21.8.15

శెనగపప్పు పూర్ణం బొబ్బట్లు

శెనగపప్పు పూర్ణం బొబ్బట్లు

కావలసిన పదార్థాలు

శెనగపప్పు - 1/2 కేజీ
మైదా - 1/2 కేజీ
బెల్లం - 400 గ్రాములు
నెయ్యి - 100 గ్రాములు 
నూనె - 100 గ్రాములు
యాలకులపొడి - 1 స్పూను

తయారు చేయువిధానం
బొబ్బట్లు చేసుకోవటానికి 2 గంటలకు ముందే మైదాపిండిని కలుపుకొని ఉంచుకోవాలి. ఎలా కలపాలంటే ----చపాతీపిండి లేదా పూరీ పిండిని కలిపినట్టుగా కలుపుకోవాలి. ఇలా కలిపిన పిండికి కొంచెం ఎక్కువగా నూనె వేసి కలిపినట్లయితే, తోపు పిండి (మైదాపిండి) మృదువుగా ఉంటుంది. ఇహ ఇప్పుడు స్టవ్ వెలిగించి, కుక్కరు పెట్టి, అందులో 1/2 కేజీ శెనగపప్పును ఒక గిన్నెలోకి తీసుకొని, తగిననంత నీరు పోసి ఉడికించుకోవాలి.  

పప్పు బాగా మెత్తబడుతుంది. చల్లారిన తరవాత పప్పులో తురుముచేసి పక్కనపెట్టుకున్న బెల్లాన్ని, యాలకుల పొడిని వేసి బాగా కలపాలి. ఉడికిన పప్పులో బెల్లం కలిపెసరికి పాకంలాగా అయ్యి, పప్పు పల్చబడుతుంది. ఇలా పల్చబడిన మిశ్రమాన్ని మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక మందపాటి బాణలిగానీ, గిన్నెగానీ ఉంచి అందులో వేసి, ఆ మిశ్రమం దగ్గర అయ్యేవరకు కలుపుతూ ఉండాలి. కలపకపోతే మిశ్రమం బాణలికి అడుగు అంటే అవకాశం ఉంటుంది. మొత్తానికి మిశ్రమం దగ్గర పడ్డాక స్టవ్ మీద నుండి దించి, పక్కన పెట్టుకొని, చల్లారిన తరవాత చిన్న చిన్న పూరి ఉండలులాగా చేసుకోవాలి. 

చేసిన తరవాత, నానబెట్టిన మైదా పిండిని తీసుకొని, ఉండలుగా చేసిపెట్టుకోవాలి. పాలకవరు గానీ, నూనె ప్యాకెట్టు కవరు గానీ, అందుబాటులో ఉంటే అరటిఆకునైనా తీసుకోవచ్చును, ఏదైనా తీసుకొని దానికి నెయ్యి కొంచెం రాసి, మైదాపిండి ఉండను ఉంచి, నేతి గిన్నెలో ముంచిన చేతితోనే పలచగా చాపాతిలాగా వత్తుకోవాలి. ఇలా చేసిన మైదాపిండి చపాతి మధ్యలో ముందుగా చేసి ఉంచుకున్న పూర్ణం ఉండని ఒక దానిని ఉంచి, ఆ పూర్ణం కనిపించకుండా మైదాపిండి చపాతితో మూసెయ్యాలి. మళ్ళీ నేతి గిన్నెలో చేయి ముంచి మైదాపిండి చపాతీ నుండి పూర్ణం బయటకు రాకుండా నెమ్మదిగా, గుండ్రంగా చేతితో బొబ్బట్టుని వత్తుకోవాలి. నెయ్యి ఎంత ఎక్కువగా వేసి వత్తుకుంటే బొబ్బట్టు అంత మృదువుగా, అంటుకోకుండా ఉంటుంది. ఈవిధంగా ఒక రెండు బొబ్బట్లు చేసి పక్కన పెట్టుకున్నాక స్టవ్ వెలిగించి,  బాగా తక్కువ, సన్నని మంటపైన పెనం పెట్టుకొని, పెనం కొంచెం వేడి ఎక్కాక, కవరుపై నుండి జాగ్రత్తగా బొబ్బట్టుని పెనం మీదకు వదలాలి, వదిలేటప్పుడు కవరు పెనానికి తగలకూడదు. బొబ్బట్టు చిరగకూడదు(విరిగిపోకూడదు). ఇలా పెనంపై ఉన్న బొబ్బట్టుని రెండు వైపులా  బంగారపు వర్ణం వచ్చేవరకు నెయ్యి వేస్తూ కాల్చుకోవాలి. అంతే కమ్మని, తియ్యని, మధురమైన బొబ్బట్లు రెడీ. తడిచెయ్యి తగలకుండా బొబ్బట్లు చేసుకున్నట్లయితే ఆ బొబ్బట్లు ఒక వారం వరకు నిల్వ ఉంటాయి.


2 comments: