7.4.17

దోసకాయ బండ(పచ్చి) పచ్చడి

దోసకాయ బండ(పచ్చి) పచ్చడి
 

కావలసిన పదార్థాలు 
దోసకాయ ముక్కలు - 1 కప్పు 
పసుపు - చిటికెడు 
చింతపండు - చిన్న నిమ్మకాయంత 
ఉప్పు - రుచికి సరిపడినంత 
ఇంగువ - 1/4 స్పూన్ 
నూనె - పోపుకి సరిపడినంత 
(పోపు దినుసులు) 
మినపప్పు - 3స్పూన్స్, 
ఆవాలు - 1 స్పూన్ 
మెంతులు - చాల కొంచెం (దగ్గరదగ్గర 10 గింజలు వేస్తె చాలు, ఎక్కువ వేస్తె చేదు వస్తుంది.)
ఎండుమిర్చి - 3

తయారుచేయు విధానం 
ముందుగా దోసకాయలని బాగా కడిగి పైన తొక్కను తీసి కాయను రెండు ముక్కలు చెయ్యాలి. దోసకాయ లోపల ఉన్న గింజలను వేరు చేసి ఒక బౌల్ లోకి తీసుకొని ఉంచుకోవాలి.  ఇప్పుడు దోసకాయని వీలైనంత సన్నగా చిన్న చిన్న ముక్కలుగా తరుగుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలి పెట్టి అందులో పోపుకి సరిపడినంత నూనెను పోసి వేడెక్కాక మినప్పప్పు వేసి వేయించుకోవాలి తరవాత మెంతులు, ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువ అన్నీ ఒకదాని తరవాత ఒకటిగా వేసుకుంటూ పోపు మాడకుండా దించి పక్కన ఉంచుకోవాలి. పోపు చల్లారిన తరవాత మిక్సీ గిన్నెలో వేసి, ఉప్పు, పసుపు, చింతపండుని వేసి బాగా మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో దోసకాయలనుండి వేరు చేసిన గింజలని కూడా వేసి మరొకసారి మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తం మిశ్రమాన్ని సన్నగా తరుగుకొని పక్కన ఉంచుకున్న దోసకాయ ముక్కలలో వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన బాణలి పెట్టి కొద్దిగా నూనె వేసి మినప్పప్పు, ఆవాలు, ఇంగువ పోపు వేసి దోసకాయ పచ్చడి పైన వెయ్యాలి. ఎంతో రుచికరమైన ఘుమఘుమలాడే దోసకాయ బండ(పచ్చి) పచ్చడి రెడీ. 
(పచ్చడిని ముక్కలుగా తినటం ఇష్టంలేని వారు పోపుని మిక్సీలో వేసి మెత్తగా తిప్పిన తరవాత ముక్కలని కూడా వేసి ఒక్కసారి తిప్పి వెంటనే ఆపెయ్యాలి. ఆలా చేస్తే ముక్కలు సగం నలిగి నలగకుండా ఉంటాయి. ఆలా కూడా పచ్చడి బాగానే ఉంటుంది.)     
                       

No comments:

Post a Comment