13.4.15

మొటిమలు రావటానికి గల కారణాలు -- మొటిమలు పోవటానికి కొన్ని చిట్కాలు

మొటిమలు రావటానికి గల కారణాలు -- మొటిమలు పోవటానికి కొన్ని చిట్కాలు

వేపుడు పదార్థాలు, ప్రోటీన్లు ఎక్కువగా ఉండే పప్పులు, పుల్లటి పదార్థాలు, మాంసం, పాల ఉత్పత్తులు, కోడిగుడ్లు మొదలైనవి ఎక్కువగా తీసుకోవటం వలన మలబద్దకం ఏర్పడుతుంది. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది - అది మనం తీసుకునే ఆహారాన్ని బట్టే ఉంటుంది.  

మొటిమలు రావటానికి గల కారణాలు  

1) మొటిమలు ఎక్కువగా యుక్తవయసు(టీనేజ్) పిల్లలకి వస్తాయి. అందుకు మలబద్దకం ముఖ్య  కారణం(సమయానికి ఆహారం తీసుకొని, సమయానికి నిద్రపోతే మలబద్ధకం వచ్చే అవకాశాలు తక్కువ)   
2) ఒత్తిడి కూడా ఒక కారణం 
3) తినే పదార్థాలలో కెమికల్స్ ఉండటం, కాలుష్యం ఉన్న ప్రదేశాలలో చిరుతిళ్ళు తినడం. 
4) మసాలాలు, నూనె వస్తువులు, చేదు, పులుపు, ఎక్కువగా ఉన్నవాటిని తీసుకోకూడదు. 


మొటిమలు పోవటానికి కొన్ని చిట్కాలు  

1) మొటిమలు ఉన్నవాళ్లు రోజుకి కనీసం 10 గ్లాసులు మంచినీళ్ళు తాగాలి 
2) కొబ్బరి నీళ్ళు తాగాలి 
3) తాజాగా వండిన వంటకాలనే తినాలి. 
4) వంటికి  చలువచేసే వంటలని మాత్రమే తినాలి 
5) తీసుకునే ఆహారంలో సోంపు, ధనియాలు, ఉసిరిక, కలబంద మొదలైనవి ఉండేటట్టు చూసుకోవాలి. 
6) మెంతులను నీటిలో నానబెట్టి, వాటిని మెత్తగా నూరి, ఆ పేస్టును ముఖానికి రోజూ రాసుకోవాలి. అది పూర్తిగా ఆరిపోయిన తరవాత ముఖాన్ని చల్లటి నీతితో కడిగివేయాలి. 
7) కలబంద జెల్ లో పసుపు కలిపి ముఖానికి ప్యాక్ వేసుకొని అరగంట తరవాత చల్లటి నీతితో కడుగుకోవాలి. 
8) వెల్లుల్లి రెబ్బలని విరిచి మొటిమలు ఉన్నచోట రుద్ది చల్లటి నీతితో కడుక్కోవాలి. 
9) వేపాకులు, పసుపు కలిపి నీటితో తడిచేసి పేస్ట్ లాగా చేసుకొని, ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. ఆరిపోయాక నీటితో ముఖాన్ని కడుక్కోవాలి 
10) లవంగాలను నీటిలో నానబెట్టి వాటిని మెత్తగా నూరుకొని, మొటిమలపై రోజూ రాస్తూ ఉంటే, కొద్ది రోజులకి మొటిమలు ఎండిపోయి మచ్చలు కనిపించవు. 
11) తులసి, పుదీనా ఆకులను మెత్తగా నూరుకొని కొన్ని రోజులు ముఖానికి రాసుకుంటుంటే కొద్ది రోజులకి మొటిమలు తగ్గిపోతాయి .
12) రోజ్ వాటర్ లో గంధాన్ని కలిపి ముఖానికి రోజూ రాస్తుంటే, కొద్ది రోజులకి మొటిమలు తగ్గిపోతాయి. 
13) ఇంగువలో కొద్దిగా నీటిని కలిపి పేస్టుగా చేసి మొటిమలపైన రోజూ రాస్తూ ఉంటే, కొద్ది రోజులకి తగ్గిపోతాయి. 


                         

13.1.15

అరిసలు

అరిసలు


కావలసిన పదార్థాలు  
బియ్యం - 1కేజీ 
బెల్లం తరుము -1/2 కేజీ 
నువ్వులపప్పు -  100 గ్రా 
నీరు - 1 కప్పు (తగినంత) 
యాలకుల పొడి -  2 స్పూన్స్ 
నెయ్యి - 2 స్పూన్స్ 
నూనె - వేయించడానికి సరిపడా (దగ్గరదగ్గర 1/2 కేజీ)  

తయారీ విధానం 
అరిసలు చేయటానికి 12 గంటల ముందుగా బియ్యాన్ని బాగా కడిగి నానబెట్టాలి. తరవాత కడిగి, నీరు వంపి నీడలో ఆరబెట్టాలి. బియ్యం తడి పొడిగా ఉండగానే మిల్లు (మర) పట్టించాలి. పిండి తడి ఆరకుండానే అరిసలు చేసుకోవాలి. నువ్వులపప్పును కడిగి ఆరబెట్టి ఉంచుకోవాలి. 

అన్నీ సిద్ధం చేసుకొని స్టవ్ వెలిగించాలి. ఒక మందపాటి గిన్నెను స్టవ్ మీద పెట్టి, బెల్లం  కొంచెం మునిగే వరకు నీరు పోసి ముదురపాకం అంటే ఉండపాకం వచ్చేవరకు గరిటతో తిప్పుతూ ఉండాలి. ఒక పళ్ళెంలో కొద్దిగా నీరు పోసి పాకాన్ని వేస్తే, పాకం ఉండకట్టాలి. ఇప్పుడు ఈ పాకంలో నువ్వులపప్పు, నెయ్యి, యాలకులపొడిని వేసి, అప్పుడు బియ్యం పిండిని పోస్తూ గరిటతో బాగా కలపాలి. మొత్తం పాకంలో పిండి సరిపోయి, ముద్దగా తయారవ్వాలి అన్నమాట. ఇప్పుడు అరిసల పిండి గిన్నెను పక్కకు తీసి, స్టవ్ పైన బాణలి (మూకుడు) పెట్టి నూనె పోసి, మరిగే లోపల అరిసెల పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని, ప్లాస్టిక్ కవరు పైన వత్తుకొని, ఉంచుకోవాలి. నూనెని స్టవ్ మీద, చిన్నమంటలోనే ఉంచాలి, నూనె కాగిన తరవాత ఒక్కొక్కటిగా అరిసెలను వేసుకొని, వేయించుకోవాలి, రెండువైపులా బంగారు రంగు వచ్చేవరకు వేయించుకొని, తీసిపక్కన ఉంచుకోవాలి. 

తీసిన అరిసెలని ఒక పీటపైన ఉంచి, రొట్టెలకర్రతో గట్టిగా వత్తితే నూనె అంతా బయటకి వచ్చేస్తుంది. అనంతరం వాటిని బాగా ఆరబెట్టి గాలిచొరబడని డబ్బాలో ఉంచితే, ఒకనెలరోజుల పాటు నిల్వ ఉంటాయి. అంతే చాలా సులువుగా చేసుకొనే కమ్మని, తియ్యని పిండివంట రెడీ.  

                       

26.12.14

ఇంట్లోనే తయారుచేసుకునే పిజ్జా

(ఇంట్లోనే తయారుచేసుకునే) పిజ్జా 
కావలసిన పదార్థాలు 
మైదా - 1 కప్పు 
ఈస్ట్ - 2 స్పూన్స్ 
వంటషోడా - 1/2 స్పూన్ 
క్యాప్సికం - 1 (చిన్న ముక్కలు తరిగి ఉంచుకోవాలి) 
టమాటాలు - 3 (చక్రాలుగా తరిగి ఉంచుకోవాలి)
టమాటా సాస్ & వెన్న - (మన ఇష్టానికి తగినంత వేసుకోవచ్చును)
పన్నీరు తురుము - 1/4 కప్పు 

తయారీ విధానం 
ముందుగా స్టవ్ వెలిగించి, ఒక చిన్న గిన్నెలోకి కొంచెం నీరు తీసుకొని వేడిచేయాలి. నీరు వేడెక్కే లోపల ఒక బేసిన్ లోకి ఈస్ట్ & వంటషోడ తెసుకొని, కొద్దిగా చల్లని నీరు జల్లి కలిపి, ఆ మిశ్రమానికి మైదాపిండిని చేర్చి,  గోరువెచ్చని నీరు కలిపి చపాతీ పిండిలాగా ముద్దగా కలుపుకొని, 10 నిముషాలు పక్కన పెట్టాలి. ఇప్పుడు మళ్ళీ పిండిని మరొకసారి బాగా కలిపి, అర అంగుళం మందంలో గుండ్రంగా చపాతీలాగా చేతితో వత్తుకోవాలి. ఇప్పుడు పిజ్జా బేస్ తయారయ్యిందన్నమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించి, సన్నని మంటపై పెనం (pan) పెట్టి, పెనానికి కొద్దిగా వెన్నరాసి, తయారుచేసి ఉంచుకున్న పిజ్జా బేస్ ని ఉంచి మూతపెట్టాలి. బేస్ కాలే లోపల ... సన్నగా తరిగి ఉంచుకున్న క్యాప్సికం ముక్కలు & టమాటా ముక్కలు వేరే స్టవ్ వెలిగించి, బాణలిలో వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. కొద్దిసేపటికి పిండి బాగా కాలి ఉబ్బుతుంది. (ఉడుకుతుంది). ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న టమాటా & క్యాప్సికం ముక్కల మిశ్రమాన్ని బేస్ పైన వేసి, టమాటా సాస్, వెన్న, పన్నీరు తురుము వేసి మరికొద్దిసేపు ఉంచాలి. 10 నిముషాలు అయ్యాక ముక్కలుగా కోసుకొని, స్టవ్ ని ఆపెయ్యాలి. అంతే పిల్లలు - పెద్దలు ఎంతో ఇష్టపడే వేడివేడి రుచికరమైన పిజ్జా రెడీ. టమాటా సాస్ తో సర్వ్ చేసి తినేయ్యటమే...... 
                                

3.8.14

కొబ్బరి - శెనగపప్పు కూర

కొబ్బరి - శెనగపప్పు కూర

కావలసిన పదార్థాలు
శెనగపప్పు – 2 కప్పులు
కొబ్బరి కోరు(పొడి) – ౪ కప్పులు
పోపుదినుసులు – కొంచెం(మినప్పప్పు, ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువ)    
పసుపు – చిటికెడు
ఉప్పు – రుచికి తగినంత
కారం – 1 స్పూను
వెల్లుల్లి రెబ్బలు – 2
కరివేపాకు – 2 రెబ్బలు
నూనె – 50గ్రా 

తయారుచేయు విధానం:-

ముందుగా స్టవ్ వెలిగించి ఒక కుక్కరులో శెనగపప్పును కొంచెం మెత్తగా ఉడికించుకోవాలి. ఉడికినపప్పును కుక్కరులోనుండి తీసి, నీరు వంచి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి, బాణలిపెట్టి, నూనె వేసి, పోపుదినుసులు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, వేసి వేగిన తరవాత, కొబ్బరికోరును వేసి, పచ్చిదనం పోయేవరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో ఉడికించి పక్కనపెట్టుకున్న శెనగపప్పును వేసి, ఉప్పు, కారం, పసుపు అన్నీవేసి, బాగా కలిపి, 5నిముషాలు ఉంచి దించుకోవాలి. అంతే కమ్మని కొబ్బరి - శెనగపప్పు కూర రెడీ.  

25.7.14

మసాలా బటూరా

మసాలా బటూరా

కావలసిన పదార్థాలు

గోధుమపిండి - 1 కప్పు
మైదాపిండి - 1 కప్పు
పెరుగు - 3 కప్పులు
నెయ్యి - 1 స్పూన్
షోడా - 1 చిన్న స్పూన్
వేడి నీరు - కొంచెం
ఉప్పు - రుచికి తగినంత
నెయ్యి లేదా నూనె - 200 గ్రా
ఉల్లిపాయ తరుగు - 1/2 కప్పు
పచ్చిమిర్చి తరుగు - 2 స్పూన్స్
కొత్తిమీర తరుగు - 2 స్పూన్స్
గరంమసాలా పొడి - 1 స్పూన్

తయారీవిధానం
ఒక బౌల్ లో గోధుమ & మైదా పిండ్లు, షోడా, నెయ్యి, పంచదార, పెరుగు, వేడినీరు, అన్నీ వేసి బాగా కలిపి, 6 గంటలు నానబెట్టాలి. ఇది సాదా బటూరా చేసే విధానం.

మసాలా బటూరాకి గోధుమ, మైదా పిండులు, షోడా, నెయ్యి, పంచదార, పచ్చిమిర్చి, ఉల్లితరుగు, కొత్తిమీర, గరం మసాల అన్నీ కలిపి వేడినీరు పోస్తూ పిండిని బాగా మదాయిస్తూ కలిపి, తడిబట్ట కప్పి 6 గంటలు నాన్నబెట్టాలి. పిండి నానిన తరవాత, చిన్న - చిన్న ఉండలుగా చేసుకొని పూరీ లాగానే బటూరాని వత్తుకోవాలి. నూనెలో బంగారు రంగు వచ్చేవరకు వేయించి తీయాలి. బటూరలని ఆలూ, శనగల కూరలతో వడ్డిస్తే చాలా రుచిగా ఉంటుంది.

(సాదా బటూరల మాదిరిగానే పిండిని కలుపుతూ, అందులో 3 స్పూన్స్ పంచదార, యాలకులపొడి కలిపి..... బటూర వత్తితే అవి తీపి బటూరాలు అవుతాయి :) )