26.12.14

ఇంట్లోనే తయారుచేసుకునే పిజ్జా

(ఇంట్లోనే తయారుచేసుకునే) పిజ్జా 
కావలసిన పదార్థాలు 
మైదా - 1 కప్పు 
ఈస్ట్ - 2 స్పూన్స్ 
వంటషోడా - 1/2 స్పూన్ 
క్యాప్సికం - 1 (చిన్న ముక్కలు తరిగి ఉంచుకోవాలి) 
టమాటాలు - 3 (చక్రాలుగా తరిగి ఉంచుకోవాలి)
టమాటా సాస్ & వెన్న - (మన ఇష్టానికి తగినంత వేసుకోవచ్చును)
పన్నీరు తురుము - 1/4 కప్పు 

తయారీ విధానం 
ముందుగా స్టవ్ వెలిగించి, ఒక చిన్న గిన్నెలోకి కొంచెం నీరు తీసుకొని వేడిచేయాలి. నీరు వేడెక్కే లోపల ఒక బేసిన్ లోకి ఈస్ట్ & వంటషోడ తెసుకొని, కొద్దిగా చల్లని నీరు జల్లి కలిపి, ఆ మిశ్రమానికి మైదాపిండిని చేర్చి,  గోరువెచ్చని నీరు కలిపి చపాతీ పిండిలాగా ముద్దగా కలుపుకొని, 10 నిముషాలు పక్కన పెట్టాలి. ఇప్పుడు మళ్ళీ పిండిని మరొకసారి బాగా కలిపి, అర అంగుళం మందంలో గుండ్రంగా చపాతీలాగా చేతితో వత్తుకోవాలి. ఇప్పుడు పిజ్జా బేస్ తయారయ్యిందన్నమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించి, సన్నని మంటపై పెనం (pan) పెట్టి, పెనానికి కొద్దిగా వెన్నరాసి, తయారుచేసి ఉంచుకున్న పిజ్జా బేస్ ని ఉంచి మూతపెట్టాలి. బేస్ కాలే లోపల ... సన్నగా తరిగి ఉంచుకున్న క్యాప్సికం ముక్కలు & టమాటా ముక్కలు వేరే స్టవ్ వెలిగించి, బాణలిలో వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. కొద్దిసేపటికి పిండి బాగా కాలి ఉబ్బుతుంది. (ఉడుకుతుంది). ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న టమాటా & క్యాప్సికం ముక్కల మిశ్రమాన్ని బేస్ పైన వేసి, టమాటా సాస్, వెన్న, పన్నీరు తురుము వేసి మరికొద్దిసేపు ఉంచాలి. 10 నిముషాలు అయ్యాక ముక్కలుగా కోసుకొని, స్టవ్ ని ఆపెయ్యాలి. అంతే పిల్లలు - పెద్దలు ఎంతో ఇష్టపడే వేడివేడి రుచికరమైన పిజ్జా రెడీ. టమాటా సాస్ తో సర్వ్ చేసి తినేయ్యటమే...... 
                                

3.8.14

కొబ్బరి - శెనగపప్పు కూర

కొబ్బరి - శెనగపప్పు కూర

కావలసిన పదార్థాలు
శెనగపప్పు – 2 కప్పులు
కొబ్బరి కోరు(పొడి) – ౪ కప్పులు
పోపుదినుసులు – కొంచెం(మినప్పప్పు, ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువ)    
పసుపు – చిటికెడు
ఉప్పు – రుచికి తగినంత
కారం – 1 స్పూను
వెల్లుల్లి రెబ్బలు – 2
కరివేపాకు – 2 రెబ్బలు
నూనె – 50గ్రా 

తయారుచేయు విధానం:-

ముందుగా స్టవ్ వెలిగించి ఒక కుక్కరులో శెనగపప్పును కొంచెం మెత్తగా ఉడికించుకోవాలి. ఉడికినపప్పును కుక్కరులోనుండి తీసి, నీరు వంచి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి, బాణలిపెట్టి, నూనె వేసి, పోపుదినుసులు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, వేసి వేగిన తరవాత, కొబ్బరికోరును వేసి, పచ్చిదనం పోయేవరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో ఉడికించి పక్కనపెట్టుకున్న శెనగపప్పును వేసి, ఉప్పు, కారం, పసుపు అన్నీవేసి, బాగా కలిపి, 5నిముషాలు ఉంచి దించుకోవాలి. అంతే కమ్మని కొబ్బరి - శెనగపప్పు కూర రెడీ.  

25.7.14

మసాలా బటూరా

మసాలా బటూరా

కావలసిన పదార్థాలు

గోధుమపిండి - 1 కప్పు
మైదాపిండి - 1 కప్పు
పెరుగు - 3 కప్పులు
నెయ్యి - 1 స్పూన్
షోడా - 1 చిన్న స్పూన్
వేడి నీరు - కొంచెం
ఉప్పు - రుచికి తగినంత
నెయ్యి లేదా నూనె - 200 గ్రా
ఉల్లిపాయ తరుగు - 1/2 కప్పు
పచ్చిమిర్చి తరుగు - 2 స్పూన్స్
కొత్తిమీర తరుగు - 2 స్పూన్స్
గరంమసాలా పొడి - 1 స్పూన్

తయారీవిధానం
ఒక బౌల్ లో గోధుమ & మైదా పిండ్లు, షోడా, నెయ్యి, పంచదార, పెరుగు, వేడినీరు, అన్నీ వేసి బాగా కలిపి, 6 గంటలు నానబెట్టాలి. ఇది సాదా బటూరా చేసే విధానం.

మసాలా బటూరాకి గోధుమ, మైదా పిండులు, షోడా, నెయ్యి, పంచదార, పచ్చిమిర్చి, ఉల్లితరుగు, కొత్తిమీర, గరం మసాల అన్నీ కలిపి వేడినీరు పోస్తూ పిండిని బాగా మదాయిస్తూ కలిపి, తడిబట్ట కప్పి 6 గంటలు నాన్నబెట్టాలి. పిండి నానిన తరవాత, చిన్న - చిన్న ఉండలుగా చేసుకొని పూరీ లాగానే బటూరాని వత్తుకోవాలి. నూనెలో బంగారు రంగు వచ్చేవరకు వేయించి తీయాలి. బటూరలని ఆలూ, శనగల కూరలతో వడ్డిస్తే చాలా రుచిగా ఉంటుంది.

(సాదా బటూరల మాదిరిగానే పిండిని కలుపుతూ, అందులో 3 స్పూన్స్ పంచదార, యాలకులపొడి కలిపి..... బటూర వత్తితే అవి తీపి బటూరాలు అవుతాయి :) )

                            

19.5.14

ఆవకాయ

(పెద్ద) ఆవకాయ {సంవత్సర కాలం నిల్వ ఉండే ఆవకాయ}


కావలసిన పదార్థాలు 
పెద్ద మామిడికాయలు - 15
ఆవగుండ - 4 పావులు (1 కేజీ)
కారం - 3 పావులు 
ఉప్పు - 2 పావులు 
నూనె - 1 కేజీ (వేరుశెనగ నూనె ఐతే బావుంటుంది.... నువ్వులనూనెను కూడా వాడవచ్చును)
పసుపు - 1 స్పూన్ 
మెంతులు - 2 స్పూన్స్ 
ఇంగువ - 6 స్పూన్స్ 


తయారుచేయు విధానం:-
ముందుగా ఆవగుండా, కారం, ఉప్పు, పసుపు, మెంతులు, ఇంగువ అన్నీ కలిపి ఒక పెద్ద బేసిన లేదా టబ్ లో కలిపి ఉంచుకోవాలి. ముందుగా మామిడికాయలని తడిబట్టతో బాగా తుడిచి, ఆరిపోయాక నాలుగు ముక్కలుగా చేసుకొని, ఒక్కొక్క ముక్కని మూడు లేదా నాలుగు ముక్కలుగా కోసుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపి ఉంచుకున్న ఆవగుండ మిశ్రమంలో ముక్కలను కొద్ది -కొద్దిగా వేస్తూ, నూనె వేసి కలపుకుంటూ ..... పక్కనే కడిగి, తుడిచి ఉంచుకున్న జాడీలో వేస్తూ ఉండాలి. అంతే ---- కమ్మని, ఎర్రని, నోరూరించే కొత్తఆవకాయ రెడీ. 

         

ముఖ్యసూచన:-- ఆవకాయ మరియు ఉరగాయ పచ్చళ్ళు ఏవైనాసరే జాడీలు, సీసాలులోనే దాచి (నిల్వ) ఉంచాలి. ప్లాస్టిక్ సీసాలు, డబ్బాలు వంటి వాటిల్లో ఉంచితే నిలువ & ప్లాస్టిక్ వాసనవచ్చి ఎక్కువరోజులు నిలవ ఉండదు.


   

సపోట మిల్క్ షేక్

సపోట మిల్క్ షేక్


కావలసిన పదార్థాలు
సపోటా పండ్లు - 4 
పాలు - 2 కప్పులు 
పంచదార - 4స్పూన్స్ 
మలాయి - 2 స్పూన్స్ 

తయారుచేయు విధానం 
సపోటా పండ్లని శుభ్రంగా కడిగి, తొక్క & గింజలను తీసి, జ్యూసర్ లో వేసి, బాగా తిప్పి, మెత్తగా నలిగిన తరవాత -- పాలు, పంచదార వేసి, మళ్ళీ జ్యూసర్ లో వేసి, బాగా నురగ వచ్చేవరకు తిప్పి, ఒక గ్లాస్ లో పోసుకొని, ఐస్ క్యూబ్స్ & మలాయి వేసుకొని తాగాలి. ఎండలో తిరిగి - తిరిగి వచ్చి, ఈ సపోటా మిల్క్ షేక్ తాగితే ఎంత హాయిగా ఉంటుందో కదా ! ఇంకెందుకు ఆలస్యం ...... త్వరగా చేసుకొని తాగెయ్యండి.      

          

24.4.14

పాలక్ ఊతప్పం

పాలక్ ఊతప్పం 

కావలసిన పదార్థాలు 
బియ్యం - 3 కప్పులు 
మినప్పప్పు - 1 కప్పు 
టమాటా రసం - ఒకటిన్నర కప్పు 
పాలక్ పేస్ట్ - 1 కప్పు 
ఉల్లిపాయ ముక్కలు - 1/2 కప్పు 
క్యాప్సికం ముక్కలు - 1/2 కప్పు 
మిరియాల పౌడర్ - 1/4 స్పూన్ 
చీజ్ - 100 గ్రాములు (సన్నగా తురుము చేసి ఉంచుకోవాలి)
ఉప్పు & కారం - రుచికి సరిపడినంత 

తయారీవిధానం 
ముందురోజు బియ్యం, మినప్పప్పుని విడివిడిగా నానబెట్టి, విడివిడిగా దోసెలపిండిలా రుబ్బుకొని తగినంత ఉప్పు వేసి పిండిని బాగా కలపాలి. మరుసటిరోజు ఉదయం ఊతప్పం వేసుకుంటే, పిండి పులిసి బావుంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి, బాణలి పెట్టి, కొంచెం నూనెవేసి, ఉల్లిపాయముక్కలు వేసి గోధుమరంగు వచ్చేవరకు వేయించి, అందులో టమాటా రసం, పాలక్ పేస్ట్ , ఉప్పు, మిరియాల పౌడర్ అన్నీవేసి బాగా వేయించి (మగ్గించి) పక్కన ఉంచుకోవాలి.   

ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి, పిండిని కొంచెం మందంగా వేసి, అది దోరగా కాలిన తరవాత పాన్ పైనుండి పక్కన ఒక ప్లేట్ లోకి తీసుకొని, దానిపై  ఉడికించి పక్కన పెట్టుకున్న టమాటా & పాలక్ పేస్ట్ ని వేసి, సన్నగా తరిగి పెట్టుకున్న క్యాప్సికం ముక్కలు & చీజ్ ని పైన పరచి, 450 డిగ్రీల ఫారన్ హీట్ వేడిలో 10 నిముషాలు పాటు ఓవెన్ లో ఉంచి తీసి కొంచెం చల్లబడిన తరవాత తినేయ్యటమే. అంతే చాలా రుచికరమైన, బలమైన .... పిల్లలు ఎంతో ఇష్టపడే పాలక్ ఊతప్పం రెడీ. 

 
      
         

వెజిటబుల్ ఊతప్పం

వెజిటబుల్ ఊతప్పం 

కావలసిన పదార్థాలు 
బియ్యం - 3 కప్పులు 
మినప్పప్పు - 1 కప్పు 
ఉల్లిపాయ ముక్కలు - 1 కప్పు 
టమాటా ముక్కలు - 1 కప్పు 
కొత్తిమీర తురుము - 1/2 కప్పు 
పచ్చిమిర్చి ముక్కలు - 1/2 కప్పు (సన్నగా తరిగిపెట్టుకోవాలి)
ఉప్పు - రుచికి సరిపడినంత 

తయారీవిధానం 
ముందురోజు బియ్యం, మినప్పప్పుని విడివిడిగా నానబెట్టి, విడివిడిగా దోసెలపిండిలా రుబ్బుకొని తగినంత ఉప్పు వేసి పిండిని బాగా కలపాలి. మరుసటిరోజు ఉదయం ఊతప్పం వేసుకుంటే, పిండి పులిసి బావుంటుంది, ఇప్పుడు స్టవ్ వెలిగించి, పాన్ పెట్టి, పిండిని కొంచెం మందంగా వేసి, దానిపైన టమాటా, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర మరియు పచ్చిమిర్చి అన్నీ సమపాళ్ళలో పరచి, చుట్టూ కొంచెం నూనె వేసి, సన్నని మంటపైన కాలనివ్వాలి. ఇష్టమైనవారు రెండోవైపు తిప్పి  కాల్చుకోవచ్చును.అంతే వేడి - వేడి రుచికరమైన వెజిటబుల్ ఊతప్పం రెడీ. (ఇష్టమైనవారు క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చును) 

                    

14.4.14

వరిపిండి వడియాలు .... Varipindi Vadiyalu

వరిపిండి వడియాలు .... Varipindi Vadiyalu

కావలసిన పదార్థాలు
వరిపిండి (బియ్యంపిండి) -- 1 గ్లాసు
ఉప్పు - 1 స్పూన్
కారం - 1 స్పూన్
జీలకర్ర - 1 స్పూన్
ఇంగువ - 1/4 స్పూన్
నీరు - 6 గ్లాసులు

తయారీవిధానం 
ముందుగా స్టవ్ వెలిగించి, ఒక వెడల్పాటి గిన్నెను పెట్టి, అందులో 4 గ్లాసుల నీటిని పోసుకుని, ఆనీటిలో ఉప్పు, కారం, జీలకర్ర, ఇంగువ వేసి బాగా మసిలించాలి. (కారం ఇష్టపడేవారు వారికి కావలసిన కారం వేసుకోవచ్చును.) వరిపిండిని 2గ్లాసుల నీటిలో కలుపుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు బాగామసిలిన నీటిలో వరిపిండి మిశ్రమాన్ని పోస్తూ కలుపుకోవాలి. మిశ్రమం కొంచెం చిక్కబడుతుంది. చిక్కబడగానే దించి, పక్కన పెట్టుకొని, చల్లారిన తరవాత ఒక పలుచటి కవరు మీద, స్పూన్ తో పిండిని వేసి పలుచగా అట్లపిండిని నెరిపినట్లు నెరపాలి. ఎంత పలుచగా మనం వడియాలు పెడితే, అంత త్వరగా ఎండుతాయి, రుచిగా ఉంటాయి. సాయంత్రం అయ్యేసరికి వడియాలు ఎండిపోతాయి. అంతే కరకరలాడే వరిపిండి వడియాలను వేయించుకొని తినటమే. (కవరుపై వడియాలను పెడితే ఎండాక తీసుకోవటానికి సులువుగా ఉంటాయి. అదే బట్టపై అరవేస్తే ఎండిన తరవాత తీసుకోవటానికి కొంచెం కష్టపడాలి. వడియాలు ఆరవేసిన బట్టని వెనుకకు తిప్పి నీరు చల్లితే వడియాలను తీసుకోవటం సులువు అవుతుంది.)                   

1.4.14

పైనాపిల్ మిల్క్ షేక్

పైనాపిల్ మిల్క్ షేక్ 

కావలసిన పదార్థాలు
పైనాపిల్ కట్ చేసిన ముక్కలు - 5
పాలు - 2 కప్పులు
మలాయి - 2 స్పూన్స్
పంచదార - 6 స్పూన్స్

తయారుచేయు విధానం 
ముందుగా పైనాపిల్ కి ముళ్ళు తీసి, ముక్కలుగా కోసుకోవాలి. షేక్ కి కావలసిన ముక్కలని తీసుకొని, మిక్సీ లో వేసి, బాగా నలిగిన తరవాత, పాలు, పంచదార వేసి, బాగా మెత్తగా నురగ వచ్చేవరకు మిక్సీ చెయ్యాలి. ఇప్పుడు షేక్ ని ఒక గ్లాస్ లోకి తీసుకొని, ఐస్ క్యూబ్స్ వేసి, పైన మలాయి వేసుకొని చల్లగా తాగెయ్యటమే అంతే. అన్నిరకాల ఫ్లేవర్ల కంటే పైనాపిల్ ఫ్లేవర్  చాలాబావుంటుంది. చాలా సులువుగా మనం ఇళ్ళల్లో చేసుకునేవే ఈ షేక్ లు, షరాబత్ లు, వేసవికాలంలో పిల్లలు ఎంతో ఇష్టంగా తాగుతారు. మరింక ఆలస్యం ఎందుకు ???? మీరు త్వరగా తయారుచేసేయ్యండి.


బనానా షేక్

బనానా షేక్ 

కావలసిన పదార్థాలు
బాగా పండిన అరటిపండ్లు - 2
పాలు (చల్లనివి) - 2 కప్పులు
పంచదార - 4 స్పూన్స్
మలాయి - 3 స్పూన్స్

తయారుచేయు విధానం 
ముందుగా మిక్సీ తీసుకొని, జ్యూస్ గిన్నెలో పాలు - పంచదార వేసి 1 నిమిషం బాగా కలిసేటట్లు తిప్పాలి. తరవాత అరటిపండ్లు తోక్కతీసుకొని, పాల మిశ్రమంలో వేసి మళ్ళీ 2 నిమిషాలపాటు మిక్సీ చెయ్యాలి. అన్నీ బాగా షేక్ అయ్యిన తరవాత, ఒక గ్లాస్ లో పోసుకొని, ఐస్ క్యూబ్స్ వేసుకొని, ఆపైన మలాయి వేసుకొని తాగటమే........... ఈ మండు వేసవి కాలంలో చల్ల - చల్లగా  ఇటువంటి షేక్, జ్యూస్, షరబత్ లు తాగితే ఎండ తాపం తగ్గుతుంది, ప్రాణానికి హాయిగా ఉంటుంది. అదే వేరే ఎవరైనా చేసి మనకి ఇస్తే, ఇంకా మజాగా ఉంటుంది. ఆ మజానే వేరు కదా !

        

30.3.14

ఉగాది పచ్చడి

ఉగాది పచ్చడి



ఉగాది పచ్చడి గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీకు తెలియచేస్తున్నాను.

ఈ పచ్చడిలో ఆరు రుచులు కలసి ఉంటాయి, ఆరు ఋతువులకు ప్రతీక---తీపి--చేదు, ఉప్పు--కారం, పులుపు--వగరు.

1) తీపిని కలిగించే కొత్త బెల్లం---ఆకలిని కలిగిస్తుంది.

2) పులుపునిచ్చే చింతపండు---కఫ వాతాలని పోగొడుతుంది.

3) కారం---శరీరంలోని క్రిముల్ని నాశనం చేయటమే కాక, శ్లేష్మ రోగాలని దరిచేరనీయదు.

4) వగరు పుట్టించే మామిడి--- లాలాజలాన్ని ఊరించి, జీర్ణక్రియకి తోడ్పడుతుంది.

5)వేపపువ్వు---కడుపులోని ఏమైనా అనారోగ్య దోషాలు ఉంటే, వాటిని దూరం చేస్తుంది. కడుపులో ఉన్న నులిపురుగును చంపి, తిరిగి పుట్టనీయకుండా చేస్తుంది. ఇందులోఇంకా చాలా ఔషధగుణాలున్నాయి.

6) ఉప్పు--ఎముకలని బలపరుస్తుంది.

మన సంవత్సర ఫలితం ఉగాది పచ్చడి మీద ఆధారపడి ఉంటుందట. తీపిఎక్కువగ ఉంటే, మనజీవితం ఆనందమయంగా ఉంటుందని చెబుతారు. అలా అని మనం కోరుండి తీపి ఎక్కువ వేసుకుని తినకూడదు. మనకు నచ్చిన, నచ్చకపోయినా తప్పనిసరి ఈ పచ్చడిని, ఈ ఒక్కరోజు తిని తీరాలి.

పచ్చడి తయారుచేయుటకు కావలసిన పదార్థాలు 

బెల్లం
వేపపువ్వు
చింతపండు
మామిడికాయ ముక్కలు (సన్నగా తురిమి ఉంచుకోవాలి)
ఉప్పు
కారంపొడి


తాయారు చేయు విధానం 

చింతపండును 15 నిమిషముల ముందు నానబెట్టి, పులిహోరకి తీసుకున్నట్టుగా చిక్కగా పులుసు తీసుకొని ఒక బౌల్ లోకి ఉంచుకోవాలి. అందులో -- వేపపువ్వును, (వేపపువ్వును రెమ్మలనుండి వలచి, రెండు అరచేతుల మధ్య ఉంచి, నులిమితే పువ్వు యొక్క సన్నని పొట్టు వస్తుంది.), సన్నగా తరిగి ఉంచుకున్న మామిడి ముక్కలను, తగినంత ఉప్పు & కారంను వేసి...... అన్ని బాగా కలపాలి. అంతే ఆరు రుచుల ఉగాది పచ్చడి రెడీ. 

ఇది అసలు ఉగాది పచ్చడి చేసే విధానం. కానీ కొంతమంది ఇందులో అరటిపండు ముక్కలు, జీడిపప్పు, కిస్స్మిస్స్ మొదలైనవన్నీ కలుపుతుంటారు. ఆ విధంగా కలిపితే ఆరు రుచులే కాకుండా ...... ఇంకా ఎక్కువ రుచుల సమ్మేళనం అవుతుంది కదా !  మీరే ఆలోచించండి. 

            

27.3.14

పూర్ణం బూరెలు

పూర్ణం బూరెలు 

కావలసిన పదార్థాలు
శెనగపప్పు -- 2 కప్పులు
పంచదార - 2 కప్పులు
ఏలకుల పొడి - 2 స్పూన్స్
తోపుపిండి - 1 కప్పు మినప్పప్పు & 3 కప్పులు బియ్యం 3 గంటల ముందుగా నానబెట్టి దోసెల పిండిలాగా రుబ్బి ఉంచుకోవాలి.
నూనె - 1/2 కేజీ (బూరెలు నూనెలో మునిగే అంత)

తయారీవిధానం 
ముందుగా స్టవ్ వెలిగించి శెనగపప్పును కుక్కర్లో బాగా మెత్తగా ఉడకబెట్టుకోవాలి. కుక్కరు వెయిట్ తీసిన తరవాత పప్పులో పంచదార కలిపాలి. పంచదార కలిపగానే పప్పు జారుగా అంటే పలచగా అవుతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి, ఒక మందపాటి గిన్నెలో ఈ మిశ్రమాన్ని వేసి,  సన్నని మంటపై మిశ్రమం అడుగంటకుండా గరిటతో తిప్పుతూ ఉండాలి. మిశ్రమం గట్టిబడ్డాక, (దగ్గరగా అయిన తరవాత) దించి పక్కన ఉంచుకోవాలి. మిశ్రమం చల్లారిన తరవాత ఉండలుగా అదేనండి పూర్ణాలుగా చుట్టి పక్కన ఉంచుకోవాలి.


ఇప్పుడు స్టవ్ వెలిగించి, బాణలి పెట్టి, నూనె పోసి కాగాక ఒక్కొక్క పూర్ణాన్ని తోపుపిండిలో ముంచి నూనెలో వేసి, బంగారురంగు వచ్చేవరకు వేయించి తీసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన సాంప్రదాయపు పిండివంట పూర్ణం బూరెలు రెడీ.

              

26.3.14

క్యాబేజీ ఆవకూర

క్యాబేజీ ఆవకూర

కావలసిన పదార్థాలు:-
క్యాబేజీ - 1/4 కేజీ (సన్నగా తరిగి ఉంచుకోవాలి)
పోపు సామాను - కొంచెముగా
కరివేపాకు - 3 రెబ్బలు
ఉప్పు - రుచికి తగినంత
పసుపు - చిటికెడు 
ఇంగువ - చిటికెడు
చింతపండు - నిమ్మకాయంత
ఆవముద్ద --
(ఆవముద్ద తయారుచేయు విధానం ...... 2 స్పూన్స్ శెనగపప్పు, 3 స్పూన్స్ నూలుపప్పు, 2 స్పూన్స్  ఆవాలు , 3 పచ్చిమిర్చి ..... ఇవి అన్నీ కలిపి 1 గంట నానపెట్టి, రుబ్బుకుంటే ఆవముద్ద రెడీ అవుతుంది.) 

తయారీ విధానం:-
ముందుగా స్టవ్ వెలిగించి, సన్నగా తరిగి ఉంచుకున్న క్యాబేజీని 10 నిముషాలు ఉడికించి, నీరు వంపి, పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాణలిలో పోపుకి సరిపడినంత నూనె వేసి కాగాక  పోపుదినిసులు, కరివేపాకు, ఇంగువ వేసి, పోపు చిటపటలాడాక, ఉడికించి పక్కన పెట్టుకున్న క్యా బేజీని వేసి, అందులో రుచికి సరిపడినంత ఉప్పు, చిటికెడు పసుపు, చింతపండు రసం(చింతపండు పులుసు) వేసి, ఒకసారి కలియబెట్టాలి. చివరిలో కూరని దింపే ముందు, ఆవముద్ద - కొంచెంగా నూనె వేసి కలపాలి......  దించి వేరే డిష్ లోకి తీసుకోవాలి. అంతే కమ్మటి క్యాబేజీ ఆవపెట్టిన కూర రెడీ.   

                    

15.2.14

చాక్లెట్ హార్ట్ కుకీస్

చాక్లెట్ హార్ట్ కుకీస్ 

కావలసిన పదార్థాలు 
వెన్న -- 100 గ్రా
మైదా -- 200 గ్రా
పంచదార -- 100 గ్రా

తయారీ విధానం 
ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకొని, అందులో వెన్న, పంచదార వేసి బాగా కలపాలి. తరవాత మైదా వేసి, మళ్ళీ మిశ్రమం అంతా బాగా కలిసేటట్టు కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమం మీద మూతపెట్టి 15 నిముషాలు ఫ్రిజ్ లో ఉంచాలి. ఫ్రిజ్ నుండి బయటకు తీసాక, పిండిని చిన్నచిన్న ఉండలుగా చేసుకొని, చపాతీలాగ వత్తుకొని, హృదయాకారపు నమూనాలతో కట్ చేసుకోవాలి.  వీటి పైన ఇష్టమున్నవారు బాదాం, జీడిపప్పు చిన్నముక్కలుగా చేసుకొని అలంకరించుకోవచ్చును. ఈ కుకీస్ ను నెయ్యిరాసి ఉంచుకున్న బేకింగ్ ట్రేలో ఉంచి, 200 డిగ్రీల సెంటీగ్రేడు వద్ద, 10 నిముషాలు ఉంచి బేక్ చేసుకోవాలి. బేక్ అయ్యిన తరవాత, బయటకు తీసి వాటికి చాక్లెట్ క్రీమ్ తో అందంగా అలంకరించుకుంటే చాలా బావుంటాయి. అంతే తియ్యటి లవ్లీ చాక్లెట్ హార్ట్ కుకీస్ రెడీ.

               

2.2.14

మసాలా పరోటా

మసాలా పరోటా 

కావలసిన పదార్థాలు 
గోధుమపిండి - 1/4 కేజీ
మైదా - 1/4 కేజీ
శెనగపప్పు - 1/4 కేజీ
పాలు - 1/4 లీటరు
అల్లం - చిన్నముక్క
జీలకర్ర - 2 స్పూన్స్
మిరియాలు - 1 స్పూన్
కారం - 1 స్పూన్
గరంమసాలా - 1/2 స్పూన్
సన్నగా తరిగిపెట్టుకున్న కొత్తిమీర - 1/2 కప్పు
నెయ్యి - 100 గ్రా
ఉప్పు - రుచికిసరిపడినంత

తయారుచేయు విధానం
ముందుగా ఒక బేసిన తీసుకొని అందులో గోధుమపిండి, మైదాపిండి, పాలు, ఉప్పు అన్నీ వేసి తగినంత నీరు పోస్తూ చపాతీపిండిలాగా మృదువుగా కలుపుకోవాలి. చివరిగా నూనె వేసి కలిపి, ఆ పిండిపైన తడిబట్ట కప్పి, అరగంట సేపు పక్కన ఉంచుకోవాలి. ఈలోగా స్టవ్ వెలిగించి, ఒక చిన్న కుక్కర్ తీసుకొని, అందులో శెనగపప్పును వేసి, బాగా మెత్తగా ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాణలి తీసుకొని, అందులో జీలకర్ర, మిరియాలు సన్ననిమంటపై వేయించి తీసి, మిక్సీ లో మెత్తగా పొడిగా చేసుకొని, ఆ పొడిని, దంచిపెట్టుకున్న అల్లం ముక్కల్ని, కొత్తిమీర, కారం, ఉప్పు,  గరంమసాలా పొడిని అన్నీ పప్పులో వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.                

పిండి నానినతరవాత, చిన్నచిన్న ఉండలుగా చేసుకొని, చపాతీలాగా వత్తుకొని, దానిమీద పప్పు మిశ్రమాన్ని కొంచెం ఉంచి, మూసేసి, చపాతీని నాలుగు మడతలు వేసి, మళ్ళీ మెల్లగా వత్తాలి. అలా అన్నీ వత్తి పక్కన పెట్టుకొని, స్టవ్ వెలిగించి, పెనం పెట్టి, ఒక్కొక్కటిగా పరోటాలను  నేతితో కాల్చుకోవాలి. అంతే కమ్మని రుచికరమైన మసాలా పరోటా రెడీ. ఇష్టమైన వారు నచ్చిన కూరలతో, సాస్ లతో  తినవచ్చును.

                     

9.1.14

Patoni ..... పాటోణి.... (పాటోళి)

Patoni ..... పాటోణి ---- (పాటోళి)

కావలసిన పదార్థాలు 
కందిపప్పు - 1 కప్పు
శెనగపప్పు - 1 కప్పు
పెసరపప్పు - 1 కప్పు
పోపుదినుసులు -- కొంచెం
ఉప్పు - రుచికి సరిపడినంత
పసుపు - చిటికెడు
కరివేపాకు - 4 రెబ్బలు
అల్లం - చిన్నముక్క
పచ్చిమిర్చి -  4
ఎండుమిర్చి - 2
నూనె - 1 కప్పు


తయారీవిధానం 
ముందుగా 3 రకాల పప్పులను 1 గంట ముందు నానబెట్టుకోవాలి. నానిన పప్పులను, అల్లం, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఉప్పు వేసి మిక్సీలో మరీ మెత్తగా కాకుండా. గట్టిగా కాకుండా మధ్యలో (కొంచెం బరకగా) రుబ్బుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి, బాణలి పెట్టి, నూనె వేసి, పోపుదినుసులు, కరివేపాకు, పసుపు వేసి, వేగాక ముందుగా రుబ్బి ఉంచుకున్న పప్పుల పిండిని వెయ్యాలి. పిండి బాగా పొడిపొడిగా అయ్యేవరకు వేయించుకోవాలి. సుమారుగా 30 నిముషాలు పడుతుంది. పిండి పొడిగా అయ్యాక దించి వేరే డిష్ లోకి తీసుకోవాలి. అంతే కమ్మని రుచికరమైన పాటోణి (పాటోళి) రెడీ. (ఇష్టమైనవారు ఇంగువ --- ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చును).           




7.1.14

Bangaladumpa Bajjeelu ---- బంగాళదుంపల బజ్జీలు

Bangaladumpa Bajjeelu ---- బంగాళదుంపల బజ్జీలు

Vaamaaku Bajjeelu --- వామాకు బజ్జీలు

Vaamaaku Bajjeelu ---  వామాకు బజ్జీలు


తోటకూర పిడప (పొడికూర)

తోటకూర పిడప (పొడికూర) 

కావలసిన పదార్థాలు 
తోటకూర -- 4 కట్టలు(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
పోపుదినుసులు -- కొంచెం
అల్లం -- చిన్నముక్క
పచ్చిమిర్చి -- 4
ఉప్పు -- రుచికి సరిపడినంత
నూనె -- 4 స్పూన్స్

తయారీవిధానం 
ముందుగా తోటకూరని సన్నగా తరిగి, వేడినీటిలో కొంచెం ఉప్పువేసి బాగా కడిగి నీరు ఒంపి పక్కన ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించి బాణలి పెట్టి, నూనెవేసి కాగాక, పోపుదినుసులు, అల్లం - పచ్చిమిర్చి వేసి, వేగాక తోటకూర - ఉప్పు వేసి బాగా కలపాలి. స్టవ్ ని హైలోనే ఉంచితే 10 నిముషాలు ఉంచితే, నీరు అంతా పోతుంది. మరొక్క 5 నిముషాలు స్టవ్ ని సిమ్ లో ఉంచితే కూర పొడిపొడిగా వస్తుంది. అంతే తోటకూర పిడప రెడీ. ఇష్టమైనవారు మినప ఒడియాలు పోపులో వేసుకోవచ్చును.


5.1.14

రవ్వ పులిహొర

రవ్వ  పులిహొర 

కావలసిన పదార్థాలు:--
బియ్యపు రవ్వ -- 2 కప్పులు
నిమ్మకాయ --1
పచ్చిమిర్చి-- 6
ఉప్పు--రుచికి తగినంత
పసుపు-- 1 స్పూన్
కరివేపాకు -- 4 రెబ్బలు
వేరుశెనగగుళ్ళు -- 1/4 కప్పు
పోపు దినుసులు -- (సెనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి-4, ఇంగువ) కరివేపాకు
నూనె-- 50 గ్రాములు

తయారుచేయు విధానం:--
ముందుగా  స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో 4 కప్పులు నీళ్ళు పోసుకొని, మరిగిన తరవాత బియ్యపురవ్వని వేసి, 2 స్పూన్స్ నూనె వేసి ఉడికించి ఒక పళ్ళెంలోకి తీసి ఉంచుకోవాలి. ఉప్పు, పసుపు,  కొంచెం నూనె వేసుకొని.....కలుపుకోవాలి..ఇప్పుడు స్టవ్ వెలిగించి, బాణలి పెట్టి,నూనె వేసి పోపుదినుసులు, వేరుశెనగగుళ్ళు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి వేయించి.....ఉడికించి పక్కన పెట్టుకున్న రవ్వపైన వేసి కలుపుకోవాలి, నిమ్మరసాన్ని కూడా వేసి  ....పోపు అంతా రవ్వ మిశ్రమానికి బాగా కలిసేలా కలుపుకోవాలి.....  అంతే రవ్వ పులిహొర రెడీ.....


సేమ్యా పులిహోర

సేమ్యా  పులిహోర

కావలసిన పదార్థాలు
సేమ్యా – 1/4 కేజీ
నిమ్మచెక్కలు  – 3
పచ్చిమిరపకాయలు – 4
జీడిపప్పు -- 1/4 కప్పు
కరివేపాకు -4 రెబ్బలు
పోపుదినుసులు -- కొంచెం
ఎండుమిర్చి -- 3
ఇంగువ -- కొంచెం
పసుపు – చిటికెడు
ఉప్పు – తగినంత
నూనె – 1/4 కప్పు

తయారీవిధానం
ముందుగా స్టవ్ వెలిగించి ఒక పెద్ద గిన్నెతీసుకొని, అందులో నాలుగు గ్లాసుల నీళ్లు పోసి మరిగించాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు సేమ్యా వేసి 5 నిమిషాలు ఉఢకనివ్వాలి. తర్వాత సేమ్యాను చిల్లుల బేసేనలో వేయ్యాలి. సేమ్యా మీద వెంటనే చల్లటినీళ్లు పోయాలి. దీనివల్ల సేమ్యా మరింత ఉడికి మెత్తబడకుండా విడివిడిగా అంటుకోకుండా ఉంటుంది. నీరంతా పోయినతర్వాత ఒక పళ్ళెంలో వేసి,  తగినంత ఉప్పు, నిమ్మరసం, పసుపు  వేసి కలిపి పెట్టాలి. బాణలిలో నూనె వేడి చేసి పోపుదినుసులు వేసి, జీడిపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, చిటికెడు పసుపు వేసి,  బాగా వేయించి ఉడికించి పక్కన పెట్టుకున్న సేమ్యాలో వేసి కలియబెట్టాలి. అంతే పుల్లపుల్లగా సేమ్యాపులిహోర రెడీ.


ఆవ పులిహోర

ఆవ పులిహోర

కావలసిన పదార్థాలు
పొడిపొడిగా వండిన అన్నం -- 4 కప్పులు 
చింతపండు గుజ్జు -- పావు కప్పు
అల్లం ముక్కలు -- 5 స్పూన్స్ 
పచ్చిమిర్చి -- 6(నిలువుగా చీల్చి ఉంచుకోవాలి)
ఎండుమిర్చి -- 3
పోపుదినుసులు --  తగినన్ని(మినప్పప్పు , శెనగపప్పు , ఆవాలు, కొంచెంగా మెంతులు )
వేరుశెనగ పప్పు (గుళ్ళు) -- పావుకప్పు 
కరివేపాకు రెబ్బలు -- కొద్దిగా 
పసుపు & ఉప్పు --  రుచికి తగినంత  
ఇంగువ -- 1/2 స్పూన్ (ఇష్టమైతే మరికొంచెం వేసుకోవచ్చును)
నూనె -- 1 కప్పు
ఆవముద్ద --  (ఆవముద్ద తయారుచేయు విధానం:::2 స్పూన్స్ సెనగపప్పు, 3 స్పూన్స్ నూలుపప్పు, 2స్పూన్స్ ఆవాలు, 3 పచ్చిమిర్చి......ఇవి అన్ని కలిపి 1 గంట నానపెట్టి రుబ్బుకుంటే ఆవముద్ద రెడీ అవుతుంది)

తయారీవిధానం
ముందుగా స్టవ్ వెలిగించుకొని, బాణలి పెట్టి, కొద్దిగా నూనె వేసి చింతపండుగుజ్జులో కొద్దిగా ఉప్పు, పసుపు వేసి చింతపండు దగ్గరపడేవరకు మగ్గించి, పక్కనపెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ బాణలి పెట్టి నూనెవేసి, పోపుదినుసులు, వేరుశెనగగుళ్ళు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు,  ఎండుమిర్చి, ఇంగువ, అన్నీ వేసి బాగా వేగాక కొంచెం పోపును తీసి పక్కన పెట్టుకోవాలి, మిగిలిన పోపులో మగ్గించి పక్కనపెట్టుకున్న చింతపండుగుజ్జును వేసి, 5 నిముషాలు ఉంచి, దించి ఒక బేసనలో ఉంచుకొన్న అన్నం మీద పోపుని  వేసి బాగా కలియబెట్టాలి. చివరగా రుబ్బి ఉంచుకున్న ఆవముద్దని వేసి బాగా కలపాలి.   అంతా కలిసాక పైన మిగిలిన నూనెను వేసి మరొక్కసారి కలపాలి.  అంతే కమ్మని వాసనగల ఆవపులిహోర రెడీ.


చింతకాయ పులిహొర

చింతకాయ  పులిహొర 

కావలసిన పదార్థాలు:--
అన్నం-- 10 కప్పులు
చింతకాయలు -- 10
పచ్చిమిర్చి-- 6
వేరుసెనగ గుళ్ళు--1 కప్పు
ఉప్పు--రుచికి తగినంత
పసుపు-- 1 స్పూన్
కరివేపాకు -- 4 రెబ్బలు
నూలుపొడి -- 1 కప్పు
పోపు దినుసులు(సెనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి-4 ఇంగువ) కరివేపాకు
నూనె-- 100 గ్రాములు

తయారుచేయు విధానం:--
ముందుగా  స్టవ్ వెలిగించి, బాణలి పెట్టి, చింతకాయలని తరిగి, ఉడికించి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన బాణలి పెట్టి,  నూనె వేసి,  పోపుదినుసులు, వేరుసెనగ గుళ్ళు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి, ఉడికించి పక్కన పెట్టుకున్న చింతకాయ గుజ్జుని వడకట్టి పోపులో వేసి వేయించి, వండి ఉంచుకున్న అన్నం పైన పోపుని వేసి ..... ఉప్పు, పసుపు, కొంచెం నూనె వేసుకొని కలుపుకోవాలి..అన్నీ అన్నానికి బాగా కలిసేలా చూసుకోవాలి.... చింతకాయ పులిహోర మీద  నూలుపొడి వేసి కలుపుకోవాలి.  అంతే పుల్లపుల్లని చింతకాయ పులిహొర రెడీ.....


మామిడికాయ పులిహొర

మామిడికాయ  పులిహొర 

కావలసిన పదార్థాలు:--
అన్నం-- 10 కప్పులు
పుల్లని మామిడికాయలు -- 2 (సన్నగా కోరి ఉంచుకోవాలి)
పచ్చిమిర్చి-- 6
వేరుసెనగ గుళ్ళు--1 కప్పు
ఉప్పు--రుచికి తగినంత
పసుపు-- 1 స్పూన్
కరివేపాకు -- 4 రెబ్బలు
జీడిపప్పు -- 1 కప్పు
పోపు దినుసులు(సెనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి-4 ఇంగువ) కరివేపాకు
నూనె-- 100 గ్రాములు

తయారుచేయు విధానం:--
ముందుగా  స్టవ్ వెలిగించి, బాణలి పెట్టి, నూనె వేసి పోపుదినుసులు, వేరుసెనగ గుళ్ళు, పచ్చిమిర్చి,  జీడిపప్పు,  కరివేపాకు వేసి, మామిడి తరుగు(కోరు)ని కూడా వేసి వేయించి, వండి ఉంచుకున్న అన్నం పైన పోపుని వేసి ..... ఉప్పు, పసుపు, కొంచెం నూనె వేసుకొని కలుపుకోవాలి..అన్నీ అన్నానికి బాగా కలిసేలా కలుపుకోవాలి..... మామిడి పులిహోర మీద  నూలుపొడి వేసి కలుపుకోవాలి.  అంతే పుల్లపుల్లని మామిడికాయ పులిహొర రెడీ.....


ఉసిరికాయ పులిహొర

ఉసిరికాయ పులిహొర 

కావలసిన పదార్థాలు:--
అన్నం-- 4 కప్పులు
పెద్ద ఉసిరికాయలు -- 6 (సన్నగా కోరి ఉంచుకోవాలి)
పచ్చిమిర్చి-- 6
వేరుసెనగ గుళ్ళు--1 కప్పు
ఉప్పు--రుచికి తగినంత
పసుపు-- 1 స్పూన్
కరివేపాకు -- 4 రెబ్బలు
నూలుపొడి -- 1 కప్పు
జీడిపప్పు -- 1 కప్పు
పోపు దినుసులు(సెనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి-2, ఇంగువ) కరివేపాకు
నూనె-- 100 గ్రాములు

తయారుచేయు విధానం:--
ముందుగా ఒక పళ్ళెంలోకి అన్నం తీసుకొని, ఉప్పు, పసుపు, కొంచెం నూనె వేసుకొని.....కలుపుకోవాలి..ఇప్పుడు స్టవ్ వెలిగించి, బాణలి పెట్టి,నూనె వేసి పోపుదినుసులు, వేరుసెనగ గుళ్ళు, పచ్చిమిర్చి,  జీడిపప్పు,  కరివేపాకు వేసి, ఉసిరికాయల తరుగు(కోరు)ని కూడా వేసి వేయించి,.....అన్నం పైన వేసి కలుపుకోవాలి....పోపు అంతా అన్నానికి కలిసేలా కలుపుకోవాలి..... ఉసిరి పులిహోర మీద  నూలుపొడి వేసి కలుపుకోవాలి.  అంతే పుల్లపుల్లని ఉసిరికాయ పులిహొర రెడీ.....ఇష్టమైనవారు కొత్తిమీరని వేసుకోవచ్చును.



నారింజకాయ పులిహొర

నారింజకాయ పులిహొర 

కావలసిన పదార్థాలు:--
అన్నం-- 8 కప్పులు
నారింజకాయ --1
పచ్చిమిర్చి-- 6
వేరుసెనగ గుళ్ళు--1 కప్పు
ఉప్పు--రుచికి తగినంత
పసుపు-- 1 స్పూన్
కరివేపాకు -- 4 రెబ్బలు
నూలుపొడి -- 1 కప్పు
జీడిపప్పు -- 1 కప్పు
పోపు దినుసులు(సెనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి-4, ఇంగువ) కరివేపాకు
నూనె-- 50 గ్రాములు

తయారుచేయు విధానం:--
ముందుగా ఒక పళ్ళెంలోకి అన్నం తీసుకొని, ఉప్పు, పసుపు, నారింజ రసం, కొంచెం నూనె వేసుకొని.....కలుపుకోవాలి..ఇప్పుడు స్టవ్ వెలిగించి, బాణలి పెట్టి,నూనె వేసి పోపుదినుసులు, వేరుసెనగ గుళ్ళు, పచ్చిమిర్చి,  జీడిపప్పు,  కరివేపాకు వేసి వేయించి.....అన్నం పైన వేసి కలుపుకోవాలి....పోపు అంతా అన్నానికి కలిసేలా కలుపుకోవాలి..... నారింజ పులిహోర మీద  నూలుపొడి వేసి కలుపుకోవాలి.  అంతే పుల్లపుల్లని నారింజకాయ పులిహొర రెడీ.....ఇష్టమైనవారు కొత్తిమీరని వేసుకోవచ్చును.


దబ్బకాయి పులిహొర

దబ్బకాయ పులిహొర 

కావలసిన పదార్థాలు:--
అన్నం-- 8 కప్పులు
దబ్బకాయ --1
పచ్చిమిర్చి-- 6
వేరుసెనగ గుళ్ళు--1 కప్పు
ఉప్పు--రుచికి తగినంత
పసుపు-- 1 స్పూన్
కరివేపాకు -- 4 రెబ్బలు
నూలుపొడి -- 1 కప్పు
పోపు దినుసులు(సెనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి-4, ఇంగువ) కరివేపాకు
నూనె-- 50 గ్రాములు

తయారుచేయు విధానం:--
ముందుగా ఒక పళ్ళెంలోకి అన్నం తీసుకొని, ఉప్పు, పసుపు, దబ్బ రసం, కొంచెం నూనె వేసుకొని.....కలుపుకోవాలి..ఇప్పుడు స్టవ్ వెలిగించి, బాణలి పెట్టి,నూనె వేసి పోపుదినుసులు, వేరుసెనగ గుళ్ళు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించి.....అన్నం పైన వేసి కలుపుకోవాలి....పోపు అంతా అన్నానికి కలిసేలా కలుపుకోవాలి..... పులిహోర మీద  నూలుపొడి వేసి కలుపుకోవాలి.  అంతే పుల్లపుల్లని దబ్బ పులిహొర రెడీ.....