13.1.15

అరిసలు

అరిసలు


కావలసిన పదార్థాలు  
బియ్యం - 1కేజీ 
బెల్లం తరుము -1/2 కేజీ 
నువ్వులపప్పు -  100 గ్రా 
నీరు - 1 కప్పు (తగినంత) 
యాలకుల పొడి -  2 స్పూన్స్ 
నెయ్యి - 2 స్పూన్స్ 
నూనె - వేయించడానికి సరిపడా (దగ్గరదగ్గర 1/2 కేజీ)  

తయారీ విధానం 
అరిసలు చేయటానికి 12 గంటల ముందుగా బియ్యాన్ని బాగా కడిగి నానబెట్టాలి. తరవాత కడిగి, నీరు వంపి నీడలో ఆరబెట్టాలి. బియ్యం తడి పొడిగా ఉండగానే మిల్లు (మర) పట్టించాలి. పిండి తడి ఆరకుండానే అరిసలు చేసుకోవాలి. నువ్వులపప్పును కడిగి ఆరబెట్టి ఉంచుకోవాలి. 

అన్నీ సిద్ధం చేసుకొని స్టవ్ వెలిగించాలి. ఒక మందపాటి గిన్నెను స్టవ్ మీద పెట్టి, బెల్లం  కొంచెం మునిగే వరకు నీరు పోసి ముదురపాకం అంటే ఉండపాకం వచ్చేవరకు గరిటతో తిప్పుతూ ఉండాలి. ఒక పళ్ళెంలో కొద్దిగా నీరు పోసి పాకాన్ని వేస్తే, పాకం ఉండకట్టాలి. ఇప్పుడు ఈ పాకంలో నువ్వులపప్పు, నెయ్యి, యాలకులపొడిని వేసి, అప్పుడు బియ్యం పిండిని పోస్తూ గరిటతో బాగా కలపాలి. మొత్తం పాకంలో పిండి సరిపోయి, ముద్దగా తయారవ్వాలి అన్నమాట. ఇప్పుడు అరిసల పిండి గిన్నెను పక్కకు తీసి, స్టవ్ పైన బాణలి (మూకుడు) పెట్టి నూనె పోసి, మరిగే లోపల అరిసెల పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని, ప్లాస్టిక్ కవరు పైన వత్తుకొని, ఉంచుకోవాలి. నూనెని స్టవ్ మీద, చిన్నమంటలోనే ఉంచాలి, నూనె కాగిన తరవాత ఒక్కొక్కటిగా అరిసెలను వేసుకొని, వేయించుకోవాలి, రెండువైపులా బంగారు రంగు వచ్చేవరకు వేయించుకొని, తీసిపక్కన ఉంచుకోవాలి. 

తీసిన అరిసెలని ఒక పీటపైన ఉంచి, రొట్టెలకర్రతో గట్టిగా వత్తితే నూనె అంతా బయటకి వచ్చేస్తుంది. అనంతరం వాటిని బాగా ఆరబెట్టి గాలిచొరబడని డబ్బాలో ఉంచితే, ఒకనెలరోజుల పాటు నిల్వ ఉంటాయి. అంతే చాలా సులువుగా చేసుకొనే కమ్మని, తియ్యని పిండివంట రెడీ.  

                       

26.12.14

ఇంట్లోనే తయారుచేసుకునే పిజ్జా

(ఇంట్లోనే తయారుచేసుకునే) పిజ్జా 
కావలసిన పదార్థాలు 
మైదా - 1 కప్పు 
ఈస్ట్ - 2 స్పూన్స్ 
వంటషోడా - 1/2 స్పూన్ 
క్యాప్సికం - 1 (చిన్న ముక్కలు తరిగి ఉంచుకోవాలి) 
టమాటాలు - 3 (చక్రాలుగా తరిగి ఉంచుకోవాలి)
టమాటా సాస్ & వెన్న - (మన ఇష్టానికి తగినంత వేసుకోవచ్చును)
పన్నీరు తురుము - 1/4 కప్పు 

తయారీ విధానం 
ముందుగా స్టవ్ వెలిగించి, ఒక చిన్న గిన్నెలోకి కొంచెం నీరు తీసుకొని వేడిచేయాలి. నీరు వేడెక్కే లోపల ఒక బేసిన్ లోకి ఈస్ట్ & వంటషోడ తెసుకొని, కొద్దిగా చల్లని నీరు జల్లి కలిపి, ఆ మిశ్రమానికి మైదాపిండిని చేర్చి,  గోరువెచ్చని నీరు కలిపి చపాతీ పిండిలాగా ముద్దగా కలుపుకొని, 10 నిముషాలు పక్కన పెట్టాలి. ఇప్పుడు మళ్ళీ పిండిని మరొకసారి బాగా కలిపి, అర అంగుళం మందంలో గుండ్రంగా చపాతీలాగా చేతితో వత్తుకోవాలి. ఇప్పుడు పిజ్జా బేస్ తయారయ్యిందన్నమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించి, సన్నని మంటపై పెనం (pan) పెట్టి, పెనానికి కొద్దిగా వెన్నరాసి, తయారుచేసి ఉంచుకున్న పిజ్జా బేస్ ని ఉంచి మూతపెట్టాలి. బేస్ కాలే లోపల ... సన్నగా తరిగి ఉంచుకున్న క్యాప్సికం ముక్కలు & టమాటా ముక్కలు వేరే స్టవ్ వెలిగించి, బాణలిలో వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. కొద్దిసేపటికి పిండి బాగా కాలి ఉబ్బుతుంది. (ఉడుకుతుంది). ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న టమాటా & క్యాప్సికం ముక్కల మిశ్రమాన్ని బేస్ పైన వేసి, టమాటా సాస్, వెన్న, పన్నీరు తురుము వేసి మరికొద్దిసేపు ఉంచాలి. 10 నిముషాలు అయ్యాక ముక్కలుగా కోసుకొని, స్టవ్ ని ఆపెయ్యాలి. అంతే పిల్లలు - పెద్దలు ఎంతో ఇష్టపడే వేడివేడి రుచికరమైన పిజ్జా రెడీ. టమాటా సాస్ తో సర్వ్ చేసి తినేయ్యటమే...... 
                                

3.8.14

కొబ్బరి - శెనగపప్పు కూర

కొబ్బరి - శెనగపప్పు కూర

కావలసిన పదార్థాలు
శెనగపప్పు – 2 కప్పులు
కొబ్బరి కోరు(పొడి) – ౪ కప్పులు
పోపుదినుసులు – కొంచెం(మినప్పప్పు, ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువ)    
పసుపు – చిటికెడు
ఉప్పు – రుచికి తగినంత
కారం – 1 స్పూను
వెల్లుల్లి రెబ్బలు – 2
కరివేపాకు – 2 రెబ్బలు
నూనె – 50గ్రా 

తయారుచేయు విధానం:-

ముందుగా స్టవ్ వెలిగించి ఒక కుక్కరులో శెనగపప్పును కొంచెం మెత్తగా ఉడికించుకోవాలి. ఉడికినపప్పును కుక్కరులోనుండి తీసి, నీరు వంచి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి, బాణలిపెట్టి, నూనె వేసి, పోపుదినుసులు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, వేసి వేగిన తరవాత, కొబ్బరికోరును వేసి, పచ్చిదనం పోయేవరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో ఉడికించి పక్కనపెట్టుకున్న శెనగపప్పును వేసి, ఉప్పు, కారం, పసుపు అన్నీవేసి, బాగా కలిపి, 5నిముషాలు ఉంచి దించుకోవాలి. అంతే కమ్మని కొబ్బరి - శెనగపప్పు కూర రెడీ.  

25.7.14

మసాలా బటూరా

మసాలా బటూరా

కావలసిన పదార్థాలు

గోధుమపిండి - 1 కప్పు
మైదాపిండి - 1 కప్పు
పెరుగు - 3 కప్పులు
నెయ్యి - 1 స్పూన్
షోడా - 1 చిన్న స్పూన్
వేడి నీరు - కొంచెం
ఉప్పు - రుచికి తగినంత
నెయ్యి లేదా నూనె - 200 గ్రా
ఉల్లిపాయ తరుగు - 1/2 కప్పు
పచ్చిమిర్చి తరుగు - 2 స్పూన్స్
కొత్తిమీర తరుగు - 2 స్పూన్స్
గరంమసాలా పొడి - 1 స్పూన్

తయారీవిధానం
ఒక బౌల్ లో గోధుమ & మైదా పిండ్లు, షోడా, నెయ్యి, పంచదార, పెరుగు, వేడినీరు, అన్నీ వేసి బాగా కలిపి, 6 గంటలు నానబెట్టాలి. ఇది సాదా బటూరా చేసే విధానం.

మసాలా బటూరాకి గోధుమ, మైదా పిండులు, షోడా, నెయ్యి, పంచదార, పచ్చిమిర్చి, ఉల్లితరుగు, కొత్తిమీర, గరం మసాల అన్నీ కలిపి వేడినీరు పోస్తూ పిండిని బాగా మదాయిస్తూ కలిపి, తడిబట్ట కప్పి 6 గంటలు నాన్నబెట్టాలి. పిండి నానిన తరవాత, చిన్న - చిన్న ఉండలుగా చేసుకొని పూరీ లాగానే బటూరాని వత్తుకోవాలి. నూనెలో బంగారు రంగు వచ్చేవరకు వేయించి తీయాలి. బటూరలని ఆలూ, శనగల కూరలతో వడ్డిస్తే చాలా రుచిగా ఉంటుంది.

(సాదా బటూరల మాదిరిగానే పిండిని కలుపుతూ, అందులో 3 స్పూన్స్ పంచదార, యాలకులపొడి కలిపి..... బటూర వత్తితే అవి తీపి బటూరాలు అవుతాయి :) )

                            

19.5.14

ఆవకాయ

(పెద్ద) ఆవకాయ {సంవత్సర కాలం నిల్వ ఉండే ఆవకాయ}


కావలసిన పదార్థాలు 
పెద్ద మామిడికాయలు - 15
ఆవగుండ - 4 పావులు (1 కేజీ)
కారం - 3 పావులు 
ఉప్పు - 2 పావులు 
నూనె - 1 కేజీ (వేరుశెనగ నూనె ఐతే బావుంటుంది.... నువ్వులనూనెను కూడా వాడవచ్చును)
పసుపు - 1 స్పూన్ 
మెంతులు - 2 స్పూన్స్ 
ఇంగువ - 6 స్పూన్స్ 


తయారుచేయు విధానం:-
ముందుగా ఆవగుండా, కారం, ఉప్పు, పసుపు, మెంతులు, ఇంగువ అన్నీ కలిపి ఒక పెద్ద బేసిన లేదా టబ్ లో కలిపి ఉంచుకోవాలి. ముందుగా మామిడికాయలని తడిబట్టతో బాగా తుడిచి, ఆరిపోయాక నాలుగు ముక్కలుగా చేసుకొని, ఒక్కొక్క ముక్కని మూడు లేదా నాలుగు ముక్కలుగా కోసుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపి ఉంచుకున్న ఆవగుండ మిశ్రమంలో ముక్కలను కొద్ది -కొద్దిగా వేస్తూ, నూనె వేసి కలపుకుంటూ ..... పక్కనే కడిగి, తుడిచి ఉంచుకున్న జాడీలో వేస్తూ ఉండాలి. అంతే ---- కమ్మని, ఎర్రని, నోరూరించే కొత్తఆవకాయ రెడీ. 

         

ముఖ్యసూచన:-- ఆవకాయ మరియు ఉరగాయ పచ్చళ్ళు ఏవైనాసరే జాడీలు, సీసాలులోనే దాచి (నిల్వ) ఉంచాలి. ప్లాస్టిక్ సీసాలు, డబ్బాలు వంటి వాటిల్లో ఉంచితే నిలువ & ప్లాస్టిక్ వాసనవచ్చి ఎక్కువరోజులు నిలవ ఉండదు.