11.12.16

బియ్యం రవ్వ (వరినూక) ఉప్మా

బియ్యం రవ్వ (వరినూక) ఉప్మా 

కావలసిన పదార్థాలు 
బియ్యం రవ్వ - 1 కప్పు (బియ్యం సన్నగా రవ్వలాగా మరపట్టించి ఉంచుకోవాలి)  
పెసరపప్పు - 1 స్పూన్ 
ఆవాలు - 1/4 స్పూన్ 
జీలకర్ర - 1/2 స్పూన్ 
అల్లం - చిన్న ముక్క (సన్నగా చిన్నముక్కలుగా తరిగి ఉంచుకోవాలి)
పచ్చిమిర్చి - 2 (చిన్నముక్కలుగా తరిగి ఉంచుకోవాలి)
ఎండుమిర్చి - 2 (చిన్నముక్కలుగా తుంపి ఉంచుకోవాలి)  
కరివేపాకు - 2 రెబ్బలు 
ఉప్పు - రుచికి సరిపడా 
నూనె - 6 స్పూన్స్
నీరు - 2 కప్పులు  

తయారీవిధానం
ముందుగా స్టవ్ వెలిగించి బాణలి పెట్టి 2 స్పూన్స్ నూనె వేసి ఆవాలు వేసి చిటపటలాడాక పెసరపప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, కరివేపాకు అన్నీ వేసి బాగా వేగిన తరవాత 2 కప్పుల నీళ్ళు పోసి, తగినంత ఉప్పువేసి, మూతపెట్టి ఉంచాలి. నీళ్ళు బాగా మసిలిన తరవాత స్టవ్ మంట తగ్గించి, రవ్వని పోస్తూ గరిటతో తిప్పుతూ ఉండాలి. అలా తిప్పకపోతే రవ్వ ఉండలు కట్టేస్తుంది. అంతా బాగా కలిసాక 5 నిమిషాల వరకు అలాగే స్టవ్ పైనే ఉంచి తరవాత స్టవ్ ఆపెయ్యాలి. స్టవ్ ఆపిన తరవాత కూడా 10 నిమిషాల తరవాత కొబ్బరి చట్నీతో వేడివేడిగా తినాలి. అంతే కమ్మటి బియ్యంరవ్వ ఉప్మా రెడీ.   

 
                 

అటుకుల చుడవా (మిక్చరు)

అటుకుల చుడవా (మిక్చరు)

కావలసిన పదార్థాలు 
పేపర్ అటుకులు - 2 కప్పులు  
(వేరుశనక్కాయలు) పల్లీలు - 1/2 కప్పు 
పుట్నాల (చట్నీ)పప్పు - 1/2 కప్పు 
పోపుదినుసులు - ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, 
పచ్చిమిర్చి(నిలువుగా చీల్చుకొని ఉంచుకోవాలి) - 6
పసుపు - చిటికెడు 
ఉప్పు - రుచికి సరిపడినంత 
నూనె - 6 స్పూన్స్ 
కరివేపాకు - 4 రెబ్బలు 

తయారీవిధానం
ముందుగా స్టవ్ వెలిగించి, బాణలి పెట్టి, అది వేడెక్కాక, ముందుగా బాగుచేసుకొని ఉంచుకున్న అటుకులని వేసి గోధుమరంగు వచ్చేవరకు వేయించి, పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే బాణలిలో 2 స్పూన్స్ నూనె వేసుకొని, పల్లీలు & పుట్నాలపప్పు వేసి వేయించుకోవాలి, కొద్దిగా దోరగా వేగిన తరవాత పోపుదినుసులు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వెయ్యాలి, పోపు చిటపటలాడాక కరివేపాకు, ఉప్పు, పసుపు వెయ్యాలి. పోపు సామాను అన్నీ బాగా వేగిన తరవాత ముందుగా వేయించి పక్కన ఉంచుకున్న అటుకులని కూడా వేసి బాగా కలుపుకోవాలి. అటుకులకి మిశ్రమం అంతా బాగా కలవటం కోసం 2 స్పూన్స్ నూనె వెయ్యాలి. అంతే చాలా రుచిగా క్రిస్పీగా ఉండే అటుకుల చుడవా (మిక్చరు) తయారైపోయింది. చాలా సులువుగా, అతి తక్కువ సమయంలో ఈ చుడవాని చేసుకోవచ్చును. ఈ మిశ్రమంలో కొద్దిగా నిమ్మరసం వేసుకుంటే బావుంటుంది. ఇష్టమైనవారు వేసుకోవచ్చును, వేసుకోకపోయినా బాగానే ఉంటుంది.