాలా వేసి, స్టవ్ వెలిగించి బాణలి పెట్టి, అందులో ఈ మిశ్రమాన్ని వేసి, దగ్గరపడేవరకు ఉడికించి దించుకోవాలి. చల్లారిన తరవాత చిన్న - చిన్న ఉండలుగా చేసుకోవాలి.

ఇప్పుడు మైదాపిండిని చిన్న చిన్న చపాతీలుగా వత్తుకొని, పెసరఉండలిని మధ్యలోపెట్టి, అంచులు మూసి, మళ్ళీ చపాతీలుగా వత్తుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలిపెట్టి, నూనె పోసి, కాగిన తరవాత వత్తుకొని ఉంచుకున్న, కచోరీలను దోరగా వేయించి ఒక ప్లేట్ప లో ఉంచుకోవాలి. ఇప్పుడు వీటిమీద మనకు ఇష్టమైతే, సన్నని కారపుపూస, కొత్తిమీర, టమాట, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అలంకరించుకొని, ఇష్టమైన చట్నీలతో తినొచ్చును. అంతే కరకరలాడే కమ్మని కచోరీ రెడీ.



5.7.13

మిర్చీ బజ్జీలు

మిర్చీ బజ్జీలు

కావలసిన పదార్థాలుపచ్చిమిరపకాయలు --1/4 కేజీ (బజ్జీలకి అంటే లావుగా ఉండేవి తీసుకోవాలి)
శెనగపిండి -- 2 కప్పులు
బియ్యం పిండి -- 2 స్పూన్స్
ఉల్లిపాయ ముక్కలు -- 1 కప్పు (సన్నగా తరిగి ఉంచుకోవాలి)
ఉప్పు -- తగినంత
కారం పొడి -- 1 స్పూన్
జీలకర్ర పౌడర్ -- 1 స్పూన్
అప్పడాలషోడా -- 1/2 స్పూన్
నూనె -- 1/4 కేజీ
వాము పౌడర్ -- 2 స్పూన్స్
నిమ్మకాయలు -- 2

తయారీ విధానం
లావుగా ఉండే బజ్జీల మిర్చీలు తీసుకొని కడిగి, మధ్యకు చీల్చుకొని, కావాలంటే గింజలు తీయాలి. కరం తినేవారు ఐతే ఉంచుకోవచ్చును. ఇప్పుడు శెనగపిండిలో-- బియ్యం పిండి, ఉప్పు , జీలకర్ర పౌడర్, అప్పడాల షోడా అన్నీ వేసి తగినంత నీళ్ళు పోస్తూ, కొంచెం గరిట జరుగా బాగా కలుపుకోవాలి. పిండిని ఎంత బాగా బీట్ చేస్తే, అంట బాగా బజ్జీలు పొంగుతాయి. మధ్యకు చీల్చిన మిరపకాయలలో ఉప్పు+ వాముని కలుపుకొని నింపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలి పెట్టి, నూనె వేసి కాగిన తరవాత, మిరపకాయలను శెనగపిండిలో ముంచుకొని, నూనెలో వేయాలి.
అలాగ అన్నీ దోరగా వేయించి తీసుకోవాలి. అన్నీ వేయించి ఒక పళ్ళెంలో ఉంచుకొని, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలలో, కొంచెముగా ఉప్పు, కారం వేసుకొని నింపుకొని పైన నిమ్మరసం పిండుకోవాలి. అంతే అందరికీ ఇష్టమైన వేడి -- వేడి, రుచికరమైన మిర్చి బజ్జీలు రెడీ.



సగ్గుబియ్యం వడలు

సగ్గుబియ్యం వడలు

కావలసిన పదార్థాలు
సగ్గుబియ్యం -- 1 కప్పు
బియ్యంపిండి --1 కప్పు
శెనగపిండి -- 2 స్పూన్స్
పచ్చిమిర్చి పేస్టు -- 1 స్పూన్
జీలకర్ర పౌడర్ -- 1 స్పూన్
పెరుగు -- 1 కప్పు
ఉప్పు --- తగినంత
నూనె -- 1/4 కేజీ

తయారీ విధానం
2 గంటల ముందుగా సగ్గుబియ్యాన్ని పెరుగులో నానబెట్టుకోవాలి. బాగా ననిన తరవాత దానిలో బియ్యంపిండి, శెనగపిండి, పచ్చిమిర్చి పేస్టు, జీలకర్ర పౌడర్ & ఉప్పు వేసి, గారెల పిండిలాగా మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి, బాణలి పెట్టి, నూనె పోసి, కాగాక, ఒక పాలకవరు మీదైనా, లేకుంటే చేతిమీదనైనా పిండిని తీసుకొని, గుండ్రంగా చేసి నూనెలో వేసుకొని, గోధుమరంగు వచ్చేవరకు వేయించి తీసుకోవాలి. మనకి నచ్చిన చెట్నీతో నంజుకొని తినొచ్చును. అంతే వేడి -- వేడి, కరకరలాడే కమ్మని సగ్గుబియ్యం వడలు రెడీ.(ఇష్టమైన వారు ఈ పిండిలో కొత్తిమీర కూడా వేసుకోవచ్చును)