7.4.17

రైస్ బాల్స్

రైస్ బాల్స్ 
రోజూ తినే రకాలే తినమంటే పిల్లలు మారాం చేస్తారుగా. అందుకే వాళ్ళకి వెరైటీ వంటకాలు రుచి చూపించండి. ఈరోజు మనం రైస్ బాల్స్ ఎలా తయారుచెయ్యాలో నేర్చుకుందాం. 

కావలసిన పదార్థాలు 
బియ్యం పిండి - 1 కప్పు 
నీరు - 3 కప్పులు 
ఉప్పు - 1/4 స్పూన్ 
కారం - 1/2 స్పూన్ 
పోపు దినుసులు 
మినప్పప్పు - 1 స్పూన్ 
శెనగపప్పు - 1 స్పూన్ 
ఆవాలు - 1/4 స్పూన్ 
జీలకర్ర - 1/4 స్పూన్ 
ఎండుమిర్చి - 2
కరివేపాకు - 2 రెబ్బలు 

తయారుచేయు విధానం 
ముందుగా స్టవ్ వెలిగించి ఒక వెడల్పాటి గిన్నెను పెట్టి 3 కప్పుల నీటిని పోసి అందులో ఉప్పు, కారం వేసుకోవాలి. నీరు బాగా మసలిన తరవాత పిండిని వేస్తూ ఉండలు కట్టకుండా తిప్పుకోవాలి. పిండి బాగా కలసిన తరవాత స్టవ్ పై నుండి దించి పక్కన ఉంచి చల్లారనివ్వాలి.  చల్లారిన తరవాత చేతికి నూనె రాసుకొని పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. పిండి అంతా ఉండలుగా చేసుకుని ఒక వెడల్పాటి గిన్నెలో వేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇడ్లీ పాత్ర పెట్టి, అడుగున నీరు పోసి, ఇడ్లీ ప్లేట్లు తీసుకొని ఆ ప్లేట్లలో పిండి ఉండలని ఉంచి పాత్రని మూత పెట్టి 10 నిముషాలు ఆవిరి పట్టించాలి. లేదా కుక్కర్ లో అడుగున నీరు పోసి ఒక ఖాళీ బౌల్ ని ఉంచి దానిపైన ఉండలు ఉన్న వెడల్పాటి గిన్నెను ఉంచి కుక్కరు మూత పెట్టి విజిల్ పెట్టకుండా 10 ఆవిరి పెట్టాలి. 10 నిమిషాల తరవాత ఆ ఉండాలని తీసి పక్కన వేరే పాత్రలో ఉంచి చల్లారబెట్టాలి.      

ఈలోగా స్టవ్ వెలిగించి బాణలి పెట్టి నూనె పోసి పోపు దినుసులు అన్నీ ఒకదాని తరవాత మరొకటి వేసి చిటపటలాడాక ఇంగువ, కరివేపాకు వేసి పక్కనే ఉంచుకున్న ఆవిరి పెట్టిన ఉండలని(రైస్ బాల్స్ ని) ఆ పోపులో వెయ్యాలి. బాణలిపై మూతపెట్టి ఆ పోపు అంతా రైస్ బాల్స్ కి బాగా పట్టేంతవరకు స్టవ్ మంటని తగ్గించి ఉంచాలి. 5 నిమిషాల తరవాత బాల్స్ ని మరొకసారి బాగా కలిపి స్టవ్ పై నుండి దించి పిల్లలకి వేడి వేడిగా ప్లేట్లో వేసి ఇచ్చెయ్యటమే. వీటికి చట్నీతో పని లేదు. పిల్లలు పేచీ పెడితే ఏదైనా సాస్ వేసి ఇవ్వొచ్చును. అంతే రుచికరంగా ఉండే రైస్ బాల్స్ రెడీ. ఇంకెందుకు ఆలస్యం మీరు ట్రై చెయ్యండి.                            


1 comment: