13.1.15

అరిసలు

అరిసలు


కావలసిన పదార్థాలు  
బియ్యం - 1కేజీ 
బెల్లం తరుము -1/2 కేజీ 
నువ్వులపప్పు -  100 గ్రా 
నీరు - 1 కప్పు (తగినంత) 
యాలకుల పొడి -  2 స్పూన్స్ 
నెయ్యి - 2 స్పూన్స్ 
నూనె - వేయించడానికి సరిపడా (దగ్గరదగ్గర 1/2 కేజీ)  

తయారీ విధానం 
అరిసలు చేయటానికి 12 గంటల ముందుగా బియ్యాన్ని బాగా కడిగి నానబెట్టాలి. తరవాత కడిగి, నీరు వంపి నీడలో ఆరబెట్టాలి. బియ్యం తడి పొడిగా ఉండగానే మిల్లు (మర) పట్టించాలి. పిండి తడి ఆరకుండానే అరిసలు చేసుకోవాలి. నువ్వులపప్పును కడిగి ఆరబెట్టి ఉంచుకోవాలి. 

అన్నీ సిద్ధం చేసుకొని స్టవ్ వెలిగించాలి. ఒక మందపాటి గిన్నెను స్టవ్ మీద పెట్టి, బెల్లం  కొంచెం మునిగే వరకు నీరు పోసి ముదురపాకం అంటే ఉండపాకం వచ్చేవరకు గరిటతో తిప్పుతూ ఉండాలి. ఒక పళ్ళెంలో కొద్దిగా నీరు పోసి పాకాన్ని వేస్తే, పాకం ఉండకట్టాలి. ఇప్పుడు ఈ పాకంలో నువ్వులపప్పు, నెయ్యి, యాలకులపొడిని వేసి, అప్పుడు బియ్యం పిండిని పోస్తూ గరిటతో బాగా కలపాలి. మొత్తం పాకంలో పిండి సరిపోయి, ముద్దగా తయారవ్వాలి అన్నమాట. ఇప్పుడు అరిసల పిండి గిన్నెను పక్కకు తీసి, స్టవ్ పైన బాణలి (మూకుడు) పెట్టి నూనె పోసి, మరిగే లోపల అరిసెల పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని, ప్లాస్టిక్ కవరు పైన వత్తుకొని, ఉంచుకోవాలి. నూనెని స్టవ్ మీద, చిన్నమంటలోనే ఉంచాలి, నూనె కాగిన తరవాత ఒక్కొక్కటిగా అరిసెలను వేసుకొని, వేయించుకోవాలి, రెండువైపులా బంగారు రంగు వచ్చేవరకు వేయించుకొని, తీసిపక్కన ఉంచుకోవాలి. 

తీసిన అరిసెలని ఒక పీటపైన ఉంచి, రొట్టెలకర్రతో గట్టిగా వత్తితే నూనె అంతా బయటకి వచ్చేస్తుంది. అనంతరం వాటిని బాగా ఆరబెట్టి గాలిచొరబడని డబ్బాలో ఉంచితే, ఒకనెలరోజుల పాటు నిల్వ ఉంటాయి. అంతే చాలా సులువుగా చేసుకొనే కమ్మని, తియ్యని పిండివంట రెడీ.  

                       

No comments:

Post a Comment