9.8.13

క్యాబేజీ రోల్స్

క్యాబేజీ రోల్స్----

కావలసిన పదార్థాలు:--

శెనగపిండి -- 3 కప్పులు
వారిపిండి -- 1 కప్పు
క్యాబేజీ ఆకులు -- 12పెద్దవి
బంగాళదుంపలు -- 1/2 కేజీ
కొత్తిమీర తరుగు -- 1/2 కప్పు
గరంమసాలా పొడి -- 1 స్పూన్
అల్లం & పచ్చిమిర్చి పేస్టు -- 2 స్పూన్స్
ఉప్పు & పసుపు -- తగినంత
వంటషోడా -- చిటికెడు
నూనె -- 1/2 కేజీ

 తయారీ విధానం:--

ముందుగా శెనగపిండి, వరిపిండి, ఉప్పు, వంటషోడా అన్నీ కలిపి బజ్జీలపిండిలాగా కొంచెం జారుగా కలిపి పక్కన ఉంచుకోవాలి. క్యాబేజీ ఆకులను శుభ్రంగా తుడిచి ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి, ఒక కుక్కర్లో బంగాళదుంపల్ని ఉడికించి పక్కనపెట్టుకోవాలి. దుంపలకి తొక్కతీసి, మెత్తగా చిదిమి, దానిలో అల్లం & పచ్చిమిర్చి పేస్టు, గరంమసాలా, ఉప్పు, పసుపు, కొత్తిమీర తరుగు అన్నీ వేసి, బాగా కలిపి, ఒక క్యాబేజీ ఆకులో ఈ పిండి మిశ్రమాన్ని వేసి, రోల్ లాగా చుట్టుకొని, ఆకు ఊడిపోకుండా, చివరన tooth pin ని గుచ్చి ఉంచాలి. అన్ని రోల్స్ ని ఇలాగే రెడీ చేసుకొని, స్టవ్ వెలిగించి, బాణలిపెట్టి, నూనె వేసి, కాగిన తరవాత ఒక్కొక్క రోల్ ని ముందుగా కలిపి ఉంచుకున్న శెనగపిండిలో ముంచి,  ఒక్కొక్కటిగా నూనెలో వేసి, దోరగా గోధుమ రంగు వచ్చేవరకు వేయించి, తీసి పక్కన పెట్టుకోవాలి. అంతే కరకరలాడే కమ్మని క్యాబేజీ రోల్స్ రెడీ. వీటిని ఇష్టముంటే టమాటా సాస్ తో తినొచ్చును.



    

21.7.13

మిక్సెడ్ వెజిటబుల్ కిచిడి

మిక్సెడ్ వెజిటబుల్ కిచిడి:--

కావలసిన పదార్థాలు:--

బియ్యం -- 2 కప్పులు 
పెసరపప్పు -- 1/23 కప్పు 
క్యారెట్ తురుము -- 1 కప్పు 
పాలకూర తురుము -- 2 కప్పులు 
పచ్చి బఠాణీ -- 1/2 కప్పు 
కాలిఫ్లోవేర్ -- 2 ముక్కలు 
బీన్స్ ముక్కలు -- 1కప్పు
క్యాప్సికం ముక్కలు -- 2 కప్పులు
ఉల్లిపాయ ముక్కలు -- 2 కప్పులు
అల్లం & పచ్చిమిర్చి పేస్టు -- 3 స్పూన్స్
కొత్తిమీర తురుము -- 4 స్పూన్స్
పసుపు -- చిటికెడు
ఉప్పు -- తగినంత
నూనె -- 1/2 కప్పు

తయారీ విధానం:--
బియ్యం, పప్పు కలిపి కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి, కుక్కర్ పెట్టి, నూనె వేసి, పైనచెప్పిన మసాలా దినిసులు వేసి వేయించి, వేగిన తరవాత అల్లం, మిర్చి పేస్టు వేసి, అన్నిరకాలకూరల ముక్కలు వేసి వేయించి, కొంచెం వేగిన తరవాత కడిగి పక్కనపెట్టుకున్న బియ్యం,పప్పుని వేసి, తగినంత ఉప్పు మరియు నీరు పోసి బాగా కలియపెట్టి కుక్కర్ మూతపెట్టి, విసిల్ పెట్టాలి. 4 కూతలు వచ్చిన తరవాత దించి పక్కనపెట్టుకోవాలి. మూత తీసిన తరవాత కొత్తిమీర వేసి కలుపుకోవాలి.... అంతే వేడి -- వేడి ఘుమఘుమలాడే మిక్సెడ్ వెజిటబుల్ కిచిడి రెడీ.





18.7.13

దద్ధోజనం

దద్ధోజనం 

కావలసిన పదార్థాలు:--
బియ్యం -- 4 కప్పులు 
పెసరపప్పు -- 1/2 కప్పు 
పెరుగు -- 5 కప్పులు 
అల్లం -- చిన్నముక్క 
కొత్తిమీర & కరివేపాకు -- కొంచెంగా 
ఉప్పు -- తగినంత 
పచ్చిమిర్చి -- 4 
పోపుసామను -- కొద్దిగా
నూనె -- కొంచెం

తయారీ విధానం:--
బియ్యం & పెసరపప్పు కలిపి కడిగి మామూలు కంటే కొంచెం ఎక్కువగా నీరు పోసి ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించి కడిగి ఉంచుకున్న బియ్యం & పప్పును ఉడికించుకోవాలి. పెరుగులో ఉప్పు, దంచిఉంచుకున్న అల్లాన్ని , చీల్చి ఉంచుకున్న పచిమిర్చిని వేసి కలుపుకోవాలి. సన్నగా తరిగి ఉంచుకున్న కొత్తిమీర & కరివేపాకు వేసి పోపు వేసి ఉంచుకోవాలి. ఉడికించి పక్కన పెట్టుకున్న అన్నం చల్లారక పెరుగులో కలుపుకోవాలి. 
ఇష్టమైనవారు ఇందులో జీడిపప్పు కూడా వేసుకోవచ్చును. అంతే కమ్మని దద్ధోజనం రెడీ. 





కట్టు పొంగలి

కట్టు పొంగలి 

కావలసిన పదార్థాలు:--
బియ్యం -- 2 కప్పులు 
పెసరపప్పు -- 1/2 కప్పు 
నెయ్యి -- 50 గ్రాములు 
మిరియాలు -- 2 స్పూన్స్ 
జీలకర్ర -- 1 స్పూన్ 
అల్లం -- చిన్నముక్క 
ఇంగువ -- కొంచెంగా 
ఉప్పు -- తగినంత
పసుపు -- చిటికెడు

తయారీ విధానం:--
ముందుగా మిరియాలు & జీలకర్ర పొడిచేసి ఉంచుకోవాలి. ముందుగా బియ్యం & పెసరపప్పు కలిపి కడిగి తగినంత నీరు పోసి, అల్లంముక్క మెత్తగా దంచి వేయ్యాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడిగిన బియ్యం, పప్పుని ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే స్టవ్ మీద బాణలి పెట్టి నెయ్యి వేసి, దంచి ఉంచుకున్న మిరియాలు, జీలకర్ర పొడి, ఇంగువ వేసి వేగిన తరవాత, ఉడికించి పక్కన పెట్టుకున్న అన్నాన్ని, తగినంత ఉప్పు & పసుపు వేసి బాగా కలియబెట్లి దించుకోవాలి. ఇష్టమైనవారు ఇందులో జీడిపప్పు కూడా వేసుకోవచ్చును.
అంతే వేడి వేడి కట్టుపొంగలి రెడీ.




11.7.13

రవ్వ ఇడ్లీ

రవ్వ ఇడ్లీ:--

కావలసిన పదార్థాలు:--
బొంబాయి రవ్వ -- 1/4 కేజీ 
అల్లం పేస్టు -- 1 స్పూన్ 
పచ్చిమిర్చి పేస్టు -- 2 స్పూన్స్ 
ఉప్పు -- రుచికి తగినంత
చిక్కటి పెరుగు -- 3 కప్పులు
కరివేపాకురెబ్బలు -- 4
పోపు సామాన్లు -- కొద్దిగా
నెయ్యి -- కొంచెంగా

తయారీ విధానం:--
ముందుగా స్టవ్ వెలిగించి, బాణలి పెట్టి, 2 స్పూన్స్ నెయ్యివేసి, కరిగాక, బొంబాయి రవ్వను వేసి, మాడకుండా సన్నని మంటపై గోధుమరంగు వచ్చేవరకు వేయించి, ఒక గిన్నెలో వేసి పక్కనపెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ బాణలిలో, పోపు వేసుకొని, అందులో అల్లం-- పచ్చిమిర్చి పేస్ట్లు , కరివేపాకు, పెరుగు వేసి, అందులోనే వేయించి పక్కనపెట్టుకున్న రవ్వను కూడా వేసి, బాగా కలియపెట్టి 2 నిముషాలు ఉంచి దించి పక్కనపెట్టుకోవాలి.

చల్లారిన తరవాత ఇడ్లీస్టాండ్ తీసుకొని, నూనె రాసుకొని, ఆ రవ్వ మిశ్రమాన్ని ఇడ్లీ ప్లేట్లలో వేసుకొని, కుక్కర్ లో పెట్టి, స్టవ్ వెలిగించి, కుక్కరు పెట్టి, 15 నిముషాలు ఉంచితే ఇడ్లీలు రెడీ. అంతే వేడి - వేడి రవ్వ ఇడ్లీలు మీ ముందు సిద్దం.  ఈ వేడి-- వేడి ఇడ్లీలలను కొబ్బరి చట్నీతో తింటే చాలా బావుంటుంది. లేదా మనకి ఇష్టమైన చట్నీలతో తినొచ్చును.

ఈ రవ్వ ఇడ్లీలు చేసుకోవటం చాలా సులువు. పప్పు నానబెట్టుకోవటం, రుబ్బుకోవటం వంటి ఇబ్బందులు పడకుండాఉంటాము. మనకి అర్జెంటుగా ఇడ్లీలు కావాలన్నప్పుడు ఇలా చేసుకోవచ్చును.