14.9.13

వంటింటి చిట్కాలు

వంటింటి చిట్కాలు

1) గిన్నెలకు గ్రీజు మరకలు అంటితే సబ్బునీళ్ళలో వినేగార్ కలిపి రుద్దితే పోతాయి.
2) కూరలో ఉప్పు ఎక్కువైతే కాస్త బియ్యప్పిండి కలపాలి.
3) అరటికాయ ముక్కలను కాసేపు మజ్జిగలో వేసి తీసి వేయిస్తే చక్కగా వేగుతాయి.
4) ఆపిల్ ముక్కల మీద నిమ్మ రసం రాస్తే రంగు మారకుండా ఎక్కువ సమయం తాజాగా ఉంటాయి.
5) కూరలు చేసేటప్పుడు నూనె వేడెక్కగానే పసుపు వేస్తే, కూరలు వాటి సహజ రంగు కోల్పోకుండా ఉంటాయి.
6) కూరల్లో పులుసులో ఉప్పు కారం ఎక్కువయ్యినప్పుడు రెండు చెంచాల సెనగపిండిని వేయించి కలిపితే సరిపోతుంది.
7) ఇడ్లీలు మృదువుగా రావాలంటే ప్లేట్లో పిండి వేసాక తడి చేత్తో అద్దితే సరిపోతుంది.
8) పిండి వంటలు చేసేటప్పుడు బాణలిలో నూనె పొంగాకుండా ఉండాలంటే, మరుగుతున్న నూనెలో తమలపాకు వేసి … అది రంగు మారాక తీస్తే సమస్య ఉండదు.
9) పులిహొర చేసేటప్పుడు అన్నం ఉడికే సమయంలో చెంచా నెయ్యి కాని వెన్న కాని వేస్తే అన్నం ముద్ద కాకుండా పొడి పొడిగా వస్తుంది.
10) టమాటాలు వండటానికి ముందు పదినిమిషాల పాటు వేడినీటిలో నానపెడితే వంటకాలు రుచిగా ఉంటాయి.
11) వంటకాల్లో సుగంధ ద్రవ్యాలను అలాగే వేయటానికి బదులు, పొడి చేసి వేస్తే పదార్థాలు కమ్మటి వాసన వస్తాయి.
12) బియ్యం నిల్వ చేసిన డబ్బాలో, గుప్పెడు పుదినా ఆకులు వేస్తే పురుగులు పట్టవు.
13) అప్పడాలు ఉంచిన డబ్బాలో కొన్ని బియ్యం లేదా సెనగపప్పు వేస్తే మెత్త బడకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి.
14) ఆపిల్ పండ్ల పక్కనే అరటి పండ్లని ఉంచితే, అవి త్వరగా పండుతాయి.
15) కారం నిల్వ ఉంచిన డబ్బాలో చిటికెడు ఇంగువ కలిపితే పురుగులు పట్టకుండా ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది.

8.9.13

పాల ఉండ్రాళ్ళు --రవ్వ ఉండ్రాళ్ళు -- జిల్లేడుకాయలు

పాల ఉండ్రాళ్ళు 

కావలసిన పదార్థాలు

బియ్యంపిండి -- 1 కప్పు
మంచినీళ్ళు -- 2 కప్పులు
పంచదార -- 1 కప్పు
పాలు -- 1 కప్పు
యాలకుల పొడి -- 1/2 స్పూన్

తయారీవిధానం

ముందుగా స్టవ్ వెలిగించి, ఒక మందపాటిగిన్నెలో 2 కప్పుల నీళ్ళు పోసి, మరిగిన తరవాత బియ్యంపిండి వేస్తూ, ఉండలు కట్టకుండా తిప్పుతూ, అంతా బాగా కలిసిన తరవాత, స్టవ్ మంట తగ్గించి, గిన్నె మీద మూతపెట్టి 5 నిముషాలు అయ్యాక, స్టవ్ మీద నుండి దించి, చల్లారిన తరవాత చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు స్టవ్ వెలిగించి, బాణలి పెట్టి, పంచదార వేసి .. తగినన్ని నీళ్ళు పోసి మరిగించాలి. ఈ పాకంలో ముందుగా చేసి పక్కన పెట్టిన చిన్న ఉండలని వేసి, పాలు, యాలకులపొడిని వేసి, ఉండలకి పాలు... పాకం అంతా కలిసిన తరవాత దించెయ్యాలి. అంతే కమ్మని పాల ఉండ్రాళ్ళు రెడీ.




జిల్లేడుకాయలు  

కావలసిన పదార్థాలు 
బియ్యంపిండి -- 1 కప్పు 
బెల్లంతురుము -- 1 కప్పు 
కొబ్బరితురుము -- 1 కప్పు 
యాలకులపొడి -- 1/2 స్పూన్ 
నెయ్యి -- 1 స్పూన్ 
ఉప్పు -- తగినంత 

తయారీవిధానం

ముందుగా స్టవ్ వెలిగించి, ఒక గిన్నె పెట్టి నీళ్ళు పోసి, మరిగిన తరవాత, కొంచెంగా నూనె , ఉప్పు వేసి కలిపి, బియ్యంపిండిని వేస్తూ, ఉండలు కట్టకుండా తిప్పి, 2 నిముషాలు తరవాత దించుకోవాలి. చల్లారిన తరవాత చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 

ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలి పెట్టి, బెల్లంతురుము, కొబ్బరితురుము వేసి తక్కువ మంటపై ఉంచి, ఆ మిశ్రమం గట్టిపడేవరకు ఉంచాలి. చివరగా యాలకులపొడిని వేసి దించాలి. 

చేతులకు నెయ్యి రాసుకొని, ముందుగా చేసి ఉంచుకున్న ఉండలని చిన్న చపాతీలాగా చేతితోనే వత్తుకోవాలి, అందులో కొబ్బరి పూర్ణం కొంచెంగా ఉంచి, ఆ చపాతీని ఉండలుగా.... అండాకారంగా చుట్టుకోవాలి. ఇలాగ అన్నీ చేసి ఉంచుకొని... స్టవ్ వెలిగించి ఇడ్లీ రేకులలో ఈ జిల్లేడుకాయలని ఉంచి 10 నిముషాలు ఆవిరి పెట్టి, తరవాత దించుకోవాలి. అంతే జిల్లేడుకాయలు రెడీ. 



రవ్వ కుడుములు 


కావలసిన పదార్థాలు --
వరినూక(బియ్యం రవ్వ) -- 1కప్పు
శెనగపప్పు -- 2 స్పూన్స్
కొబ్బరితురుము -- 2 స్పూన్స్
జీలకర్ర -- 1/2 స్పూన్
నెయ్యి -- 2 స్పూన్స్
ఉప్పు -- రుచికి తగినంత

తయారీవిధానం:--

శెనగపప్పుని కడిగి 15 నిముషాలు నానబెట్టి నీళ్ళు వంపేసి ఉంచాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి, ఒక గిన్నెలో నీళ్ళు పోసి, మరిగిన తరవాత ఉప్పు & జీలకర్ర వేసి, రవ్వను వేస్తూ ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. నీరు అంతా ఇంకిపోయి, రవ్వ ఉడికిన తరవాత దించి చల్లారిన తరవాత, కొబ్బరితురుము - నానబెట్టిన శెనగపప్పు - నెయ్యి వేసి, గుండ్రంని ఉండలుగా చేసుకొని, ఇడ్లీ రేకులలో ఉంచి..... స్టవ్ వెలిగించి ఇడ్లీ కుక్కర్ ను సుమారుగా 10 నిముషాలు ఉంచి ఆవిరిపెట్టి, దించుకోవాలి. అంతే వినాయకునికి ఇష్టమైన రవ్వకుడుములు రెడీ.

                      
                 

3.9.13

మసాలా ఇడ్లీ

మసాలా ఇడ్లీ:--

కావలసిన పదార్థాలు:-
మినప్పప్పు  -- 1 కప్పు
బియ్యం -- 3 కప్పులు
క్యాబేజీ తురుము -- 1/4 కప్పు
టమాట ముక్కలు -- 1/2 కప్పు
బంగాళదుంపలు -- 1/2 కప్పు
క్యారెట్ ముక్కలు -- 1/2 కప్పు
ఉల్లిపాయ ముక్కలు -- 1 కప్పు
పచ్చిమిర్చి -- 4
వేరుశెనగ పప్పు (పల్లీలు) -- కొంచెంగా
అల్లం పేస్టు -- 1 స్పూన్
కొత్తిమీర తురుము -- కొంచెంగా
పోపు సామాన్లు
ఉప్పు -- రుచికిసరిపడా

తయారీవిధానం:--
మినప్పప్పు, బియ్యం విడివిడిగా నానబెట్టుకోవాలి. ఈ రెండూ విడివిడిగానే రుబ్బుకొని, ఉప్పువేసి కలిపి రాత్రంతా పులియబెట్టాలి. తెల్లారాక కూరగాయముక్కల్ని కోసి, ఉడికించి పక్కనపెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి, బాణలిపెట్టి, నూనెవేసి, పోపుసామన్లు వేసి, వేగాక ఉడికించిపక్కనపెట్టుకున్న కూరగాయముక్కల్ని, అల్లంపేస్టుని, కొత్తిమీర తురుముని అన్నీ వేసి, బాగా వేగిన తరవాత, ఇడ్లీ పిండిలో వేసి బాగా కలపాలి.

ఈ పిండిని నేయ్యిరాసిన ఇడ్లీ ప్లేటులో వేసి, 10 నిముషాలు స్టవ్ మీద ఉంచి దించుకోవాలి. అంతే వేడివేడి మసాలా ఇడ్లీ రెడీ. ఈ ఇడ్లీలలో చెట్నీ నంచుకొనే పనిలేదు. ఇష్టమైనవారు వారికి నచ్చిన చెట్నీలను నంచుకోవచ్చును.