18.4.15

ఆలూ జంతికలు (మురుకులు)

ఆలూ జంతికలు (మురుకులు) 

కావలసిన పదార్థాలు 
ఉడికించిన బంగాళదుంపలు (ఆలుగడ్డలు) - 3 కప్పులు (తొక్కతీసి ముద్దగా చేసి ఉంచుకోవాలి) 
బియ్యం (వరి) పిండి - 1/2 కప్పు  
వాము - 1 స్పూన్ 
కరం - 2 స్పూన్స్ 
ఉప్పు - తగినంత 
నూనె - 1/4  Kg 

తయారీవిధానం 
ముందుగా స్టవ్ వెలిగించి బాణలి పెట్టి నూనె పోసి కాగనివ్వాలి ..... నూనె కాగేలోపు ఉడికించిన దుంపలని తోక్కుతీసి ముద్దగా చేసుకొని అందులో పైన చెప్పిన పదార్థాలన్నిటినీ వేసి బాగా కలిపి జంతికల (మురుకుల) గొట్టంలో వేసి కాగిన నూనెలో వెయ్యాలి. బంగారు వర్ణంలో రెండువైపులా వేగిన తరవాత తియ్యాలి. అంతే కరకరలాడే ఎంతో రుచికరమైన  ఆలూ జంతికలు(మురుకులు) రెడీ ..... 

* ఇష్టమైన వాళ్ళు శనగపిండిని వాడుకోవచ్చును. ఇవి ఆలూతో చేసినవి కనుక ఎక్కువరోజులు నిలువ ఉండవు. 1 లేదా 2 రోజులు మాత్రమే ఉంటాయి.*     

   

బంబాయి రవ్వ వడలు

బంబాయి రవ్వ వడలు 

కావలసిన పదార్థాలు 
బొంబాయి రవ్వ - - 1 కప్పు 
పెరుగు - 1 కప్పు 
ఉల్లిపాయముక్కలు - 1/2 కప్పు 
పచ్చిమిర్చి - 6(ముక్కలుచేసి ఉంచుకోవాలి)
కరివేపాకు - 5 రెబ్బలు 
కొత్తిమీర తరుగు - 1/4 కప్పు 
 ఉప్పు - రుచికి సరిపడినంత 
వంటషోడా - కొంచెంగా 
నూనె - 1/4 కేజీ 

తయారీవిధానం 
ముందుగా రవ్వలొ పెరుగును వేసి రెండు గంటలు నానబెట్టాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలి పెట్టి నూనె వేసి మరిగించాలి. నూనె మరిగేలోపు  నానబెట్టిన రవ్వ  పిండిలో  ఉల్లిపాయముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర తరుగు, ఉప్పు, వంటషోడా అన్నీ వేసి బాగా కలిపి చిన్నచిన్న వడలు లాగా ఒక కవరు పైన వత్తుకొని కాగిన నూనెలో వేసి, దోరగా రెండువైపులా బంగారు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి.  అంతే  కరకరలాడే కమ్మటి బొంబాయి రవ్వ వడలు రెడీ .....ఈ  వడలని టమాటా చట్నీ లేదా కొబ్బరి చెట్నీలతో తింటే చాలా బావుంటాయి. 
     

మామిడి పండు జ్యూస్

మామిడి పండు జ్యూస్ 

కావలసిన పదార్థాలు 
మామిడిపండు ముక్కలు - 1 కప్పు 
బెల్లం తురుము లేదా పంచదార - 1 కప్పు 
కుంకుమ పువ్వు - 1/4 స్పూన్ 
యాలకులపొడి - 1/2 స్పూన్ 
ఉప్పు - చిటికెడు 
ఐస్ క్యూబ్స్ - 4

తయారీవిధానం 
ముందుగా మామిడిపండు ముక్కలని బెల్లం తురుముతో కలిపి మిక్సీలో వేసి బాగా తిప్పాలి. ఒక గ్లాసులోకి ఈ జ్యూసుని తీసుకొని,  అందులో యాలకులపొడి, కుంకుమపువ్వు వేసి కలిపి ఐస్ క్యూబ్స్ వేసుకొని తాగటమే..... ఈ వేసవికాలంలో మామిడిపళ్ళు ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి ఈ జ్యూసుని ఈ కాలంలోనే చేసుకొని తాగాలి.
       

మెక్సికన్ సమ్మర్ డ్రింక్

మెక్సికన్ సమ్మర్ డ్రింక్ 

కావలసిన పదార్థాలు 
బియ్యం - 1 కప్పు 
బాదం పప్పులు - 1/2 కప్పు 
మంచినీరు - 5 కప్పులు 
దాల్చినచెక్క - చిన్న (ఒక అంగుళం)ముక్క 
నిమ్మ తొక్క - చిన్నది (పైతొక్క మాత్రమే తీసుకోవాలి)
ఐస్ క్యూబ్స్ - 5

తయారీవిధానం 
డ్రింక్ తయారుచేసే 15 నిమిషాల ముందుగా బియ్యాన్ని , బాదాం పప్పులను నానబెట్టుకోవాలి. ముందుగా బియ్యాన్ని కడిగి, నీరు అంతా వంపి, మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. తరవాత పోట్టుతీసిన బాదాం ముక్కలను, దాల్చినచెక్క, నిమ్మతొక్క మిక్సీలో వేసి మెత్తగా పొడిలాగా  చేసుకోవాలి. బియ్యంపిండిలో ఈ మిశ్రమాన్ని వేసి, 2 కప్పుల వేడినీళ్ళు  పోసి, బాగా కలిపి ఒకరోజు రాత్రి అంతా నానబెట్టాలి. 

మరుసటిరోజు ఉదయాన్నే ఈ నానిన మిశ్రమాన్ని మళ్ళీ మిక్సీలో వేసి ఒకసారి తిప్పాలి. తరవాత మరొక 2 కప్పుల మంచినీరు పోసి బాగా కలిపి, మళ్ళీ మరో 2 గంటలు నాననివ్వాలి. నానిన తరవాత ఈ మిశ్రమాన్ని పలుచని బట్టతో లేదా వలతో (నెట్) వడగట్టాలి. ఇప్పుడు వడగట్టగా వచ్చిన రసానికి 3 కప్పుల నీరు కలిపి, పంచదార వేసి,  ఐస్ క్యూబ్స్ వేసుకుని చల్లచల్లగా తాగితే భలే మజాగా ఉంటుంది..... వేసవికాలంలో మెక్సికన్లు ఎక్కువగా ఇష్టపడి తాగే డ్రింక్ ఇదేనంట. అక్కడ ఈ డ్రింక్ కి ఎక్కువ డిమాండ్ ఉంటుందంట. ఇది ఎంతో ప్రాచీనకాలం నాటి పానీయం అని వారు చెబుతుంటారు.    
            

మిక్సిడ్ ఫ్రూట్ డ్రింక్

మిక్సిడ్ ఫ్రూట్ డ్రింక్ 

కావలసిన పదార్థాలు 
పైనాపిల్ జ్యూస్ - 2 కప్పులు 
బొప్పాయి ముక్కలు - 2 కప్పులు 
అరటిపండు ముక్కలు - 1 కప్పు 
కొబ్బరినీళ్ళు - 1/2 కప్పు 
ఐస్ క్యూబ్స్ - 6

తయారీవిధానం 
అన్నీ కలిపి జ్యూసర్ లో వేసి బాగా తిప్పి , ఒక గ్లాసులోకి తీసుకొని ఐస్ క్యూబ్స్ వేసుకొని తాగితే ...... వివిధ రకాల రుచులతో కూడుకొని ఉన్న జ్యూస్ చాలా రుచిగా ఉంటుంది .... అన్ని రకాల పోషకాలు ఒక్కసారే మనకి అందుతాయి ..... పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు. 

పైన చెప్పిన పండ్ల రకాలే కాకుండా మనకి ఏవేవి ఇష్టమో అవి అన్నీ కలిపి కూడా డ్రింక్ చేసుకోవచ్చును.

17.4.15

వాటర్ మెలన్ రోజ్ పంచ్

వాటర్ మెలన్  రోజ్ పంచ్ 
కావలసిన పదార్థాలు
గింజలుతీసేసిన పుచ్చకాయ(Water melon) ముక్కలు - 2 కప్పులు 
 స్ట్రాబెర్రీలు - 2  (చిన్నచిన్న ముక్కలుగా చేసి ఉంచుకోవాలి) 
రోజ్ వాటర్ - 4 స్పూన్స్ 
పంచదార - 3 స్పూన్స్ 
నిమ్మరసం - 1/2 స్పూన్ 
దాల్చినచెక్క - చిన్నముక్క 

తయారీవిధానం 
జ్యూసర్లో పుచ్చకాయ ముక్కలు,  స్ట్రాబెర్రీ ముక్కలు, పంచదార, దాల్చినచెక్క వేసి మెత్తగా అయ్యేటట్టుగా మిక్సీ తిప్పాలి.  ఇప్పుడు ఆ మిశ్రమంలో రోజ్ వాటర్ వేసి కలపాలి. చివరగా ఈ మిశ్రమానికి నిమ్మరసం కలిపి, ఐస్ క్యూబ్స్ వేసి, పుదీనా ఆకులతో అలంకరించి చల్లచల్లగా తాగాలి. తియ్యగా, ఎర్రగా ఎంతో ఆకర్షణీయంగా కనిపించే ఈ జ్యూసుని ఎవ్వరూ వద్దు అని అనరు. పిల్లలు - పెద్దలు అందరూ ఎంతో ఇష్టంతో తాగుతారు.    


స్ట్రాబెర్రీ లస్సీ

స్ట్రాబెర్రీ లస్సీ 

కావలసిన పదార్థాలు 
స్ట్రాబెర్రీ ముక్కలు - 3 కప్పులు 
పంచదార - 1 కప్పు 
యాలకులపొడి - 1/4 స్పూన్ 
ఉప్పు - చిటికెడు 
పెరుగు - 2 కప్పులు 
ఐస్ క్యూబ్స్ - 5

తయారీవిధానం 
జ్యూసర్ లో స్ట్రాబెర్రీ ముక్కలు, పంచదార, యాలకులపొడి, ఉప్పు వేసి బాగా మెత్తగా చెయ్యాలి, తరవాత ఆ మిశ్రమంలో పెరుగువేసి మరొకసారి మిక్సీలో తిప్పాలి. అన్నీ బాగా కలిసిన తరవాత గ్లాసులలోకి  తీసుకొని,  ఐస్ క్యూబ్స్ వేసుకొని చల్లగా తాగెయ్యటమే. అంతే చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా, చాలా రుచిగా  ఉండే చల్లచల్లని స్ట్రాబెర్రీ లస్సీ రెడీ. వేసవికాలంలో ఎండల్లో ఘనాహారాన్ని తినాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అటువంటప్పుడు ఇటువంటివి జ్యూసులు చేసుకొని చల్లచల్లగా తాగితే బలానికి బలము ఉంటుంది ...... వేసవి తాపం కూడా తగ్గుతుంది. 

        

స్వీట్ లస్సీ

స్వీట్ లస్సీ 

కావలసిన పదార్థాలు 
పెరుగు - 1 కప్పు 
పంచదార - 3 స్పూన్స్ 
రోజ్ వాటర్ - 1 స్పూన్ 
చల్లని మంచినీరు - 2 కప్పులు 
పుదీనా ఆకులు - 4
యాలకులపొడి - 1/4 స్పూన్ 

తయారీ విధానం 
జ్యూసర్ (మిక్సీ గిన్నె) లో పెరుగు, పంచదార, రోజ్ వాటర్, యాలకులపొడి & మంచినీరు పోసి బాగా తిప్పి , ఒక గ్లాసులో పోసుకొని, పుదీనాతో అలంకరించి తాగితే చల్లచల్లగా, తియ్యతియ్యగా ఎంతో  బావుంటుంది. వేసవికాలంలో ఎండలో తిరిగి తిరిగి వచ్చినప్పుడు  మంచినీళ్ళు ఎన్ని తాగినా దాహం తీరదు.  అటువంటప్పుడు పెరుగుని ఈవిధంగా లస్సీలాగా  చేసుకొని తాగితే చల్లగా ఉంటుంది, దాహం తీరుతుంది.  ఎండలో తిరిగటం వలన వేడి చేస్తుంది...... ఈ లస్సీ తాగటం వలన ఆ వేడి దూరమై - చలువ చేస్తుంది. 

     .      

ద్రాక్ష జ్యూస్ / షేక్

ద్రాక్ష జ్యూస్ / షేక్ 

కావలసిన పదార్థాలు 
గింజలు లేని ద్రాక్షపండ్లు - 100 గ్రాములు(నల్లవైనా - తెల్లవైనా పరవాలేదు)   
మంచినీరు - 1 చిన్న గ్లాసుడు
పంచదార - 1 కప్పు 
ఐస్ క్యూబ్స్ - 4

తయారీ విధానం 
ద్రాక్షపండ్లను బాగా కడిగి, పాలు & పంచదారతో కలిపి మిక్సీలో వేసి బాగా తిప్పిన తరవాత వల(నెట్)తో ఒక గ్లాసులోకి వడగట్టి, ఐస్ క్యూబ్స్ వేసుకొని తియ్యగా & పుల్లగా ఉండే ద్రాక్ష జ్యూసుని చల్లగా తాగెయ్యటమే..... అంతే చిటికెలో తయారుచేసుకోవచ్చును.

            

సీతాఫలం జ్యూస్ / షేక్

సీతాఫలం జ్యూస్ / షేక్ 

పిల్లలని సీతఫలాలు తినమంటే చాలా విసుక్కుంటారు ..... ఏవైనా పండ్ల(Fruits)ను ముక్కలుగా కోసి ఇస్తేనే తినని పిల్లలు ఈ సీతాఫలాలను తినమంటే అస్సలు ముట్టుకోరు ..... అందుకని ఈ పండ్లను జ్యూస్ / షర్బత్ / షేక్ లాగా చేసి ఇస్తే నిమిషంలో గ్లాస్ ఖాళీ చేసి పక్కనపెడతారు..... మరి ఆ జ్యూస్ ని ఎలా తయారుచెయ్యాలో నేర్చుకుందాం.     

కావలసిన పదార్థాలు 
బాగా పండిన పెద్ద సీతాఫలం పండ్లు - 2 
చల్లని పాలు - 2 కప్పులు (కాచి చల్లార్చిన పాలు)
పంచదార - 1 కప్పు 
ఐస్ క్యూబ్స్ - 4 

తయారీ విధానం 
సీతాఫలాలు బాగా కడిగి పైన తొక్కలు కొంచెం తీసేస్తే స్పూనుతో లోపలి గుజ్జును అంతా  తీసి ఒక చిన్న బౌల్ లో వేసుకోవాలి. గుజ్జును ఒక చిన్న స్పూనుతో మెదిపితే(కొడితే) ..... గుజ్జులోనుండి గింజలు బయటకు వచ్చేస్తాయి. ఆ వచ్చిన గుజ్జు, పాలు & పంచదారని కలిపి మిక్సీలో వేసి బాగా తిప్పిన తరవాత వచ్చిన జ్యూసుని ఒక గ్లాసులో పోసుకొని, ఐస్ క్యూబ్స్ వేసి సర్వ్ చేసుకోవటమే అంతే సీతాఫలం జ్యూస్ / షేక్ రెడీ ..... మారాం చేసే పిల్లలు కూడా గప్ చుప్ గా చల్లగా గడగడా తాగేస్తారు. ఇంకెందుకు ఆలస్యం ..... మీరు ట్రై చేసి చూడండి.         

బొప్పాయి షేక్

బొప్పాయి షేక్ 

కావలసిన పదార్థాలు
బాగా పండిన బొప్పాయి పండు ముక్కలు - 2 కప్పులు 
పాలు - 2 కప్పు 
పంచదార - 1 కప్పు 
ఐస్ క్యూబ్స్ - 4 

తయారుచేయు విధానం 
బొప్పాయి ముక్కలు, పాలు & పంచదార అన్నీ కలిపి మిక్సీలో వేసి బాగా తిప్పాలి. తరవాత తీసి ఒక గ్లాసులో పోసుకొని ఐస్ క్యూబ్స్ వేసుకొని తాగటమే......  చాలా సులువుగా చేసుకోవచ్చును ..... వేసవి తాపాన్ని బాగా తగ్గిస్తుంది. 


బొప్పాయి పండుకి చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రిజ్ లో పెట్టి, పిల్లలకి తినిపిస్తే చాలా మంచిది. అలా ముక్కలు తిననని మారాం  చేసే పిల్లలకి పైన చెప్పిన విధంగా షేక్ / జ్యూస్ చేసి ఇస్తే పిల్లలు ఇష్టపడి తాగుతారు.      


13.4.15

మొటిమలు రావటానికి గల కారణాలు -- మొటిమలు పోవటానికి కొన్ని చిట్కాలు

మొటిమలు రావటానికి గల కారణాలు -- మొటిమలు పోవటానికి కొన్ని చిట్కాలు

వేపుడు పదార్థాలు, ప్రోటీన్లు ఎక్కువగా ఉండే పప్పులు, పుల్లటి పదార్థాలు, మాంసం, పాల ఉత్పత్తులు, కోడిగుడ్లు మొదలైనవి ఎక్కువగా తీసుకోవటం వలన మలబద్దకం ఏర్పడుతుంది. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది - అది మనం తీసుకునే ఆహారాన్ని బట్టే ఉంటుంది.  

మొటిమలు రావటానికి గల కారణాలు  

1) మొటిమలు ఎక్కువగా యుక్తవయసు(టీనేజ్) పిల్లలకి వస్తాయి. అందుకు మలబద్దకం ముఖ్య  కారణం(సమయానికి ఆహారం తీసుకొని, సమయానికి నిద్రపోతే మలబద్ధకం వచ్చే అవకాశాలు తక్కువ)   
2) ఒత్తిడి కూడా ఒక కారణం 
3) తినే పదార్థాలలో కెమికల్స్ ఉండటం, కాలుష్యం ఉన్న ప్రదేశాలలో చిరుతిళ్ళు తినడం. 
4) మసాలాలు, నూనె వస్తువులు, చేదు, పులుపు, ఎక్కువగా ఉన్నవాటిని తీసుకోకూడదు. 


మొటిమలు పోవటానికి కొన్ని చిట్కాలు  

1) మొటిమలు ఉన్నవాళ్లు రోజుకి కనీసం 10 గ్లాసులు మంచినీళ్ళు తాగాలి 
2) కొబ్బరి నీళ్ళు తాగాలి 
3) తాజాగా వండిన వంటకాలనే తినాలి. 
4) వంటికి  చలువచేసే వంటలని మాత్రమే తినాలి 
5) తీసుకునే ఆహారంలో సోంపు, ధనియాలు, ఉసిరిక, కలబంద మొదలైనవి ఉండేటట్టు చూసుకోవాలి. 
6) మెంతులను నీటిలో నానబెట్టి, వాటిని మెత్తగా నూరి, ఆ పేస్టును ముఖానికి రోజూ రాసుకోవాలి. అది పూర్తిగా ఆరిపోయిన తరవాత ముఖాన్ని చల్లటి నీతితో కడిగివేయాలి. 
7) కలబంద జెల్ లో పసుపు కలిపి ముఖానికి ప్యాక్ వేసుకొని అరగంట తరవాత చల్లటి నీతితో కడుగుకోవాలి. 
8) వెల్లుల్లి రెబ్బలని విరిచి మొటిమలు ఉన్నచోట రుద్ది చల్లటి నీతితో కడుక్కోవాలి. 
9) వేపాకులు, పసుపు కలిపి నీటితో తడిచేసి పేస్ట్ లాగా చేసుకొని, ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. ఆరిపోయాక నీటితో ముఖాన్ని కడుక్కోవాలి 
10) లవంగాలను నీటిలో నానబెట్టి వాటిని మెత్తగా నూరుకొని, మొటిమలపై రోజూ రాస్తూ ఉంటే, కొద్ది రోజులకి మొటిమలు ఎండిపోయి మచ్చలు కనిపించవు. 
11) తులసి, పుదీనా ఆకులను మెత్తగా నూరుకొని కొన్ని రోజులు ముఖానికి రాసుకుంటుంటే కొద్ది రోజులకి మొటిమలు తగ్గిపోతాయి .
12) రోజ్ వాటర్ లో గంధాన్ని కలిపి ముఖానికి రోజూ రాస్తుంటే, కొద్ది రోజులకి మొటిమలు తగ్గిపోతాయి. 
13) ఇంగువలో కొద్దిగా నీటిని కలిపి పేస్టుగా చేసి మొటిమలపైన రోజూ రాస్తూ ఉంటే, కొద్ది రోజులకి తగ్గిపోతాయి.